హైస్కూలు చదువు పూర్తయ్యే వరకూ కూడా నాన్నంటే భయమే. పదవ తరగతి ఫస్ట్‌క్లాస్‌ లో పాస్‌ అయ్యాను. మార్కులు చూసుకున్నాను. సంతోషం అంబరాన్ని అందుకుంది. ఆ రోజు నాన్న ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడూ సీరియస్‌గా వుండే నాన్న ఆ రోజు నన్ను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తే.కాలేజీలో చేరబోయే ముందు నాకు మూడు జతల డ్రస్‌లు కుట్టించారు నాన్న. ఆ డ్రస్‌లలో నా రూపాన్ని అద్దంలో చూసుకుని ఎంతో మురిసిపోయాను. కాలేజీలో ఎం.పి.సి సీటుకోసం అప్లయి చేశాను. హెయిర్‌ స్టయిల్‌ మార్చాలనుకుని...నాన్న అదివరకటిలా నాతో తండ్రిగా వుండకుండా మళ్ళీ మామూలుగా ఆయన స్టయిల్లో సీరియస్‌గా ఉండటంతో..నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. కాలేజీలో సీట్‌ వచ్చింది.సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ కాపీలపై అటెస్టేషన్‌ అవసరం కావడంతో ఆ రోజు సాయంత్రం నాన్న మూడ్‌ ఎలా ఉందో గమనించసాగాను. ఆయన ఎప్పటిలాగే అదే సీరియస్‌నెస్‌.అమ్మని అడుగుతున్నాను. ‘ఆ విషయం ఏదో నువ్వు నాన్నని అడగవచ్చు కదా’ అంది పనిలో లీనం అవుతూ! చెల్లాయి, తమ్ముడు బుక్స్‌ ముందేసుకుని కూర్చున్నారు. కానీ నాన్న టీ వీ పెడతాడేమో..బుక్స్‌ మూసేసి టి వీ చూడాలని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు వాళ్ళు.‘‘నాన్నా! కాలేజీలో నా సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌లపై అటెస్టేషన్‌ చేయించి ఇవ్వాలి. మీకు తెలిసిన ఎవరైనా గెజిటెడ్‌ ఆఫీసరు వుంటే...వారి సంతకాలు కావాలి’’ అన్నాను కాస్త ధైర్యం తెచ్చుకుని.

‘‘అలాగే లేరా! రేపు మా డివిజినల్‌ ఇంజనీర్‌ గారితో మాట్లాడతాను. సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళదాం’’‘‘అలాగే’’ అన్నాను.ఆ రోజు సాయంత్రం..రంగారావు డి.ఇ గారి ఇంట్లో...గవర్నమెంటు వాళ్ళు ఇచ్చిన ఇల్లు. దాదాపు పదహారు గదుల ఇల్లు. నాన్న గవర్నమెంటు ఎంప్లాయి కావడంతో గవర్నమెంట్‌ వాళ్ళు కట్టించిన కాలనీలో వుండేవాళ్ళం. మా కాలనీ ఊరికి కాస్త దూరంగా ఉండేది. కాలనీలో వున్న రోడ్స్‌కి ఇరువైపులా చల్లని చెట్లు ఉండడంతో హరితవనంలా వుండేది కాలనీ. ఎప్పుడూ సందడిగా వుండే ఆ కాలనీ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా వుండేది. ముందు గదిలో కూర్చుని పేపర్‌ చదువుకుంటున్నారు డి.యి గారు.