రాజమౌళి తెలుగువాడే కానీ ఉద్యోగరీత్యా చాలా ఏళ్లుగా ఉత్తరాదిలోవున్నాడు. రిటైరవ్వగానే అమెరికాలో వున్న ఇద్దరు పిల్లల దగ్గరా చెరో మూణ్ణెల్లూ వుండి- ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చి మా పక్కింట్లో అద్దెకుంటున్నారు ఆయనా, భార్య! విజయవాడకు దగ్గర్లోని స్వగ్రామంలో స్వంతిల్లుంది. కానీ మెడికల్‌ ఫెసిలిటీస్‌ బాగుంటాయని భాగ్యనగరానికి వచ్చారు. ఇక్కడే ఇల్లు కొనుక్కొని స్థిరపడిపోతారు. లేదూ స్వగ్రామానికి వెళ్లిపోతారు.తాత్కాలికంగా రాజమౌళిగారి అవసరాలు చూడ్డం, మాకాలనీలో ముఖ్యుల ఇళ్లకాయన్ను తీసుకెళ్లి పరిచయం చేయడం-నాకు బాధ్యత చేశారు నాన్న, రాజమౌళికి మంచి పరిచయాలున్నాయని ఆయన మాకుపయోగపడతాడనీ ఆయన నమ్మకం.

సాధారణంగా నాన్న అంచనా తప్పదు. అలా మూడు వారాలు గడిచేక- రాజమౌళి నాతో, ‘‘మేము పూర్తిగా నీమీద ఆధారపడ్డం బాగోలేదోయ్‌. దగ్గర్లో అవసరపడే చోట్లన్నీ నాకోసారి పరిచయం చేయ్‌’’అన్నాడు.భాగ్యనగరంలో పుట్టి పెరిగిన నాకు ఊరంతా కొట్టిన పిండి. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి కాల్‌సెంటర్‌ జాబ్‌ ట్రయల్స్‌లో వున్న నాకు ఇలా కొందర్ని వూళ్లో తిప్పడమే డ్యూటీగా వుంటోంది.ఒక పూటంతా నేను, రాజమౌళి ఆటోలు మారుతూ దగ్గర్లోని బస్టాప్‌, ఆటోస్టాండూ, బ్యాంకూ, థియేటర్లూ, రకరకాల దుకాణాలూ, కాఫీ హోటళ్లు వగైరాలన్నీ చూసాం.రాజమౌళి చిత్రమైన మనిషి. చాదస్తం మోతాదు కూడా ఎక్కువే.ముందుగా ఆటో ఎక్కి బ్యాంకు వెళ్లాం. రాజమౌళి ఆ ఆటోవాలని- ఆటో చాలా పాతదనీ, కిరసనాయిలు కలిపిన పెట్రోలుతో నడుస్తోందనీ అభ్యంతరం పెట్టి పొల్యూషన్‌ చెక్‌ చేయించమన్నాడు.

 ఆటోవాలా చిరాకుపడి, ‘‘ఇది భాగ్యనగరం. ఇక్కడ ఆటోలిలాగే వుంటాయి. నడుస్తాయి. దిక్కున్న చోట చెపకో’’ అన్నాడు.రాజమౌళి ఏమాత్రం చిన్నబుచ్చుకోలేదు. ఆటో దిగేక, ‘‘నేను మర్యాదగా అన్నదానికి నువ్వూ మర్యాదగా బదులిస్తే బాగుం డేది’’ అంటూ ఆటోవాలాకి డబ్బులిచ్చాడు.‘‘నువిక్కడకి కొత్తా? ఇది భాగ్యనగరం. ఇక్కడిలా మాట్లాడ్డమే మర్యాద’’ అన్నాడు ఆటోవాలి.‘‘పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది.’’ అని తనలో తను గొణుక్కోవడం వినిపించింది. ఆయనా, నేను బ్యాంకులో ప్రవేశించాం.రాజమౌళి ఒక కౌంటర్‌ వద్దకెళ్లి తన అకౌంట్‌ వివరాలుచెప్పి-అది ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చిందా? అనడిగాడు. కౌంటర్లోని వ్యక్తి వెంటనే తన చూపుడు వేలితో మరోవైపు చూపించాడు. మేమిద్దరం ఆ కౌంటర్‌కెడితే ఆయన మళ్లీ మేమొచ్చిన వైపు చూపించాడు.