సెషన్సు జడ్జి వృషాకపి తన ఎదురుగా నిలుచున్న పాతికేళ్ళ పుళిందను తేరిపార చూశాడు. కోర్టు హాలు కిటకిటలాడుతోంది. ‘‘అమ్మాయి! నీ అత్త గారిని విషంపెట్టి చంపావని నీ మీద అభియోగం. నేరం వపకుంటావా లేక సాక్షులను ప్రవేశపెట్ట మంటావా?’’‘‘సాక్షులక్కర్లేదు. వాళ్ల బొంద. ఏం చూశారని సాక్ష్యం చెబుతారు. నేను మా అత్తగారికి విషమిచ్చి చంపిన మాట ముమ్మాటికీ నిజం. మీ మీదొట్టు’’ పుళింద నిర్భయంగా చెప్పింది.వృషాకపితో సహా అందరూ వులిక్కిపడ్డారు. ఒక ప్లీడరు గుమాస్తా బలే సంతోష పడ్డాడు. తన మామగారు చనిపోయిం తర్వాత తన ఇంట్లో తిష్ట వేసిన అత్తగారిని లేపేయాలని బహుతొందర పడుతున్నాడు. ధైర్యం చాలడం లేదు. పుళిందను చూసి ఈమె అత్యంత సాహసి అతిలోక అతివ. ఈమె చిరంజీవిగా వర్ధిల్లాలి నిండు మనసుతో నిశ్శబ్దంగా దీవించాడు.‘‘అంత ధైర్యంగా - అంటే - అసలు ఆ విషం తన పని సవ్యంగా చేస్తుందనే - ఏ నమ్మకంతో ఆ పని చేశావు అమ్మాయీ!’’ వృషాకపి తాపీగా అడిగాడు.‘‘ఫలానా సబ్బు మరకలు పోగొడుతుందో లేదోనని అనుమాన పడవచ్చు. ఈ విషం విషయంలో అలాంటి అనుమానమక్కర్లేదు. ఎందుకయినా మంచిదని ముందు మా పెంపుడు కుక్కకు తాగించాను. అది నా వైపు జాలిగా చూస్తూ ప్రాణాలొదిలింది.’’మళ్ళీ అంతా యధావిధిగా ఉలిక్కిపడ్డారు. 

పి.పి.లేచి కుక్కను చంపిన అభియోగం కూడా అదనంగా చేర్చమని ప్రాధేయ పడ్డాడు.భారతీయ శిక్షా స్మృతిలో కుక్కను గానీ మరే పెంపుడు జంతువును కానీ ఉద్దేశపూర్వకంగా చంపితే ఏ సెక్షను క్రింద శిక్షించవచ్చో తెలుపుతే తప్పకుండా అలాగే చేద్దామన్నాడు వృషాకపి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ మొత్తం పి.పి మనోనేత్రాల ముందు గోచరించింది. పేజీలు వాటికవే తిరిగి పోతున్నాయి. కానీ కావాల్సిన సెక్షన్‌ తగల్లేదు.‘‘కుక్క ముండమొయ్యా. దాని సిగతరిగిరి. సెక్షన్‌ తగల్లటం లేదు. అత్తగారిని చంపిన దాని గురించి ఆలోచించండి.’’ పి.పి. వినయంగా విన్నవించుకున్నాడు.‘‘అమ్మాయీ! మీ అత్తగారిని ఎందుకు చంపవలసి వచ్చిందో చెబుతావా?’’‘‘ఏం చెయ్యమంటారు? నా కార్పోరేటు బిజినెస్‌లో నాకు అడుగడుగునా అడ్డం తగులు తున్నది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే చాటుగా వింటున్నది. నా బిజినెస్‌ ప్రత్యర్ధులకు ఫోన్‌ చేసి నా గుట్లుమట్లు చెప్పేస్తున్నది. ఎలాగోలా నా వ్యాపారం లాక్కోవా లని చూస్తున్నది. ఇలా చేస్తే మీరు మాత్రం సహిస్తారా చెప్పండి.’’ ఒక్క గర్జనతో వృషాకపిని నిలదీసింది.మళ్ళీ కోర్టు హాలంతా నివ్వెరపోయింది. ఈవిడను చూద్దామా మధ్యతరగతి మహిళ. కార్పోరేట్‌ బిజినెస్‌ ఎక్కడిది - ఈవిడ ఎత్తులకు అత్తగారి పై ఎత్తులెక్క డివి. వృషాకపి అదే విషయం అడిగాడు.