తిరువూరు సంత, వైరా సంత, చిల్లకల్లు సంత, నందిగామ సంత, కోదాడ సంత, పండితాపురం సంత, కొరవి సంత, ఏ సంతైనా కొట్టినపిండే ధర్ములుకు. బర్రైనా, దూడైనా, ఎద్దైనా, గిత్తైనా, ఆవైనా, మేకైనా సరే, ధర్ములు చూసి చెప్పాడంటే తిరుగులేదు. రేఖలు, సుడులు, కొమ్ములు, పళ్ళ వరస, కనుగుడ్డు తీరు అన్నీ సరిగ్గా వున్నాయని ధర్ములు చెప్పాడంటే, ఐయస్‌ఐ ముద్రేసినట్లే అని అంటుంటారు తోటి వ్యాపారస్తులు, మధ్యవర్తులును. ధర్ములు కులానికి తక్కువవాడే అయినా, బుద్ధిలో అగ్రజుడని అందరికీ నమ్మకం.‘ఇంత ఇంగితం అతనికెలా వచ్చిందని’ ఎవరైనా అడిగితే, ‘‘మన గొప్పతనం ఏం లేదు! మనకేం ఎరుక?! బర్రె-గొర్రె జెపుతుంది తన నడవడికను. మనం దాన్ని జూసి యిల్లా-యిల్లా అని నమ్మకం ఏర్పాటు చేసుకుంటాం, అంతే!’’ అంటూ నవ్వుతాడు ధర్ములు.ధర్ములకు తెలుసు, తన గురువెవరో? అది ఆదినారాయణ గారే. ‘ఆయన వైరా చెరువంతటి వాడైతే నేను వో రాతి చెంబంతటివాణ్ణి...’ అంటుంటాడు ధర్ములు. 

ధర్ములుకు ఆవుల్ని, ఎద్దుల్ని, వాటి పుట్టు పూర్వోత్తరాల్ని, వాటి జాతకాల్ని పరిచయం చేసింది ఆదినారాయణ గారే! అయితే దానికి ఆయన వొప్పుకోడు. ‘‘ధర్ములు, చాలా నిశితంగా చూసి నేర్చుకుంటున్నాడు. మనోళ్లు, నా వెంట ఎందరు వున్నా, ఎందుకు నేర్చుకోలేక పోయారు? అదీ వాళ్ళ నిర్లక్ష్యం - ఇది ధర్ముని నిబద్ధత’’ అంటారు ఆదినారాయణగారు.

ప్రతి సంతకు వెళ్ళి, తెలిసిన వారందరి యోగక్షేమాలు విచారించి, వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయో కనుక్కుని ఎవరికైనా అమ్మకంలోనో, కొనడంలోనో సహాయం చేసి, తనవంతు కమీషన్‌ పుచ్చుకుని, దొరికినంతలో తృప్తిగా, సంతోషంగా వుంటుంటాడు ధర్ములు.ధర్ములు పలకరించినా, చిర్నవ్వు సమాధానం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీరసం, నిస్సత్తువ, నిస్పృహ, నిర్వేదం, నిరాకరణ, నిరాదరణ అనే నెగెటివ్‌ ఫీలింగ్స్‌ కన్పించనీయడు ధర్ములు. మాట్లాడుతుంటే - మరికొంత సేపు మాట్లాడాలనిపించే రకం ధర్ములు. ధర్ములుకు ఈ విషయంలో గురువు ఆదినారాయణ గారే! ఆదినారాయణ గారు మధ్యం దిన సూర్యుడైతే, ధర్ములు వెన్నెల రాత్రి చంద్రుడు.