విశాలమైన ఆ భవంతి ముందు కారు ఆపాను. గేట్‌ ఇంటర్‌కామ్‌ బజర్‌ నొక్కి, ‘మిస్టర్‌ స్టీవెన్‌సన్‌! నేను హేరీ!’ అని చెప్పగానే, ‘‘వెల్‌కమ్‌’’ అంటూ గేటు తెరిచాడు.మెల్లగా ఆ గేటు తెరుచుకోగానే కారు లోపలకి పోనిచ్చాను. ఇంటి ముందు డ్రై వే లో స్టీవ్‌ నా కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. కారు దగ్గరకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నాడు.

క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌కి మరింత ముసలితనం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు స్టీవ్‌ చూడ్డానికి. అతనికి ఎనభై అయిదేళ్ళు పైనే వయసుంటుంది. ఆర్మీలో పనిచేయడం వల్ల శరీరం ఇంకా దృఢం గానే ఉంది. మొహంలో ముడతలు తెల్లటి గీతలు గీసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నా కొలీగ్‌ బిల్‌ వాళ్ళ నాన్న స్టీవ్‌. డెల్‌ కంప్యూటర్స్‌లో నేనూ, బిల్‌ కలిసి పని చేస్తున్నాం అట్లాంటాలో ఒక పెద్ద కంపెనీలో వ్యాపార నిమిత్తమై ఇద్దరం వచ్చాం. మా కంపెనీకి పది మిలియన్ల డీల్‌ వచ్చింది. థాంక్స్‌ గివింగ్‌ హాలిడేస్‌ రావడంతో కొన్ని పరిస్థితులవల్ల అది సోమవారానికి వాయిదా పడింది. మాకు ఆ కంపెనీ సి.ఈ.ఓతో మీటింగ్‌ ఉంది. కనుక నేను సోమవారం వరకూ ఉండాల్సి వచ్చింది.వెనక్కి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళిరావడం కంటే ఇక్కడే అట్లాంటాలో ఉండిపోదామని అనుకున్నాం. అసలు బిల్‌ అట్లాంటాలో ఉండాలి. నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అట్లాంటాలో పని పూర్తికాగానే వాళ్ళ నాన్నని చూడ్డానికి మాంట్‌గోమరీ వెళదామని బిల్‌ అనుకున్నాడు. ఈలోగా బిల్‌ భార్య లోరా థాంక్స్‌గివింగ్‌కి షికాగో రావాల్సిందేనని పట్టు బట్టింది. దాంతో నన్ను పని ముగించుకురమ్మని చెప్పి, బిల్‌ షికాగో వెళ్ళిపోయాడు. తన వెళ్ళలేక పోయినందుకు బాధపడ్డాడు బిల్‌.

తన బదులు నన్ను వెళ్ళమని కోరాడు. హోటల్లో ఉండి చేసేదే ముందని సరేనన్నాను. అనుకోని పరిస్థితుల్లో నేను మాంట్‌గోమరీకి వచ్చాను.ఇంటి ప్రధానద్వారం బయట ‘‘స్టీవ్‌ మెకెన్నా, క్రిస్టీ మెకన్నా’’ పేర్లు చెక్కి ఉన్న ఒక ఉడెన్‌ బోర్డు కనిపించింది.లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోమని చెప్పాడు.‘‘నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది. బిల్‌ నాకు ఫోనులో అంతా చెప్పాడు’’ అంటూ నారింజ రసం ఇచ్చాడు. కుశలప్రశ్నల తరువాత క్రిస్టీని ఒక వీల్‌చైర్లో తోసుకుంటూ తీసుకొచ్చాడు. ఆమెను చూడగానే సినిమాతార మెరిల్‌ స్ర్టీప్‌ గుర్తొచ్చింది. ముఖ కవళికలు అలానే ఉన్నా, ముడ తలు పడ్డ చర్మం ఆమె వయసు చెబుతూనే ఉంది. క్రిస్టీ చూడ్డానికి స్టీవ్‌కంటే పెద్దదానిలాగే కనబడింది. మాట కూడా వణుకుతోంది. నన్ను చూసి ఒక్కసారి లేవబోయింది. పడిపోతూం డగా స్టీవ్‌ వచ్చి పట్టుకున్నాడు.