సాయంత్రపు సంధ్యాకాంతులు, సౌభాగ్య చెంపలపై బడి, ఆమెలో వింత అందాన్ని ఆపాదిస్తుంటే తన్మయుడై ఆమె వంకే చూడసాగాడు మోహన్‌. ఎందుకో తలతిప్పిన సౌభాగ్య ‘‘ఏంటీ’’ అన్నట్టుగా కనుబొమల్ని సుతారంగా పైకిలేపి అడిగింది భర్తని.‘‘నీ అందం ప్రమిద కాంతిలా వెలిగిపోతుంటేనూ’’ అన్నాడతను.‘‘ఇంకా నయం. పెట్రోమాక్స్‌లైట్‌ అన్నారుగాదు’ అందామె నవ్వుతూ.‘‘అదెక్కువ కాంతినిచ్చేమాట నిజమే గానీ, ప్రమిద నుండి వచ్చే వెలుగు కంటికింపుగా ఉంటుందోయ్‌. గోదారి నదిలో, కార్తీకమాసంలో అరటి దొప్పల్లో వదిలిన దీపాల అందం నీలో కన్పిస్తూ వుంటుంది - కరెక్ట్‌గా చెప్పాలంటే’’ అన్నాడతను లేచి ఆమె పక్కన కూర్చుంటూ.‘‘లేచారూ... ఇక నేను ప్రకృతి అందాన్ని ఆస్వాదించినట్లే’’ అందామె.‘‘ఇంతసేపూ నువ్వు ఆస్వాదించావ్‌- మరి నేనూ ఆస్వాదించాలిగా’’ అన్నాడామె ఒళ్ళో పడుకుంటూ ‘‘అచ్చంగా ఉయ్యాలూగుతున్నట్లే వుంది. అందుకే రైలు ప్రయాణాలని ఎంజాయ్‌ చేస్తుం టాను.’’‘‘అందులోనూ కూపే బుక్‌చేసి మరీనూ’’ అతని మాటలని పూర్తిచేస్తూ అంది తన నడుము ముడతలని సవరిస్తున్న అతని చేతుల్ని పట్టుకొంటూ ‘‘అబ్బ చక్కిలిగిలి’’ అంది.‘‘మరి నలుగురిలో సరాగాలు తప్పంటావ్‌ కదాని ‘కూపే’ బుక్‌చేశాను. నాకు నువ్వు - నీకు నేను - అన్న ఫీలింగ్‌ వుంటుంది. ఏం నీకలా లేదా?’’ అన్నాడు తను లేచి ఆమెను ఒళ్ళోకి లాక్కుంటూ.

 ఆమె ముంగురుల్ని సవరిస్తూ ‘‘నెలరోజులు ఎంతలో గడిచిపోయాయ్‌. ఏదేమైనా మన హానీమూన్‌ దివ్యంగా జరిగింది కదూ’’ అన్నాడు మోహన్‌.‘‘అవును - నిముషాలు క్షణాల్లా దొర్లిపోయాయ్‌’’ అందామె హస్కీ వాయిస్‌తో.అతను మెల్లగా వంగి ఆమె కళ్ళమీద ముద్దుపెట్టుకున్నాడు. సంపంగి వంటి ఆమె ముక్కుని స్పర్శిస్తూ - పగడాల వంటి ఆమె పెదవులే తన గమ్యస్థానమన్నట్లు, తన పెదవులను అక్కడ ఆన్చాడు - పెదవులు చాలాసేపు కుశల ప్రశ్నలు వేసుకొన్నయ్‌ ఎన్నోఏళ్ళ తర్వాత కలిసిన ఆప్తమిత్రుల్లా.‘‘ఎవరన్నారవి కన్నులని - అరరే మధువొలికే గిన్నెలవి - ఎవరన్నారవి బుగ్గలని - ఎర్రని రోజా మొగ్గలని’’ అంటూ అతడు హమ్‌ చేస్తుంటే ‘‘అబ్బో అయ్యగారికి ఎప్పటిపాటలో బాగానే గుర్తుకొస్తున్నాయ్‌’’ అంది అతడిని ఇష్టంగా అల్లుకుపోతూ. ఆ కౌగిలి పలికే ఆహ్వనానికి, ఆమె నుండి వస్తోన్న వింత పరిమళానికి ఎప్పట్లాగే అతడు - పరవశుడయ్యాడు. ఆమె అందాలను కనులారా చూస్తూ ‘‘తనివి తీరలేదే - నా మనసు నిండలేదే’’ అనుకొంటూ ఆమెను పొదవి పట్టుకొన్నాడు. అతడి చేతుల్లో మైనపు ముద్దే అయింది సౌభాగ్య. తీయటి అలసటతో క్షణాల్లో నిద్రలోకి జారుకొంది. తృప్తి నిండిన కళ్ళతో ఆమెను చుంబిస్తున్న మోహన్‌, ఆమె నుదుటిన వున్న గాయాన్ని - ఆప్యాయంగా తడుముతూ గతంలోకి జారుకొన్నాడు.