ఆకాశం బాగా మబ్బులు పట్టింది. సన్నగా తుంపర్లు పడుతున్నాయి. టైం చూసుకున్నాను. ఉదయం ఏడయింది. బంగాళాఖాతంలో వాయుగుండమో, అల్పపీడనమో ఏదో తగలడిందట. ఇప్పుడు బస్టాండుకు ఎలా వెళ్ళాలో, ఆటోలు ఎక్కడ దొరికి చస్తాయని నా టెన్షన్‌లో నేనున్నాను. అవతల సమయానికి వెళ్ళకపోతే బస్‌ వెళ్ళిపోతుందేమో, మోహన్‌ డిసప్పాయింట్‌ అవుతాడేమోనని ఒకటే కంగారు.‘‘అమ్మా! సుజీ! వెళ్ళక తప్పదా?’’ అమ్మ గోల, నాకు చిరాగ్గా ఉంది.‘‘ఒక్కరోజుకు ఏం కొంపలంటుకు పోతాయ్‌, నా ప్రాణానికి సుఖమన్నది లేదు’’ గట్టిగానే అరిచాను.నా కేకలకి చదువుకుంటున్న సౌమ్య ఉలిక్కిపడి నాకేసి చూసింది.‘‘అది కాదే, రమ్య ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది, అమ్మ, అమ్మ అని ఒకటే ఏడుపు. పిల్లల్ని వదిలి ఇంత వర్షంలో వెళ్ళక తప్పదా?’’ అంది అమ్మ దీనంగా.‘‘ఈ మాట రాత్రి నుంచీ ఇది వందోసారి, నేనేం సిన్మాలకు వెళ్తున్నానా; షికార్లకు వెళ్తున్నానా? అర్జంటు ఆఫీసు మీటింగ్‌ తగలడిందని చెప్పాను కదా!’’ సాధ్యమైనంత గట్టిగానే విసు క్కున్నాను.

రమ్య మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని నాకేసి బేలగా చూస్తోంది. దాని కళ్ళలోకి చూడలేక పోయాను. చూస్తే దాని కళ్ళు నా కాళ్ళని కట్టేస్తాయి. మొహం తిప్పుకున్నాను. సైలెంట్‌ మోడ్‌లో ఉన్న నా సెల్‌లో కాల్‌ వస్తోంది. మోహన్‌ కాలింగ్‌... సెల్‌ నా హ్యాండ్‌బ్యాగ్‌లో పడేసుకున్నాను.‘‘సౌమ్యా! రేపటితో నీ పరీక్షలు అయిపోతాయి కదా! చెల్లిని జాగ్రత్తగా చూస్కో. రమ్యా! ఏం భయం లేదు నాన్నా! టాబ్లెట్‌ వేసుకున్నావుగా, తగ్గిపోతుంది. నేను రేపు ఈపాటికి వచ్చేస్తాగా, సరేనా? అమ్మా! క్రోసిన్‌ టాబ్లెట్‌ ప్రతీ ఆరుగంటలకు ఒకటి వెయ్యి. కాఫ్‌ సిరప్‌ ఉందిగా. అది తాగించు. ఆరెమ్పీ భాస్కరాన్ని ఓసారి వచ్చి చూడమని చెప్పానులే’’ ఎవరికి చెప్పేది వాళ్ళకు చెప్పాను.‘‘అది కాదే...’’ అమ్మ ఇంకా ఏదో అంటోంది.ఒకసారి అమ్మకేసి అసహనంగా చూసి, బ్యాగ్‌ తీసుకుని ఆతృతగా ఆటో కోసం బయటకు వచ్చాను. ప్రకాష్‌ పోయిన నాలుగు సంవత్సరాలకు ఈ రోజు ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకున్నాను.

ఎవరి సుఖం వాళ్ళు చూసుకునేటప్పుడు, నా సుఖం నేను చూసుకుంటే తప్పేవిటి? నేను మాత్రం మనిషిని కాదా? ఉప్పు, కారం తినడం లేదా? నాకు మాత్రం కోర్కెలు ఉండవా? నాకెంత వయస్సయిపోయిందనీ సర్వసంగ పరిత్యాగిలా బతకడానికి.‘‘ఆటో కావాలా మేడమ్‌?’’ ఆటో ఎదురుగా ఆగింది.‘‘బస్టాండ్‌కు పోనీయ్‌’’ అని ఎక్కి కూర్చున్నాను.వర్షం బాగానే వస్తోంది. ముసురు దట్టంగా పట్టింది. చలి గాలులు ధారాళంగా వీస్తున్నాయి. ఆటోలో ముడుచుకు కూర్చున్నాను. పది నిమిషాలు ఓపిక పడితే మోహన్‌ వెచ్చని స్పర్శలో ఉండొచ్చు.