కారు చీకటి నుంచి కాంతి రేఖల దిశగా ఆమె వెళ్లిపోయింది.తరతరాల పురుషాధిక్యతను నిరసిస్తూ, ధిక్కరిస్తూ ఆమె వెళ్లిపోయింది.చిక్కటి చీకటిలో నేను మిగిలిపోయేను. నిరాశగా, నిస్తేజంగానా హృదయ ఘోషను తనలో కలుపుకోవడానికా అన్నట్లు సముద్రం కూడా ఒకటే ఘోష.మరి కొద్దిసేపట్లో నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి సూచనగా దూరంగా కేకలు, ఉల్లాసభరితమైన అరుపులు వినిపిస్తున్నాయి.నేను కూడా అంతకంటే ఎక్కువ ఉత్సాహంగా, ఉద్వేగంగా కొత్త సంవత్సరాన్ని, ఆహ్వానించేవాడిని. ఆమె నా ప్రేమను అంగీకరించి వుంటే...్‌్‌్‌రచన బ్రహ్మ కుంచె నుంచి జాలువారిన ఓ అద్భుతమయిన సౌందర్యం.తనని మొదటిసారి చూసింది మా ఆఫీసులోనే...‘‘సర్‌, జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వడానికి కొత్తగా రిక్రూట్‌ అయిన కంప్యూటర్‌ ఇంజనీర్‌ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పిలవమంటారా?’’ రిసెప్షనిస్టు స్టెల్లా అడిగింది ఫోన్‌లో‘‘కొత్తగా రిక్రూట్‌మెంట్‌ అంటే ఐఐటి క్యాంపస్‌ సెలెక్షనే కదూ’’‘‘ఎస్‌ సర్‌’’‘‘అయిదు నిమిషాల తరువాత పంపించండి.’’ ఫోన్‌ పెట్టేసాను.ఆ క్షణాన నాకు తెలియలేదు. ఓ అద్భుత సౌందర్యం నా అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షిస్తోందని.సరిగ్గా అయిదు నిమిషాల తరువాత తను లోపలకి వచ్చింది. స్ర్పింగ్‌ డోర్‌ తీసుకొని లోపలకి వస్తున్న తనని చూస్తుంటే మెరుపు తీగకు ప్రాణం వచ్చినట్టనిపించింది.ఆల్మండ్‌ షేపులోని అందమైన కళ్లని చూసి ఒక్క క్షణం నన్ను నేను మరిచిపోయేను. ఎర్రని చిన్ని పెదాలు, తళుక్కుమంటున్న ముత్యాల పలువరుస నన్ను ఊరించటానికే వున్నాయేమో అనిపించింది. పచ్చి పాలల్లో గులాబీరేకులను రంగరించినట్టున్న మేనిఛాయతో... లేత గులాబీరంగు చుడిదార్లో... అరవిరిసిన తాజా గులాబీలా... నడిచే వీనస్‌ శిల్పంలా వుందామె.బయోడేటా చూసేను.

 బ్రిలియంట్‌ ఎకడమిక్‌ కెరీర్‌అమెరికన్‌ బేస్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీం లీడర్ని నేను. ఐఐటి, బిటెక్‌, ఐఐఎం ఎంబిఎ, ఫారిన్‌లో చేసిన ఎంఎస్‌. పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలో సాలుకు యాభైలక్షల శాలరీతో బాస్‌ హోదా, ఇరవై అయిదేళ్ల వయసు వెరసి నేను.‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటే నాకు తెలియదు.రచనని చూసిన మొదటి క్షణమే నేనామెని ప్రేమించానన్నది వాస్తవం. ప్రేమ ఎపడు, ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. నా బ్రహ్మచర్యం అంటే విరక్తి కలిగి రక్తి కలిగేలా చేసింది ఆమె. నాలోని మగాడ్ని నిద్ర లేపింది ఆమె.రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె మీద ప్రేమ అధికమయిందే కానీ తగ్గలేదు. ఆమె సమక్షం వెన్నెల కోన. ఆమె నవ్వు మల్లెల వాన. ఎంత సమీపంలో వున్నా ప్రేమ విషయం తనతో కదల్చాలంటే జంకు.మరో వైపు పెళ్లి చేసుకొమ్మని ఇంట్లో ఒకటే పోరు. ఓ రోజయితే ముందుగా చెప్పాపెట్టకుండా అన్నయ్య, వదిన ముంబాయి వచ్చేశారు.