‘‘ఎపడూ ఆఫీసు గొడవేలేనా ఇంటి విషయాలేమైనా పట్టించుకునేదుందా?’’ అని అంది శ్రీమతి ఓ రోజు పొద్దున్నే‘‘ఏంటో చెప’’ అన్నానుఆశ్చర్యంగా.‘‘ఇంకా ఏంటి అంటారేమిటి? మన అబ్బాయి సంగతే. నిన్న పక్కింటి అబ్బాయిని కూడా స్కూల్లో చేర్పించేశారు. మరి మన బంటీ సంగతేమిటీ? వాడిని స్కూల్లో వేయొద్దా?’’‘‘వాడికి ఏమంత వయస్సు మించిపోయిందని ఇంకా కొంత కాలం ఆటపాటలతో గడిపి పెద్దగా అవ్వనీ.. అపడు చూద్దాం’’అదేంటీ అలా మాట్లాడతారు. వచ్చే నెలకి మూడు సంవత్సరాలు నిండుతాయి. స్కూల్లో వేసే వయస్సే అది. ఇపడు స్కూలుకి పంపడం అశ్రద్ధ చేస్తే పిల్లాడు చదువులో వెనకబడిపోతాడు. మీకీ మాత్రం తెలియకపోతే ఎలా?’’ అంటూ విసుక్కుంది మా ఆవిడ.‘‘అది కాదే వాడికి బ్యాగ్‌ పట్టుకోవడమే సరిగా చేతకాదు. ఇప్పట్నించీ ఆ బరువులు మోయించకపోతే ఏం? ఇంకొన్నాళ్లు పోనీ చూద్దాం’’ అన్నాను.‘‘అదేం కుదరదు. మీరు ఈ రోజు రెండు మూడు స్కూళ్ల నుంచి అప్లికేషన్‌ ఫారాలు తీసుకురండి’’ అంది.‘‘మరీ ఇంత చిన్న వయసులోనే పిల్లల్ని ఆటలకు దూరం చేసి స్కూలు చదువులంటూ వెంటపడడం మంచిది కాదేమో ఇంకొన్నాళ్లు పోనీ చూద్దాం’’ అన్నాను మళ్లీ.‘‘అలాగయితే ఇహ వాణ్ణి స్కూల్‌కి పంపినట్లే. మంచి స్కూల్లో సీటు దొరకడం మాత్రం అంత తేలికనుకుంటున్నారా? ఇప్పటి నుంచే ప్రయత్నం చేయకపోతే ఆఖరికి గవర్నమెంటు స్కూల్లో చేర్పించాల్సి వస్తుంది. 

మీతో వాదనెందుకు? అప్లికేషన్‌ ఫారాలు మీరు తీసుకువస్తారా? నన్ను తెచ్చుకోమంటారా?’’ బెదిరింపు ధోరణిలో అంది నా శ్రీమతి.‘‘పిల్లలు ప్రతిభావంతులైతే ప్రత్యేకమైన స్కూళ్లే అక్కర్లేదు. కాకపోతే వారి టాలెంట్‌ను గుర్తించి కనీస సదుపాయాలు కల్పించడం తల్లిదండ్రులుగా మన విధి. మరో విషయం... ఖరీదైన స్కూళ్లలో చదివినంత మాత్రాన గొప్పవాళ్లయిపోరు. మన దేశంలో ప్రముఖులందరూ వీధి దీపాల కింద చదువుకున్నవాళ్లే.’’ అంటూ విషయాన్ని పక్కదోవ పట్టిద్దామని ప్రయత్నించాను. అయినా నా ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరకు మా ఆవిడ చెప్పినట్లే స్కూళ్ల వెంట పడ్డాను. ఎలాగయితేనేమి కష్టపడి డబ్బునష్టపడి ఓ రెండు స్కూళ్ల నుంచి అప్లికేషన్‌ ఫారాలు తీసుకొచ్చాను. ఫారాలు చాలా పెద్దవిగా వున్నాయి. అందులో ఎన్నో వివరాలతో పాటు రకరకాల ప్రశ్నలు వున్నాయి.‘‘పిల్లాడు ఎపడు పుట్టాడు? డెలివరీ ఎలాగయ్యింది? సిజేరియనా? నార్మలా? పుట్టినపడు బిడ్డ బరువెంత? ఇపడు బరువెంత? పొడుగెంత?అపుడెంత? ఇపడెంత? నిద్రలో పక్క తడుపుతాడా? నిక్కరు తొడుక్కోవడం వచ్చా? బటన్స్‌ పెట్టుకోగలడా?షూస్‌ లేసులు కట్టుకోగలడా?జీర్ణవ్యవస్థలో లోపాలేమైనా వున్నాయా? తిండి తినే విషయంలో పెంకితనం చేస్తాడా? హార్లిక్స్‌, బూస్ట్‌లాంటి హెల్త్‌ డ్రింక్స్‌, ఖరీదైన పదార్థాలు పెడతారా లేదా? ఇంటి చుట్టుపక్కల వాతావరణం, ఇరుగుపొరుగు పిల్లల ప్రవర్తన ఎలాగుంది? తల్లిదండ్రి ఎవరు? వాళ్లది దగ్గర సంబంధమా? దూరపు సంబంధమా? ఏం పనిచేస్తారు? వాళ్ల మధ్య సంబంధాలు ఎలా వున్నాయి? వారంలో ఎన్నిసార్లు దెబ్బలాడుకుంటారు?మాతృభాష ఏమిటీ? ఇంట్లో ఏ భాష మాట్లాడతారు?తల్లిదండ్రులకి ఎన్ని భాషలు తెలుసు? ఇంట్లో ట్యూషన్ల వంటివేమైనా చెప్పించగలరా? స్కూల్‌ నుంచి ఇల్లెంత దూరం? పిల్లాడు స్కూలుకెలావస్తాడు? అతని వెంట ఎవరు వస్తారు? చీకటన్నా లేదా పిల్లి, ఎలుక, వంటి వాటిని చూసి భయపడతాడా? తల్లిదండ్రులు కోపిష్టులు ఆందోళన మనస్కులా? పిల్లాడ్ని అతి గారాబం చేస్తారా? భోజనం చేయడం, స్నానం చేయడం. స్కూల్‌ బ్యాగ్‌ సర్దడంవంటివి అతను చేసుకోగలడా?’’ వంటి యక్షప్రశ్నలు లక్ష వున్నాయి వాటిలో.