తలుపు కొట్టిన శబ్దం వినిపించింది రేవతికి. ఒక్క ఉదుటున వచ్చి తలుపుతీసి బయటికి తొంగి చూసింది. ఎవ్వరు లేరు. అప్పుడే రాత్రి పదకొండు దాటుతోంది. కానీ ఎక్కడా ఆనంద్‌ జాడే లేదు. వీధంతా నిర్మానుష్యంగా, చీకటిగా వుంది. తన మనసూ అలాగే వుంది, అనుకుంది రేవతి నిస్పృహగా.. తలుపు గడియపెట్టి మంచం మీద కూర్చుంది. అలాగే ఆలోచిస్తూ పక్కన నిద్రలో వున్న పూజ కదలినట్టనిపించి, నెమ్మదిగాజో కొట్టింది.అందంగా ముద్దుగా పడుకున్న మూడేళ్ళ కూతుర్ని చూడగానే రేవతి మనసులో రకరకాల భావాలు సుళ్ళు తిరగటం ప్రారంభించాయి. పూజకి అప్పుడే మూడు సంవత్సరాలు నిండుతున్నాయి. దాన్ని బడిలో వేయాలి. దాచిన డబ్బంతా కొత్త ఇంటికే సరిపోయింది!ఎక్కడా ఏ బ్యాంక్‌లో బ్యాలెన్స్‌ లేదు. ఈ మధ్య ఆనంద్‌ ప్రవర్తనలో రకరకాల మార్పులు కనపడు తున్నాయి. ఇదివరకటిలా ఇంటిని పట్టించుకోవడం లేదు. పాపను దగ్గరతీయడం లేదు. రోజూ చాలా లేటుగా వస్తున్నాడు.ఎందుకిలా అని అడిగితే ‘‘రోజుకో కథ చెబు తున్నాడు. ఆఫీసులో పని ఉందని, ఫ్రెండ్స్‌ రమ్మ న్నారని, రోజూ ఏదో ఒక వంక!’’కాని మనిషి మాటల్లో తడబాటు, సూటిగా తన కళ్ళలోకి చూసి చెప్పకపోవటం- ఇవన్నీ చూస్తే ఆమె మనసేదో కీడు శంకిస్తోంది. ఆనంద్‌కి పేకాట అలవాటు లేదు. అలాగని తాగడం లేదు. తాగితే వాసన అయినా వస్తుందిగా, పోనీ పరస్త్రీ...?అటువంటి ఆలోచన రాగానే రేవతి మనసు వణికింది. భగవాన్‌! అటువంటి దుస్థితి నాకు రాని వ్వకు నా సంసారాన్ని సవ్యంగా నడవనీ! పదే పదే ఆ దేవుణ్ణి ప్రార్థించింది మౌనంగా!హఠాత్తుగా చనిపోయిన తన తల్లి గుర్తుకు వచ్చింది రేవతికి. ఆ వెంటనే నాన్న గుర్తుకు వచ్చాడు. చిన్ననాటి సంగతులన్నీ అలలా ఆమెను సృజించాయి.

రేవతికప్పుడు పదిహేనేళ్ళు! తల్లి మూసిన కన్ను తెరవకుండా జ్వరంతో పడుకునుంది. రేవతికి అప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. తమ్ముడు చెల్లాయి బిక్కముఖం వేసుకొని తల్లి వంకే చూస్తు న్నారు! తండ్రి ఇంటికి వచ్చి రెండు రోజులైంది.ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నాన్న, ఈ మధ్య చిరాకుగా, ముభావంగా ఉంటున్నారు. అమ్మకి, నాన్నకి మధ్య రోజూ ఏదో ఘర్షణ రేగుతోంది. అంత వరకే రేవతి చిన్న మనసుకి అర్థం అయ్యింది కాని అదేమిటో ఆమెకి పూర్తిగా తెలియడం లేదు.పూల పడవలా సాగుతున్న సంసారంలో ఏదో తెలియని అపశృతి చోటు చేసుకుంది. నాన్న ఇంటికి సరిగా రావటంలేదు. ఇది వరకటిలా అమ్మతో సర దాగా ఉండటం లేదు. ఏదో తెలియని బెంగ రేవతి మనసులో బలంగా కదులుతోంది. ఎక్కడున్నా నాన్నని వెతికి అర్జంటుగా, ముందు ఇంటికి తీసుకు రావాలి.