‘చెప్పరా...! జగ్గూ... ఏంటి విశేషాలు... అంతా బాగున్నారా! అమ్మ ఎలా ఉంది... ఏం... రా.. మాట్లాడవు...’‘నన్ను మాట్లాడనిస్తే న్రా... నువ్వు... అంతా బాగానే ఉన్నారు. వదినకి ఆరోగ్యం బాగానే ఉంది... తొమ్మిదో నెల వచ్చింది. నా బ్యాంకు ఉద్యోగం చాలా భేషుగ్గా ఉంది. కాని అమ్మని... తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది... కాని నేనేం చేయగలను...’ఏమైంది... అమ్మకి... ఏం జరిగింది... అన్నాను ఆత్రుతగా.ఏమీ కాలేదు...రా... కంగారు పడకు.. ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంది. నువ్వు రెండు నెలల్నించి... ఇదిగో వస్తాను.. అదిగో వస్తాను... అని వాయిదాలు వేస్తూ... దేశాలు పట్టుకు తిరుగుతున్నావు నీకు అమ్మని చూడాలని ఉందో... లేదో నాకు తెలియదు.. కాని అమ్మ మటుకు... ప్రతిక్షణం.. నిన్నే తలుచుకుంటోంది. అప్పుడప్పుడు ‘‘నాకు రెక్కలుంటే బాగుండు న్రా...జగ్గూ... వాడు ఎక్కడ ఉన్నా... ఎంత దూరమైనా... ఎగిరివెళ్ళి చూసి వచ్చేదాన్ని...’’ అని అనుకుంటూంటుంది.అంత నిష్ఠూరంగా మాట్లాడకురా...జగ్గూ... నువ్వున్నావన్న ధైర్యంతో... నేను వాయిదాలు వేస్తూ వస్తున్నాను. ఈ రోజు ఉదయం ఇండియా వచ్చాను. ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్‌ సిటిలో ఉన్నాను. ఇక్కడ...డాక్టర్స్‌... అందరికి ఒక సెమినార్‌... ఏర్పాటుచేసి... ఫారెన్‌లో ప్రవేశపెట్టిన నూతన వైద్యవిధానాలు...చికిత్సలు గురించి చెప్పాలి... 

ఇక్కడ మీటింగ్‌ పూర్తయ్యాక.. రాత్రి బయలుదేరి... రేపు ఉదయం.. అమ్మ ఎదురుగా ఉంటానని చెప్పు... ఇంక ఎక్కడికి వెళ్ళకుండా... మన ఊళ్ళో అమ్మపేరుతో ఒక క్లినిక్‌ కడదామనుకుంటున్నానని కూడా అమ్మకి చెప్పు... సంతోషిస్తుంది... అన్నాను.ఎన్నిసార్లు చెప్పలేదురా... ఇలాంటి కబుర్లు... అన్నట్టు ఒక ముఖ్యవిషయం చెప్పాలి నీకు... నువ్వు ప్రముఖ మానసిన వైద్యనిపుణుడవు కదా!... అమ్మ మనసులో ఏదో బాధ పడుతూంటుంది. అదేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించ రాదూ...? వదిన పురిటికి వెళ్ళిందగ్గర్నుంచి ‘‘ఒంటరిగా... ఉండలేక పోతున్నానురా...’’ నన్ను ఓల్డ్‌ ఏజ్‌ హోంలో చేర్చరా... అని పట్టుబట్టు కూర్చుంది. అసలు వదిన పుట్టింటికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు... ‘‘అత్తయ్యగారు ఒక్కరూ ఉంటారు...నేను రాలేను...’’ అని తీసికెడదామని వచ్చిన వాళ్ళ నాన్న గార్నికూడా వెనక్కి పంపేసింది. పాపం! తనక్కుడా నెలలు నిండాయి, పనిచేసుకోలేకపోతోంది ఆ బాధ చూసి... అమ్మ.. వాళ్ళ నాన్న గార్కి ఫోన్‌చేసి రప్పించి...బలవంతాన ఆయనతో పంపింది. అప్పట్నుంచి అమ్మ.. ఒంటరితనంతో బాధపడతూ... మూడీగా ఉంటోంది. ఆవిడ కోరిక మేరకు ‘‘ఓల్డ్‌ ఏజ్‌ హోం’’లో చేర్చాను. అక్కడి వాతావరణం... వాళ్ళ అప్యాయతలు.. పలకరింపులు.. అమ్మకి నచ్చాయి... సంతోషంగానే ఉంటోంది. ఉదయం.. సాయంత్రం వెళ్ళి చూసి వస్తున్నాను.ఆదేంట్రా... జగ్గూ... అంతపని చేసావ్‌... మనమంతా ఉండి ఎవరూ లేనట్టు... అన్నాను బాధగా