‘‘బాపూ...మక్క ప్యాలాలే’’‘‘వద్దు బిడ్డా కడుపు నొత్తది’’‘‘ఏం నొయ్యదే...అబ్బ ఒక్కటేనే...కొనియ్యే... ఊ... ఊ.... ఊ... కొనియ్యవే’’‘‘పాప్‌ కార్న్‌....గరమ్‌...గరమ్‌... పాప్‌ కార్న్‌....పోతే దొరుకయి’’ చేతిల బుట్ట, బుట్ట నిండ పాకెట్లు, బస్సులో అటూ ఇటూ తిరుగుతున్నాడు ఒక పిల్లగాడు. ఏడుపును విని అక్కడినే నిలబడి ఇంకోసారి పాప్‌కార్న్‌’’ అన్నడు.ఈసారి తల్లి దిక్కు తిరిగిండు పిల్లగాడు. ‘‘అవ్వా...కొనియ్యే... ఒక్కటినే! మల్లడుగనే.... ఊ.... ఊ...’’ రాగం అందుకున్నడు.‘‘వద్దు బిడ్డ.... ఇంటికి పోయినంక బుగ్గలేంచిపేడుత....’’ తల్లి సముదాయించింది.

కొడుకు వినలేదు. రాగం అందుకున్నడు.ముగ్గురినీ చూసి నవ్వుకుంట దగ్గరగా వచ్చి ‘పాప్‌ కార్న్‌ గరం...గరం...’ అన్నడు పిల్లగాడు. కొడుకు రాగం ఎక్కువయింది. ధర్మయ్యకు కోపమచ్చింది. అమ్ముకునేపిల్లగాన్ని ఇరుగ జూసిండు. బుట్టల నుంచి ఒక పాకెట్‌ను ముని వెళ్లతో తీసి కొడుక్కు ఇచ్చిండు. అదే చేత్తో అంగి జేబులోంచి రూపాయి బిళ్లను తీసి ఇచ్చిండు.బిళ్లను అటూ ఇటూ తిప్పి చూసి జేబుల ఏసుకుంటూ ‘ఇంకో రూపాయి’ అన్నడు.‘‘ఏంది...? ఈ పొట్లంకు రెండు రూపాయలా? చారెడులెవ్వు! అడ్డికి పావు శేరు అమ్మవడితిరివి’’ పాకెట్‌ను ఒత్తి చూస్తూ అన్నది దేవవ్వ.తల్లి చేతిలోని పొట్లంను అందుకుని పండ్లతో చింపిండు కొడుకు.‘‘రెండు రూపాయలు గాదు...వట్టిగనే ఇత్తరు’’ ఎక్కసంగా అంటూ చేతును సాపిండు పిల్లగాడు. ధర్మయ్యకు రేషమచ్చింది. అంగి జేబు బనీను జేబు వెదికి రూపాయి బిళ్లను ఇస్తూ ‘‘మన పెరట్ల ఒక చిలుక బుక్కినన్ని కావు’’ అన్నడు నవ్వు మొఖంతోదేవవ్వ నవ్వలేదు. 

బరువుగా చూసింది.ఆమె చూపు అర్థమైనట్టు ‘‘మన చేన్ల పండిన గింజలే... ఎక్కడెక్కడో తిరిగి మన నోట్లెకే వచ్చినయి. కాకపోతే పైసలు పెడుతున్నం’’ అన్నడు ధర్మయ్య‘‘ప్యాలాల మిషిని కొన్నడా...’’కిటికిల నుంచి బస్టాండులకు తొంగి చూస్తూ అన్నది దేవవ్వ.‘‘కొనలేదు. గుత్తవట్టుకున్నడు. అక్కడ మిగిలిన మక్కలను ఇక్కడికే తెచ్చిండట’’ చెప్పిండు ధర్మయ్య.దేవవ్వ కండ్లల్ల నీళ్లు తిరగనయి. భర్తకు కనిపించకుంట తుడచుకుంటూ ‘‘పల్లికాయ పంట ఏసినోళ్లను గూడా ఆగం జేత్తండట...’’ అన్నది.అప్పటికి ఇంకా బస్సు నిండలేదు. ప్లాట్‌పారం మీద నిలవడ్డది. ఎక్కేవాళ్లు ఎక్కుతున్నరు. దిగేవాళ్లు దిగుతున్నరు.ఇద్దరూ సీటు మీద బీరిపోయి కూసున్నరు. నడుమ కూసుండి కొడుకు ముక్కప్యాలాలు బుక్కుతండు.ఇద్దరి మనసుల్లో సుడి తిరిగే బాధ ఒక్కటే. ఒకరినొకరు అడగాలనుకుని ఇష్టం లేక ఆగిపోతున్నరు. చివరికి తనే బయటపడింది దేవవ్వ.‘‘ఎట్ల...? ఊర్లెకు పోతున్నం. గనీ మనను బతుకనిత్తరా... ఆరు నెలల జీతం ముట్టె. ఇపడు ఇయ్యిమంటే యాడిస్తం. వచ్చి వారమన్నా గడవకపాయె’’ భయం భయంగా అన్నది.ధర్మయ్యకు రేషమూ..కోపమూ పొడుచుకచ్చినయి. మొఖం బిరుసుకపోయింది. ‘‘ఉండనియ్యక సంపుతడా..? సంపేదాకా పురస్తు. దుకాణంల జీతముండుటకు వచ్చినగనీ...పెండ అమ్ముడుకు వచ్చిన్నా...అదీ.... నా ఎద్దు పెండను నన్నే ఆవు పెండని అవద్దమాడి అమ్ముమంటడా....’’ అన్నడు.