దేవిమెల్లగా తలుపు తోసుకొని వచ్చాడు గౌతమ్‌.సోఫా మీద గెంతుతున్న వైశాలి, సందీప్‌లు కంగారుపడుతూ దిగి, తమ రూమ్‌లోకి పరుగెత్తాలా లేక అక్కడే వుండిపోవాలో తెలీక తికమకపడ సాగారు. వారి వంకే పరిశీలనగా చూసాడు గౌతమ్‌.ఇద్దరి ముఖాల్లో రక్తం ఇంకిపోయినట్లుగా తెల్లగా పాలిపోయి, వణు కుతూ కన్పించగానే, మొదటిసారిగా ఏ మూలో కలుక్కుమంది.తదేకంగా టీవీ చూస్తున్నా, పిల్లలొక్కసారిగా సోఫా దిగడంని గమనించిన అనురాధ తలెత్తి చూసింది. అంతే, ఆమె పరిస్థితీ పిల్లలకు మల్లే అయిపోయింది. తత్తరపడుతూ లేచి, భర్త చేతిలో నుండి బ్రీఫ్‌కేసు అందుకొంటూ ‘‘ఒంట్లో బాలేదా? తొందరగా వచ్చారు’’ అనడిగిందె లాగో గొంతు పెగుల్చుకొని. ఆమె వంక నిముషం పాటు తదేకంగా చూశాడు. ఆమె చూపుల్లో భయం తప్ప ప్రేమన్నది కన్పించలేదు.‘‘ఏంటండీ - ఏమైంది? అలా చూస్తున్నారు?’’ అడిగింది ఆశ్చర్యంగా.‘‘ఏం లేదు - అమ్మా నాన్నా పడుకొన్నారా?’’ అడిగారు బూట్లు విప్పుకొంటూ.మరోసారి ఆశ్చర్యపోయింది. ‘‘ఆ - ఇంతకుముందే వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళారు.‘‘అలాగా, వైశూ, సందీప్‌ ఇలా రండి?’’ అన్నాడు మామూలుగా.వాళ్ళు బెదురుగా తనని సమీపించడం గమనించి, మనసులో నిట్టూర్చాడు.‘‘ఏం? రేపు స్కూల్లేదా? ఇంకా పడుకోకుండా ఆడుతున్నారు?’’‘‘ఇప్పుడు మాకు హాలీడేస్‌ కదా’’ అన్నారిద్దరు ఒకేసారి.

‘ఓ’ నిజమే కదూ, తన స్టాఫ్‌లో కొందరు హాలిడేస్‌లో పిల్లల్ని ఊళ్ళకి తీసుకెళ్ళడానికి సెలవడిగితే, తను కాదన్నాడు అనుకొంటూ ఈ హాలిడేస్‌లో మనమూ ఎటైనా వెడదామా’’ అనడిగాడు చిరునవ్వుతో.‘‘అంటే - మీరు మమ్మల్ని తీసుకెడతారా లేక ఎవర్తోనైనా పంపిస్తారా?’’ఆ అడగటంలో అతను తమతో రాకుండా వుంటే బాగుణ్ణన్నట్టుగా ఉండటం చూసి మనసులో చివుక్కుమందతడికి.‘‘అహ - మనమంతా కలిసే - నేను రావడం మీ కిష్టమేనా?’’ అడిగాడు గౌతం. వాళ్ళు తల్లివంక చూసారు. ‘అందరం కలిసే’ అన్నట్లు సైగ చేసిందామె.‘‘సరే ఎక్కడికెడదాం? ఆలోచించుకొని చెప్పండి’’ అంటూ తన పేరెంట్స్‌ ఉన్న గదిలోకి దారి తీసాడు. అది చూసి విస్తుపోయింది అనురాధ.‘‘ఏంటీ వేళ - ఏదో తేడాగా వుంది’’ అనుకొంటూ ఏదో మాట్లాడు కొంటున్న జగపతిరావు, జానకమ్మలు అడుగుల సడికి కళ్ళెత్తి చూసారు. కొడుకునక్కడ చూడ్డంతోటే వారిద్దరి కళ్ళలో ఆశ్చర్యం, ఆనక ఆనందం పోటీపడుతూ వచ్చాయ్‌. అది చూసిన గౌతంలో ఏదో అపరాధ భావం చోటు చేసుకొంది. మౌనంగా తల్లి మంచం అంచున కూర్చున్నాడు.‘‘ఏంట్రా - కన్నా ఏమైందిరా’’ ఆతృతగా అతడి వెన్ను నిమురుతూ అడిగింది జానకమ్మ. ఆ ప్రేమపూరిత స్పర్శకి, లాలనకి అతడి కళ్ళలో చివ్వున నీళ్ళొచ్చేశాయ్‌.‘తన కళ్ళలో వీటికి స్థానముందా’ అనుకొంటూ గబుక్కున తుడిచేసుకొంటూ