తెల్లవారుఝామున, నిద్రమత్తు ఇంకా వదల్లేదు... రాత్రంతా పడు కున్నా... అదేమిటో... తెల్లవారగట్ల పట్టిన నిద్ర... జోగొట్తున్నట్టే వుంటుంది! చల్లటిగాలి కూడా చెవులకీ, చెంపలకీ, తాకి బొజ్జో పెట్టుంది! చేయాల్సిన పనులు బోలెడున్నాయి. కాఫీ - టిఫెను, వంట, పిల్లలిద్దర్నీ తయారుచేసి స్కూలుకు పంపాలి. శ్రీవారి ఆఫీసు టైంకి అన్నీ సిద్ధం చెయ్యాలి... మధ్యలో పనిమనిషీ, పాలవాడూ, చెత్త తీసుకెళ్లే అబ్బాయి అరుపూ... అబ్బో ప్రపంచయుద్ధం అంటే అదేనా? నవ్వుకున్నాను. అరగంట దాటిందంటే చాలు, పాలవ్యాన్‌ చప్పుడు, దూరం నుంచి వినిపించే... ‘నమాజ్‌’ మేలుకొలుపు ‘అల్లాహో అక్బర్‌’ - అనీ, అంతలోనే అందుకు జోడీగ... వేంకటేశుని సుప్రభాతం గుడిలోంచీ, వీధి గుమ్మాని కేసి ‘ఠాప్‌’మని కొట్టి ‘పేపార్‌’ అనే విసురూ.... ఇరుగింటి, కుక్కర్‌ విజిల్‌,పొరుగువారి కిచెన్‌నుంచి గ్రైండర్‌ రొదా... ఎదురింటికాంపౌండ్‌లో ‘డుర్‌’... ‘డుర్‌’... ‘డుర్‌’ అంటూ స్కూటర్‌ స్టార్టింగ్‌ ట్రబుల్‌.... శ్రవణానందం.... ఇవన్నీ... నిత్యజీవిత సత్యరూపాలు! వీటి ముందు ప్రపంచ యుద్ధాలు గొప్పేం కాదు! ఒక్క అరగంట ఆగితే చాలు. అన్నీ మొదలవుతాయి!! ఈ ఒక్క అరగంట చిన్న కునుకు తీయాలి!! కానీ ఐదు నిముషాలు కాకుండానే... ఉలిక్కిపడ్డాను!‘‘వద్దు ... వద్దు.... ఇంక నేను భరించలేను. ఫో! పో! నీ కిష్టమైన చోటికి ఫో!’’ పెద్దపెద్ద అరుపులు... ఆ నిశబ్దప్రభాతంలో... కఠోరంగా వినిపించాయి! ఇంకా రకరకాల పదాలు రాళ్ళల్లాంటివి, శబ్దాలతో రాలుతూనే వున్నాయి! నిద్ర ఎగిరిపోయింది!! శ్రీకారం చుట్టుకున్న అరచేయిని కళ్ళకి అద్దుకుని చట్టుక్కున లేచాను.

‘ఎవరూ? ఎవర్ని ఛీత్కరిస్తున్నారు? ఇంత పొద్దున్నే ఏమి జరిగింది?’ లేచి బాల్కనీలోకి వచ్చాను. మా అపార్ట్‌మెంటులో, ఇంకా ఎవరు లేచినట్టు లేరు... పక్కనున్న ఇండిపెండెంటు ఇంట్లో ఉన్న ‘మనోహర్‌’ గొంతు అది! తల్లిని కసురుకుంటున్నాడు. ఆ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు లేచి ఏదో చెప్ప బోతున్నారు. కాని అతను వినిపించుకోవటం లేదు! రెండు మూడు వాటాలు అద్దెకిచ్చి ఒక వాటా తమకోసం కేటాయించుకున్నాడు. భార్యా ఇద్దరు చిన్నపిల్లలు, తల్లితో వుంటున్నాడు. ఏదో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు విన్నాను. రెండేళ్ళక్రితం వాళ్ళనాన్న బ్రతికి వున్నాడు. అప్పుడు ఈ మనోహర్‌ భార్యాపిల్లలతో, వేరే ఊళ్లో ఉద్యోగం చేసేవాడు. అప్పుడప్పుడు వస్తూండే వాళ్ళు.సరిగ్గా మా హాల్లో కిటికీ దగ్గర నిల్చుంటే వాళ్ళ బాల్కనీ... అదే టెర్రస్‌ పూర్తిగా కనిపించేది! అప్పుడు అద్దెకివ్వడానికి అన్ని వాటాలూ లేవు!కింద ఒక పెద్ద భాగం అద్దెకిచ్చి.. పైభాగం అంతా వాళ్ళు వుండే వారు!అతను వచ్చినప్పుడల్లా... భార్యవైపు బంధువు ఒకళ్ళో ఇద్దరో వచ్చి - మనోహర్‌ తల్లితో, తండ్రితో.... ఏదో గొడవ పడ్తుండే వాళ్ళు!