వాకిట్లో వాన.నడవా అంతా జల్లులు కొడుతూ, వానధాటీగా కురుస్తోంది. మధ్య మధ్యలో పహరాకాస్తున్న గూర్ఖాకేకల్లా ఆకాశం ఉరుముతోంది. ఉండుండి మెరుపులు జిగేల్మంటూ మెరుస్తున్నాయి.అంతా భీభత్సంగా ఉంది....గొప్ప చీదరగా ఉంది.కాలు బయటకు కదిపే అవకాశం లేకుండా ఉంది. ఈ వానలో ఈ ఉత్పాతంలో బస్టాండుకెలా పోవడం...?మరో గంటలో బస్టాండు దగ్గర లేకపోతే, రామగోపాలం మరింత తొందరగా దొరకడు. వాడు చెప్పినప్పుడు, చెప్పినచోటుకు వెళితేనే దొరుకుతాడు. తర్వాతెంత ప్రయత్నించినా వాణ్ణి పట్టుకోవటం కష్టం.‘‘సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు బస్టాండులో ఉండు. నేను రాజమండ్రి నుండి బయల్దేరి వస్తున్నాను. బస్సు పది నిముషాలాగుతుందనుకుంటాను... మీ ఊళ్ళో.... మనం మాట్లాడుకోవటానికి ఆ టైం చాలు’’.వాడు విజయవాడ నుంచి నిన్న ఫోన్‌చేసి చెప్పేడు. వాడు చెప్పేడూ అంటే చేసి తీరుతాడన్నట్టే... నాకందులో ఎలాటిం అనుమానం లేదు... అందుకే ఈరోజు శెలవు పెట్టేసేను. అసలింతకు బస్సు బయల్దేరి ఉంటుందా?ఇంత ప్రళయభీకరంగా వాన రువ్వేస్తూ ఉంటే, బస్సు రావటమే అనుమానం. టైం రెండున్నర దాటిపోతోంది. వర్షం మరో గంట కాదు... రెండు గంటలైనా తగ్గదేమో....! బీరువాలోంచి రెయిన్‌కోట్‌ వెతికి తీసేను. అక్కడక్కడా చిరిగి ఉందది. అయినా ఫర్వాలేదు. రెయిన్‌కోట్‌ తొడుక్కుంటూ ఉండగా తటాలున నాయకి జ్ఞాపకం వొచ్చింది. తను బలవంత పెట్టి మరీ నాచేత దీన్ని కొనిపించింది.‘‘మీరు వర్షాకాలంలో కూడా స్కూటర్‌ పక్కన పెట్టి డ్యూటీకి బస్సులో వెళ్ళరు. వర్షంలో మీరు తడిస్తే వొళ్లు పాడవుతుంది. మీకిది ఉండా ల్సిందే...’’ అని పోట్లాడి మరీ మా పెళ్ళయిన రెండేళ్ళ రోజున నాచేత వాసన్‌ కొట్లో కొనిపించింది.ఇప్పుడీ రెయిన్‌ కోటే మిగిలిపోయింది. నాయకే లేదు.

పెళ్ళయిన కొత్తల్లో మా లోకమే వేరుగా ఉండేది. టైం చూసుకునేసరికి నాలో ఆ ఆలోచనలు వొడ్డు నుంచి వెనక్కి మళ్ళిన కెరటంలా అయిపోయేయి.అవును గతం పగిలిన గాజుకాయ....గతం ఒక చిట్లిన మణిపూస.చకచకా బయటికి నడిచి, తలుపులు మూసి, తాళం వేసేను. తలమీద కేప్‌ సరిగ్గా ఉందో లేదో చూసుకుని, స్కూటర్‌ తాళం చెవులు చేత్తో పట్టుకుని వరండా చివరకి వచ్చేను. జల్లు కాళ్ళను తడుపుతూ ఉంటే, పాదాల మీదికి చీమలు పాకుతున్నట్టనిపించింది. రెయిన్‌ షూ తొడుక్కుని స్కూటర్‌ తీసి స్టార్టుచేసి హోరు మనిపడుతున్న వానలోనే బయల్దేరేను.రామగోపాలాన్ని కలుసుకోవటం నాకిప్పుడు చాలా అవసరం.్‌్‌్‌అయిదేళ్ళక్రితం విజయవాడ ఏలూరురోడ్‌లో మేం ఉండేవాళ్లం. నాకప్పుడు బ్యాంకు ఉద్యోగం వచ్చిన కొత్తరోజులు. ఆఫీసయిపోయేక వీలయినంతసేపు విజయవాడ రోడ్లన్నీ చూస్తూ తిరిగేవాడిని. సర్వీసు నుండి నాన్న రిటైరయిపోవడంతో అమ్మా, నాన్నా నా దగ్గరకే వొచ్చి ఉండిపోవడం వల్ల నాకు ఇంటి బాధ్యత కూడా లేకుండా పోయింది... ఆ రోజుల్లోనే నాయకితో పరిచయమైంది.