మిసెస్‌ కుమార్‌!’’చివ్వున తలయెత్తి చూశాను.సునీత... మిసెస్‌ సునీతారావ్‌...‘‘ఈ మధ్య నల్లపూసై పోయారు. బిజీనా’’‘నల్లపూసై పోలేదు. నల్లపూసలు పోయాయి. ఈ మధ్యనే’ అందామనుకున్నా అనవసరమనిపించింది.నవ్వుని అతికించుకుని, ‘‘అవు నండీ’’ అన్నాను.‘‘ఎలా నడుస్తోంది మీ కుమార్‌ గార్మెంట్స్‌’’ ఎర్రెర్రని టమేటాలు ఏరుకుంటూ నా వైపు చూడకుండానే అడిగింది.నేను కూడా నాక్కావల్సిన కూరగాయలు ఏరిబుట్టలో వేస్తూ ఆమెవైపు చూడకుండా, అంతే యధాలాపంగా చెప్పాను. ‘‘బాగానే ఉంది’’.ఆమె ఏం అడగాలని తాపత్రయపడ్తోందో నాకు తెల్సు. సూటిగా అడిగేస్తే. నేనేమనుకుంటా నోనని.... ఇంటర్వ్యూ ప్రారంభించేముందు అభ్య ర్థిని సమాయత్తపరిచినట్లు... హిపోక్రసీ పెదవుల మీంచి కారిపోతూ....‘‘మిస్టర్‌ కుమార్‌ మరో పెళ్ళి చేసుకున్నా రటగా’’ ఆమె గొంతులో కుతూహలంతో పాటు పడిన వ్యక్తిని చూసి రాక్షసంగా నవ్వుకునే హాలా హలం...ఎదుటి వ్యక్తి జీవితం కాలిబూడిదైపోతుంటే చూడటం ఎంత సరదానో వీళ్ళందరికీ...కూరగాయలన్నీ సంచీలోకి ఒంపుకుని, వస్తూ వస్తూ చెప్పాను.

 ‘‘అవునండీ. పెళ్ళికి నేను కూడా వెళ్లాను నాలుగక్షింతలు చల్లిరావడానికి’’‘‘ఆ!’’ అంటూ నోరు తెరిచింది సునీత.అక్కసుకొద్దీ అలా సమాధానమిచ్చినా మనసులో ఏదో తెలీని అలజడి....పెళ్ళయినప్పటినుండీ మా యింటికి ఫర్లాంగు దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి, కావల్సిన కూరగాయల్ని కొనటం నా కలవాటు. అవి శుభ్రంగా, తాజాగా, నవనవలాడ్తూ ఉంటే తప్ప వాటితో వంట చేయాలనిపించదు.‘‘నాకు ఆడదీ అంతే. తాజాగా... నవనవ లాడ్తూ ఉంటేనే...’’ అనేవాడు కుమార్‌.అటువంటి కుమార్‌ని నేనెలా ప్రేమించానో ఎంతాలోచించినా అర్ధమే కావటం లేదిపడు. ప్రేమ గుడ్డిది కదా...మొదటినుంచీ స్త్రీ స్వాతంత్య్రం గురించి అనర్గళంగా మాట్లాడేదాన్ని. ఇంట్లో నాన్న కూడా నన్నూ అక్కనీ అలానే పెంచారు.‘‘మగాడితో పోలిస్తే ఆడది తక్కువ అనేది నిజం కాకున్నా, సమాజంలోని ఓ వర్గం పని గట్టుకుని, వాళ్ళ స్వలాభం కోసం దాన్ని నిజమని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు నమ్మ కండి. వాళ్ళ మాయాజాలంలో పడకండి. ఏ విషయంలోనైనా మగవాడు మీకన్నా అధికుడేమో ననే అనుమానాన్ని కూడా దరిచేరనీయకండి’’ అనేవాడు నాన్న.తను అనటమే కాదు - ఆచరించి చూపేవాడు. అమ్మను తన భార్యగా, స్నేహితురాలిగానే కాకుండా ఒక్కోసారి అధికురాలనే ఆమోదించి, గౌరవించేవాడు.