ఓ ఆదివారం నాలుగు గంటల వేళ తోచలేదని బయటికి తీసికెళ్లమని మారాం చేస్తున్న కూతురికి ఇదిగో నీకు మంచి సినిమాకన్నా బాగుండేది చూపిస్తాను అంటూ లాప్‌టాప్‌ తెరిచి ఆన్‌ చేసింది కీర్తన. బోర్లా పడుకుని గడ్డానికి చేతులాన్చి చూస్తున్న శృతి కళ్లు ఆనందంగా, విభ్రమంగా చూస్తూ ‘మమ్మీ మమ్మీ చూడుచూడు ఆ పిట్ట పిల్లలు నోళ్లు ఎలా తెరిచాయో. పిట్ట చూడు నోట్లో ఎలా పెడుతూందో అన్నం’. కొమ్మకి వేలాడుతున్న గిజిగాడి గూడులో బంగారుపిట్ట పిల్లలు కూడా కళ్లు తెరచుకునుంటే, రెక్కలు టపటపలాడిస్తూ ఎగురుతూ నోట్లో ఆహారం పెడ్తున్న ఆదృశ్యం వింతగా చూస్తూ అరిచింది.‘‘పిట్ట పిల్ల ఏమిటే, బలే పేరు పెట్టావు!’ కీర్తన నవ్వింది.‘‘మరేం అనాలి. పిట్ట కదా, దాని పిల్ల కదా- ‘‘పెద్ద కళ్లని తిప్పుతూ ఆ కళ్ల మీద పడిన జుత్తుని తోసుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది.‘పిచిక పిల్ల అంటాం, పక్షి పిల్ల అనాలా, పక్షి కూన అనాలా...’ తల్లే సందేహంలో పడింది.‘అమ్మా చూడు... చూడు... ఆ నెస్ట్‌... కాకి పిల్లలు... ఎంత క్యూట్‌గా వున్నాయో.’ మరో దృశ్యం - మరో కేక - ఆనందం ఆశ్చర్యం.‘‘మమ్మీ చూడు చూడు... ఏంటివి?’’ ఉడతలు చూపిస్తూ అడిగింది.‘‘స్క్విరల్స్‌... ఉడతలు అంటారు.’’ సపోటా చెట్టుమీద చెంగుచెంగున కొమ్మల మీంచి దుముకుతూ పక్వానికి వచ్చిన కాయలు ముందు కాళ్లతో పట్టుకు కొరుకుతూ, ‘మమ్మీ... మనం తిన్నట్టే తింటూంది చూడు...’ సంబరంగా అంది. 

కూతురు ఆశ్చర్యానందాలు చూస్తుంటే చిన్నప్పుడు సపోటా చెట్టు కొమ్మల మధ్య ఎలకలబోను పెట్టి ఉడతలని పట్టుకుని కాసేపు ఆనందించి, ఆడి, విడిచిపెట్టేస్తే తుర్రుమని పారిపోవడం... యిప్పటి పిల్లలు ఈ దృశ్యాలు ఎలా చూస్తారు...?!‘మమ్మీ... నాకో ఉడతనివ్వవు... ఆడుకుంటాను...’ ఆశగా అడిగింది.‘‘వద్దమ్మా వాటిని పట్టుకుని బోనులో పెట్టకూడదు. పాపం వస్తుంది..’’ అంటూ రామదాసు చిలకలని పట్టుకుని బంధించిన కథ చెప్పింది... శృతి కళ్లల్లో కాస్త నిరాశ -‘మమ్మీ... చూడు ఆ పారట్‌ జామకాయని ఎర్రముక్కుతో ఎలా కొరుకు తూందో మరో దృశ్యం! మరీ ఆశ్చర్యం. చిలక కొట్టిన పండు రుచి, ఆకుల్లో కలిసి పోయిన చిలకరంగు - చిలక కొరికిన పండ్లు తెల్లారి కిందపడితే ఏరుకుని గౌనుతో తుడుచుకు తినడం.... చిన్నతనంలో ఎన్ని ముచ్చట్లో...‘‘అమ్మా... ఆవు పిల్ల చూడు అమ్మదగ్గిర ఎలా పాలు తాగుతుందో... అమ్మా అలా పొడుస్తుందేమిటి, ఆవు అమ్మకి నొప్పెట్టదూ...?’’ ఆవు దూడ పొదుగు కుమ్మికుమ్మి పాలు తాగుతున్న దృశ్యం చూసి శృతి అంది.