‘‘ఇంకాస్త అన్నం కలుపుకోండి. పచ్చడి బాగుందన్నారుగా’’ఆప్యాయంగా అన్నది అన్నపూర్ణ.‘‘వద్దు... వద్దు... బాగున్నది అంటే ఇంకాస్త కావాలని కాదు.... హలో! చెప్పరా... నిన్ను కాదులే... మధ్యలో మా ఆవిడ అన్నం ఎక్కువ తినమంటుంటేనూ....’’..........‘‘నిజమే గానీ.... పొట్ట పట్టాలి కదరా.. సరే గానీ రైజింగ్‌లో వుంటుందనుకున్నప్పుడు ఇంకో నాలుగయిదు వందలు ఎక్కువ తీసుకుని వుండాల్సింది.’’............‘‘సరే అయిపోయిందిగా...... ఈ సారికి ఇంతే అనుకుందాం అంటావ్‌ నువ్వు.. ఓకే.. ఓకే.. వుంటా మరి’’ మిత్రుడు సుధాకర్‌తో ఫోను సంభాషణకు స్వస్తి చెప్పి‘‘కాసిని మజ్జిగ పొయ్యవోయ్‌ పూర్ణా’’ అడిగాడు రవి భార్యను.‘‘అప్పుడే మజ్జిగేంటి, సాంబారు చేశా.. పోసుకోండి’’‘‘ఇంక నా వల్లకాదు.. మజ్జిగ పోసేయ్‌’’‘‘మీరు అన్నం తినేటప్పుడు కూడా ఆ సెల్లు వదలక పోతే కుదర్దు చెప్తున్నా. రేపట్నుంచి దాన్ని స్విచ్‌ ఆఫ్‌ చేసి మరీ అన్నానికి కూర్చోండి’’ చిరుకోపం చూపింది అన్నపూర్ణ.అన్నపూర్ణ పేరుకు తగిన మనిషి. వంటలోనూ, వడ్డనలోనూ ఆరితేరిన ఇల్లాలు. అంతే కాదు ఎవరికైనా కొసరి కొసరి వడ్డించి తినిపిస్తుంది. కొత్త కొత్త రుచుల్తో శ్రద్ధగా, ఆసక్తిగా అనుపాకాన్ని తయారు చేస్తుంది. తినే వారు పదార్థాలు రుచి, పాకాల గురించి మెచ్చుకుంటే మురిసిపోయే అల్ప సంతోషి. అలాంటిది భర్త రుచుల్ని, అభిరుచుల్ని ఆకళింపు చేసుకొని అతనికి హితవైన పదార్థాన్ని రుచికరంగా చేసి ఆప్యాయంగా తినిపించి సంతృప్తిపడిపోతుంది అన్నపూర్ణ.

రవిచంద్ర కూడా భార్య మనసెరిగి ప్రవర్తించే మనిషి. ఆమె తన పట్ల చూపే ప్రేమకు గర్వం కలుగుతుంది. అంత మంచి భార్య దొరికినందుకు తనకు తనే అభినందించుకుంటుంటారు. అయిదు అంకెల జీతం, సొంత ఇల్లు, ఇంపుగా ఇద్దరు పిల్లలు, ద్విచక్ర వాహానం, అధునాతన సౌకర్యాలు, పరికరాలు అన్నీ సమకూర్చుకున్న సునాయస, సుఖమయ జీవితం కొనసాగిస్తున్న కుటుంబం వారిది.అయితే ఇటీవలి కాలంలో, పెరిగిపోతున్న, పెచ్చరిల్లి పోతున్న డబ్బు పిచ్చి, డబ్బులు పోగే సుకునే పోరాటం, ఆరాటం రవిచంద్రను కూడా పట్టుకున్నది. అన్నం కాదు, నిద్ర లేదు. ఆకలి కాదు, విశ్రాంతి లేదు. ఇరవైనాలుగు గంటలూ ఒకటే ఆసక్తి. ఒకే ఆలోచన. ఆయనతో పాటు, చేతిలో వుండే సెల్‌ఫోనుకూ విసుగూ, విరమం లేవు. ఫోనుకైనా రీఛార్జి సమయంలో కాస్తంత ఆటవిడుపు దొరుకుతుంది గానీ అతగాడికి ఆ మాత్రపు వెసులు బాటు కూడా లేదు.ఇంట్లో వున్నా, ఆఫీసులో వున్నా, అర్థ రాత్రి అయినా, పట్టపగలైనా, ఎప్పుడు ఒకటే ధ్యాస. షేర్లు.....షేర్లు..షేర్లు... అమ్మటాలు, కొనడం, లెక్కలు, కాలిక్యులేటర్సు, చెక్కులు, బ్యాంకులు, పేపర్లు, పుస్తకాలు. అదే ప్రపపంచం. అదే గోల. అన్నం, నీళ్లే పట్టని మనిషికి ఆలు బిడ్డలు పడతారా! పట్టించుకుంటాడా! ఈ పరిణామం ఎటు దారి తీస్తుందోనన్న భయం పట్టుకుంది అన్నపూర్ణకు. మొదట్లో అనునయంగా చెప్పి చూసింది. లాభం లేకపోయింది. అతని ఆరాటం ఆమెకు ఆందోళన కలగజేయ సాగింది. ఎలా చెప్పినా, ఎంత చెప్పినా అతడు వినిపించుకునే స్థితిలో లేడని అర్థమైపోయిందామెకు.