కారులో వెళ్తూ సెల్‌ఫోన్‌ అందుకున్న వెంటనే సడెన్‌ బ్రేక్‌వేశాను. కళ్లు మూసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. గుండెవేగం పెరిగిపోయింది. ప్రక్కనే నిండు గోదావరి ప్రశాంతంగా ప్రవహిస్తుంటే... కారు దిగి ఒడ్డుకు వెళ్లి నుంచున్నాను. గోదావరిపై కట్టిన రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి దగ్గరగా కన్పిస్తోంది. సరిగ్గా నెలరోజుల క్రితం... గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్‌ వస్తున్నాను. హైదరాబాద్‌ నుండి నువ్వెలా వస్తున్నావ్‌ అంటూ నన్నడిగాడు సత్య. ఒకరోజు ముందుగానే బయలుదేరుతున్న విషయాన్ని సత్యకు చెప్పి... మనం యూనివర్సిటీ మిలీనియం బ్లాక్‌ కాన్ఫరెన్స్‌హాలులో కలుద్దాం అన్నాను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తానంటూ ఫోన్‌ పెట్టేశాడు సత్య.్‌్‌్‌బరువెక్కిన గుండెతో అక్కడి నుండి కదిలాను. సత్య ఇకలేడన్న నిజాన్ని ఎందుకో నమ్మలేక పోతున్నాను. వైజాగ్‌ నుండి హైదరాబాద్‌ తిరిగొచ్చిన నెల తర్వాత పనిమీద రాజమండ్రి వెళ్లాను నేను. అదేరోజు రాజమండ్రి నుండి హైదరాబాద్‌కు నా ప్రయాణం. కాసేపట్లో నేను గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి వుండగా వైజాగ్‌ నుండి ఫోన్‌. ‘మన బ్యాచ్‌లో సత్య చనిపోయాడు. అతన్ని మనమందరం మిస్సయ్యాం’ అవతలి గొంతులో బాధ. అతనితో పంచుకున్న అనుభవాలు ఒక్కొక్కటీ గుండెల్ని తాకుతున్నాయి. అభిమానంగా అతను చూసిన చూపు నా గుండెను ఆక్రమించేసింది. అప్రయత్నంగా నా కళ్లు చెమ్మగిల్లాయి. సత్య మమ్మల్ని కలవకున్నా బాగుండేది. ఇరవై అయిదేళ్ల తర్వాత కలిసిన సత్య ముప్ఫై రోజులు తర్వాత ఇక లేడని తెలిశాక ఆ వాస్తవాన్ని భరించటం కష్టం. గుండెల్ని ఏదో బరువుగా నొక్కేస్తున్న ఫీలింగ్‌. పాపం సత్య పిల్లల పరిస్థితేంటి? ఏ ఆధారం లేని వాళ్ల భవిష్యత్‌ను ఎవరు నిర్దేశిస్తారు. ఏం చేయగలం? ఆలోచనలు నన్ను కమ్ముకున్నాయి. 

అంతలోనే పెద్దశబ్దంతో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వచ్చి ఆగింది. ఆలోచనల్ని క్షణం బ్రేక్‌చేసి ట్రైన్‌ ఎక్కాను. రాజమండ్రిలో ట్రైన్‌ఎక్కిన తర్వాత నా ఆలోచనలు వైజాగ్‌ వరకూ వెనక్కి పరుగెట్టాయి.్‌్‌్‌అది ఆంధ్రా యూనివర్సిటీ మిలీనియం బ్లాక్‌ కాన్ఫరెన్సు హాల్‌. సరిగ్గా ఇరవై అయిదేళ్ల క్రితం యూనివర్శిటీలో పి.జి. సోషల్‌వర్క్‌ చదివినవాళ్లు ఒక్కొక్కరూ అక్కడికి చేరుకుంటున్నారు. ఆత్మీయ పలకరింపులు, అభిమాన కౌగిలింతలు ఉద్వేగానికి గురి చేశాయి. ఒక్కచోట చదివిన వాళ్లు ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవటం వింతగా, విస్మయంగా అనిపించింది. వివిధ ఉద్యోగాల్లో, ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లు ఒకేచోట... నిజంగా ఆ ప్రాంగణమంతా సంతోషమే. నేనున్నానంటూ సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలి రివ్వున తాకుతుంటే ఆ అనుభూతిని వర్ణించటం కష్టం. పీజీ చదివిన రెండేళ్ల జీవితం కళ్ల ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యేసరికి యూనివర్సిటీలో ప్రతి అంగుళం మా ఆలోచనలో ఇమిడిపోయింది. మేం చదివిన క్లాస్‌రూంలు, నివసించిన హాస్టళ్లు, అల్లరి చేసిన క్యాంటీన్లు, రోడ్లపైకి గొడుగుల్లా వంగి స్వాగతిస్తున్న పచ్చని చెట్లు నిశ్శబ్దంగా ఆత్మీయతను పంచుతున్నట్లనిపించింది.