ఇది ఇప్పటిదా? డెబ్బైయ్యేళ్ళ నాటి మాట.్‌ ్‌ ్‌రాయప్ప మేడమీద గదిలో కూర్చుని కిటికీలోంచి దూరంగా ఉత్తరం నుంచి దక్షిణంగా విస్తరించిన తూర్పుకొండల కేసి తదేకంగా చూస్తున్నాడు. పశ్చిమాన అపడే దిగిపోతున్న సూర్యుడి కిరణాలు పడి తూర్పు కొండలు జ్వలిస్తున్నాయి.కొండయ్య, ఎల్లారెడ్డి అప్పటికి పావుగంట నుంచి గదిలో ఎదురుచూస్తున్నారు. ఆయన్ని పిలవడానికే గాదు, చిన్న శబ్దం చేయడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కదలిక లేని రాయప్పతో పాటు కాలం కూడా స్తంభించింది.కాస్సేపటికి రాయప్ప తలతిప్పి వీరివైపు ‘ఏం’ అన్నట్లు చూశాడు.‘‘సుంకిగాడు దొరికినాడు దొరా. మధ్యాన్నం ఏదో పనిమీద ముంగిపల్లెకొచ్చినాడని తెలిసింది. ఇంతకుముందే మనోళ్ళు నలుగురు పోయి పట్టుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి మన పాత బంగళా యెనకాల షెడ్లో పడేసినారు దొరా’’ అన్నాడు కొండయ్య.రాయప్ప మొహంలో తృప్తి ఓ చిన్న కెరటమై మెరిసి అంతర్థానమైంది.‘‘కాళ్ళు చేతులు ఇరిసేసి వాణ్ణి పెన్నలో పడేస్తాం దొరా’’ అన్నాడు ఎల్లారెడ్డి కోపంగా.రాయప్ప తీక్షణంగా ఎల్లారెడ్డి వైపు చూశాడు

‘‘రేపు పొద్దున్న పంచాయతీ పెడ్తాం దొరా’’ అన్నాడు కొండయ్య దొరగారి మనోగతాన్ని అర్థం చేసుకుని.రాయప్ప కిటికీ వైపు తలతిపకున్నాడు.కొండయ్య, ఎల్లారెడ్డి నిశ్శబ్దంగా కిందికి దిగి వెళ్లిపోయారు.్‌ ్‌ ్‌‘‘అదిగాదు మామా యీ సుంకయ్య జేసిన తప్పేంటీ. ఈ పంచాయితీకి మనకూ ఏం సంబంధం? మనం పనిమానుకుని ఇపడీ పంచాయితీకేమిటికి బోతున్నట్టు? మా ఊరి యవ్వారమే నాకర్థంగాదు. మాకాడ ఇంతధ్వాన్నం గాదనుకో’’ అన్నాడు రాజన్న వడివడిగా మామ ఓబయ్య వెంట నడుస్తూ.ఉదయం తొమ్మిది గంటలవుతూంది. ఇద్దరూ డొంకారి వెంబడి రాయప్పగారి పెద్దూరి కేసి నడుస్తున్నారు.‘‘నువ్వు నోరుమూసుకోని రారా. ఎక్కువ మాట్లాడతాండావ్‌. ఎవరన్నా యింటే ముందు మన చర్మం చిట్లుతాది’’ కంగారుగా అన్నాడు ఓబయ్య ఇటూ అటూ చూస్తూ.‘‘ఈడ యెవురుండారని మనం మాట్లాడుకునేది ఇనడానికి. పెద్దూరు ఇంగా శానా దూరముండాదిలే చెప’’ తన పంతం వదల్లేదు రాజన్న.‘‘ఇందులో కొత్తేముండాది. ఇట్టాటియి మామూలే గదా. బద్వేలు గపూర్‌ సాయెబు రాయప్ప దొర గారి మామిడితోటల కాపు ఈతూరి కొన్నాడు. చాలా వరకూ అమ్ముకున్నాక సాయెబుకు ఖాయిలా దగిలింది. ఈ సుంకయ్య సాయెబు పక్కూరోడే. మిగిలిన కాపుని మారుబేరానికి ఈ సుంకయ్య సాయెబు దగ్గర కొన్నాడు. అయితే కాయలమ్ముకున్నాక డబ్బులెగ్గొట్టి పారిపోయినాడంట. నిన్న దొరికినాడంట...అదీ పంచాయితి’’ నడుస్తున్న ఓబయ్య గసపెడుతూ వివరించాడు.‘‘సరే అనుకో. ఇదేదో దొరకూ సుంకయ్యకు సంబంధించింది గదా చుట్టుపక్కల ఊర్లన్నిటికీ దండోరా యేసి అందర్నీ పిలిచి పంచాయితి బెట్టడమెందుకూ?’’ రాజన్న అసలు సందేహం ఇంకా తీరలేదు.