దీనదయాళ్‌ బస్టాపు దగ్గర నిలుచుని ప్యాంటుజేబులో చెయ్యిపెట్టి జేబులో వున్న చిల్లర నాణేలను బయటకుతీసి లెక్కపెట్టాడు. ఆరు రూపాయలు వున్నాయి. అప్పటికి అలా అంతకు ముందు కొన్నిసార్లు లెక్కపెట్టి జేబులో వేసుకున్నాడు. ఎన్నిసార్లు లెక్కపెట్టినా ఒక్క రూపాయి కూడా పెరగలేదు. అంతటి విషాదంలోనూ అతడికి నవ్వొచ్చింది. ఎన్నిసార్లు లెక్కపెట్టినా జేబులో లేని డబ్బులు ఎక్కడినించి వస్తాయని?అతను అలా మాటిమాటికీ జేబులో నించి చిల్లర డబ్బులను తీసి లెక్క పెట్టటాన్ని అతని పక్కనే నిల్చున్న దీక్షితులు చూస్తూనే వున్నాడు. దీనదయాళ్‌ ప్రవర్తన ఆయనకు కొంచెం వింతగా అనిపించినా విషయం ఆయనకు కొంతవరకు అర్ధమయ్యింది.దీనదయాళ్‌ రూపం, ప్రవర్తన అతడి పేదరికాన్ని బాగా సూచిస్తున్నాయి. అతను చవకబారు మాసిపోయిన బట్టలు ధరించాడు. ఓ మాదిరిగా పెరిగిన గడ్డం, బాగా ఎండలో తిరిగినందువల్ల మాడిపోయినట్టు వున్న వొంటి రంగు అతడి పరిస్థితిని సూచిస్తున్నాయి.ఆ బస్టాపుకు సరిగ్గా ఎదురుగా ఒక భోజన హోటలు వుంది. భోజన సమయం కావటంతో చాలామంది ఆ హోటల్లోకి వెళ్లి భోజనం చేసి బయటకు వస్తున్నారు. అలా లోపలకు వెళ్లి బయటకువస్తున్న వాళ్లని అసూయగా చూస్తూన్నాడు దీనదయాళ్‌. అతడికి బాగా ఆకలిగా వుంది. రాత్రి కూడా భోజనం చెయ్యలేదు.బాగా ఎండగా వుంది. మధ్యాహ్నం. రోడ్డు మీద మోటారు వాహనాలు అప్పుడప్పుడు తిరుగుతున్నాయి.

దీనదయాళ్‌ ఆలోచిస్తున్నాడు. తన దగ్గర వున్న డబ్బులతో భోజనం కాదుగదా కనీసం ఏ రకమయిన టిఫిన్‌ ఐటమ్‌ కూడా రాదు. ఒకవేళ ఆ డబ్బులతో ఏదయినా తిన్నా, సిటీ బస్సులో ఇంటికి వెళ్లటానికి డబ్బులు వుండవు. నాలుగు కిలోమీటర్లు ఆ ఎండలో నడిచి వెళ్లాలి.ఆ బస్టాపుకు కొంచెం దగ్గరలో వున్న ఓ ఫ్యాన్సీ షాపులో ఓ గుమస్తా ఉద్యోగం గురించి అడగటానికి వచ్చాడు దీనదయాళ్‌. అడిగాడు. కానీ రెండ్రోజుల క్రితమే ఖాళీగా వున్న ఆ ఉద్యోగంలో ఎవరో జేరారుట. ఖాళీ లేదు. నిరాశపడ్డాడు అతను.ప్రస్తుతం దీనదయాళ్‌కు ఏ పనీ లేదు. ఖాళీగా వున్నాడు. ఇంతకుముందు దీనదయాళ్‌ ఓ పుస్తకాల షాపులో గుమాస్తాగా పని చేసేవాడు. కానీ ఇరవై రోజుల క్రితం నష్టం వస్తోందని ఆ షాపు యజమాని దాన్ని మూసేశాడు. అంతటితో దీనదయాళ్‌ ఉద్యోగం పోయింది. అతడు అక్కడ పని చేసిన రోజులకు ఇచ్చిన జీతంతో ఓ వారం రోజుల క్రితం వరకు గడిపాడు అతను. తర్వాత ఇల్లు గడవలేదు. అందువలన భార్య, ఇద్దరు పిల్లలను భార్య పుట్టింటికి పంపించి తను వొక్కడే వుంటున్నాడు ఇంట్లో. క్రితం రోజు వరకూ బాగా తెలిసిన స్నేహితుల దగ్గర అప్పులు చేస్తూ గడిపాడు. ఇప్పుడు అతనికి అప్పుకూడా దొరకటం లేదు. మరో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే వున్నాడు. కానీ దొరకలేదు.