కొత్తగూడెం ధర్మల్‌ ప్లాంట్‌ ‘సి’ స్టేషన్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ మినీ ఆడిటోరియంలో డ్రైవర్‌ పెంటయ్యకు ఏర్పాటు చేసిన పదవీ విరమణ సభలో మాట్లాడవలసిన వక్తలంతా అయిపోవడంతో ఇక తనవంతుగా ముగింపు పలుకులు చెప్పవలసిందిగా పెంటయ్యను కోరిండు సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న ఛీఫ్‌ ఇంజనీర్‌ హనుమాన్‌.అధ్యక్షుని చేతిలోని కార్డ్‌లెస్‌ మౌత్‌ను అందుకున్న పెంటయ్య మెల్లగా గొంగు సవరించుకుని ‘‘ఏం మాట్లాడాలబ్బా!’’ అన్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు. మూసుకున్న ఆ కళ్ళు వెనక ఒక్కసారిగా గతం రెక్కలు విప్పి విహంగమై ఎగురసాగింది. పెంటయ్యకీ రోజుతో యాభై ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి. అందుకే ఈ రోజు రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నాడు.అయితే, తను మాత్రం చూడడానికి ఏ యాభై ఏండవాడుగానో కన్పిస్తాడు. ఐదు అడుగుల పది అంగుళాల ఎత్తు, ఎత్తుకు సరిపడ మందంతో, చామనుఛాయతో, కొంచం పల్చబారి రంగువేసుకున్న నల్లటి జుట్టుతో, కళ్ళజోడుతో, టక్‌ చేసుకున్న తెల్లటి డ్రస్‌తో అరవైల నాటి తెలుగు హీరోలా మీసకట్టుతో చూడడానికి ఇష్టంగా అన్పిస్తుంటాడు.

పెంటయ్యకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇద్దరు కొడుకులకు పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఇద్దరికీ పెండ్లిళ్ళు చేసి చెరొక కారు కొనిచ్చి కంపెనీలోనే ఎంగేజ్‌కి తిప్పుకోమన్నాడు. ఆ ఇద్దరికీ చెరో ఇద్దరు పిల్లలు.కూతురు డిగ్రీ చదువు తుండగానే మంచి సంబంధం కుదరడంతో వెంటనే పెళ్ళి చేశాడు. అల్లుడికి కూడా పవర్‌ హౌజ్‌ లోనే జాబ్‌.అన్నీ బాగానే ఉన్నాయిగానీ పాపం! పెంటయ్యకు భార్య లేదు. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే పన్నెండేళ్ళ కిందట ఒక రోజు హఠాత్తుగా బాత్‌రూమ్‌లో జారిపడి తలకు గాయం కావడంతో వెంటనే చనిపోయింది.అప్పటి నుండి స్వంత ఊళ్ళో వంటరిగా ఉంటున్న తల్లిని తీసుకువచ్చి ఇంట్లోనే ఉంచుకుని ఆమె సహకారంతో పిల్లలను పెంచుకొచ్చాడు.తల్లి ఎన్నోసార్లు ‘‘కొడకా! నడికారున భార్య పోయిన సంసారం, నడితొలకరిన కాడెద్దు పోయిన వ్యవసాయం కుంటుపడుతై నాయనా! పిల్లలు చిన్నోళ్ళు. నన్ను జూస్తే నా కాటికి కాళ్ళు జాపుకున్న ముసలి దాన్ని ఎప్పుడు తొడిమ రాలుద్దో తెలవదు. నెలకు నలభై, యాభైవేల జీతమొస్తుంది. ఎవరో ఒకరు నువ్వు ఊఁ అంటె చాలు బంగారం లెక్క చేసుకుంటారు’’. అంటూ పదే పదే మళ్ళీ పెళఙ్ళ చేసుకొమ్మని కొడుకుతో పోరుపెట్టుకోసాగింది. ‘చూడమ్మా! ఇప్పుడు నాకు తెచ్చుకుంటే పెండ్లాం వస్తుందేమో గాని నా పిల్లలకు తల్లిమాత్రం రాదుగదా? నీ మాట మీద ఎవర్నో ఒకర్ని చేసుకున్నాననుకో ఆ వచేచ ఆమె ఎట్లాంటిదొస్తుందో ఏమో? పిల్లల్ని మంచిగా చూసుకుంటుందో లేదో? ఇప్పుడైతే భార్య లేదన్న బాధ ఒక్కటే, అదే రేపు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆమె మంచిది కాకుంటే అనేక సమస్యలొస్తాయి. కాబట్టి నేను మళ్ళీ పెళ్ళి చేసుకుని పిల్లల్ని ఇబ్బంది పెట్టలేనమ్మా!’’ అంటూ తల్లిమాటను ఎప్పటికప్పుడు సున్నితంగానే తిరస్కరించేవాడు పెంటయ్య.