తెలుగు గడ్డపై పుట్టి తెలుగు సాంప్రదాయాల్లో పెరిగిన మనిషి భవిష్యత్తులో వాటికి అందనంత దూరానికి వెళ్లినా వాటిని మనసునుండి చెరిపివెయ్యలేడనడానికి ఈ కథ ఒక చిన్న ఉదాహరణ.సిద్ధార్థ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో పట్టా పుచ్చుకుని ఉద్యోగం అనే రెక్కలు తగిలించు కుని ఆస్ర్టేలియా ఎగిరిపోయాడు. భారతదేశ కరెన్సీ లెక్కల ప్రకారం లక్ష రూపాయల జీతంతో మెల్‌బోర్న్‌లో వాలాడు. ఆ తరువాత రెండు నెలలకే తండ్రి సీతారామయ్య నుండి మెసేజ్‌లు రావడం మొదలు పెట్టాయి మంచి సంబంధాలు వస్తోన్నట్టు. ‘నన్ను కాస్త కుదుట పడనివ్వండి నాన్నా’ అన్నా వినిపించుకోవడం లేదు.‘నేనేం చెయ్యలేనురా అబ్బాయి. అవతల పెద్ద మనుషులు కావాలని మన గుమ్మం ఎక్కితే ఎలా పొమ్మన్ను? ఇవాళ నువ్వు గొప్ప ఉద్యోగస్తుడయ్యావని మా కళ్ళు నెత్తికెక్కాయనుకుంటారు. ఈ ఫొటోలు చూసి నచ్చితే ఊ అను, లేకుంటే లేదు’ అంటూ వాటిని ఈ మెయిల్‌లో పెట్టసాగారు.సిద్ధార్థ ఆఫీస్‌ పనిలో ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం రూంకు వెళ్లే ముందయినా ఈ మెయిల్‌ తెరచి ఒకసారి అన్నీ పరిశీలించి తండ్రికి మెసేజ్‌ పంపడం అలవాటు చేసుకున్నాడు. అన్నిట్లో ఒకటే మాట ‘నచ్చలేదు’.‘వచ్చిన వాళ్ళందరికి ఒకటే సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉందిరా’ అని సీతారామయ్య గారంటే ఆయన ఉద్దేశ్యం వేరని, తను ఇక్కడ ఎవరితోనైనా ప్రేమలో పడతానని భయం అని సిద్ధార్థ అనుమానం. ఆ భయం పోగొట్టాలని తల్లికి, చెల్లాయికి కలిపి ఒక మెసేజ్‌ ప్రత్యేకంగా పంపించాడు. 

‘నేను ఇంతదూరం వచ్చినా నా మనసు మీ మధ్యనే ఉంది. నేనేం మారి పోలేదు, మారను కూడా. మన సాంప్రదాయాలంటే నాకెంతో ఇష్టం. నాకు కావలసింది అచ్చంగా తెలుగింటమ్మాయి. చదువుకున్నది ఉద్యోగం చెయ్యడానికి ఇష్టపడిన అమ్మాయిని చూడండి’.ఆ తరువాత ఒక రెండు నెలలు ఫొటోలు రావడం ఆగిపోయాయి. సిద్థార్థ ఈ మధ్యకాలంలో సంసారానికి కావలసిన సామాన్లు అన్నీ ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టాడు. పెళ్ళనే భావన తండ్రి రంగురంగుల ఫొటోలతో మెదడులోకి ఎక్కించాక సిద్థార్థలో రంగుల కలలు ప్రారంభమయ్యాయి. విశ్వనాథ కిన్నెరసాని, నండూరి ఎంకి, బాపు నవ రసాల నాయికలు మనసును చుట్టేస్తున్నారు. సరదాగా సాహిత్యంతో పెంచుకున్న పరిచయం సమయానుకూలంగా ఇంత తియ్యని మధురానుభూతిలో మనసును తేలుస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.ఒక శుభోదయాన సీతారామయ్యగారిచ్చిన మెసేజ్‌ ఐదున్నర గంటల కాల మార్పిడిలో సిద్ధార్థ అందుకున్నాడు. ముందుగా సిద్ధార్థ చూసింది మెసేజ్‌తో వచ్చిన ఫొటో. సంక్రాంతి రంగ వల్లులు దిద్దుతున్న తెలుగింటి ముద్దుగుమ్మ, పరికిణిని ముగ్గులో పారాడకుండా పైకి దోపుకుని, శీతాకాలపు చలిని మించిన శ్రమకు రుజువుగా నుదిటిపై స్వేద బిందువులు తటాకంలో ఎత్తుగా లేచిన తామరాకుపై నీటి తుంపరలుగా మెరుస్తోంటే ముగ్గంటిన అరచేతిని మడచి మణికట్టుతో తుడుచుకోవడానికి ప్రయత్నిస్తూ కెమేరాలోకి తన రూపం ముద్ర పడుతోన్నదన్న గ్రహింపుగా రాబోతోన్న దరహాసాన్ని పెదవి దాటనీయకుండా మునిపంటితో నొక్కి పట్టినా, మందారాన్ని పరచుకుని ఉబ్బిన చెక్కిళ్ళు, విప్పారిన తామర కనుదోయినుంచి ఆ చిరునువ్వు బయట పడింది.