అనంతపురం నా గుండెమీద కాణీకాసంత మచ్చ. ఏదో బెంగ. వర్షం ఇష్టం నాకు. ఖాళీ రోడ్ల మీద వర్షంలో ఒంటిగా నడుస్తూంటాను. (మీరు బాగానే వుంటారు. మిమ్మల్ని చూసి పిల్లలు చెడిపోతున్నారు) కిటికీ దగ్గిర నుంచుని వర్షంలోంచి అనంతపురం వేపు చూస్తాను. దట్టమైన జిగట బెంగ. కిటికీ అవతల గాలికి ఊగుతున్న వెండితాళ్లని ఒక్క గంతులో పట్టుకుని ఊగుతూ టార్జాన్‌లా బయలుదేరాను. మహా అయితే కృష్ణ వరకూ. తరవాత అంతా వేడి శూన్యం. ఊగుతూ ఇంటికి మళ్లా. వర్షం ఎపడు పడ్డా ఇంతే.క్రితం వేసవిలో హార్స్‌లీ వెళ్లేం ఇద్దరం. రాత్రి తను త్వరగా పడుకుంది. మూడు సిగరెట్ల తరవాత నేనూను. ఎందుకో చటుక్కున మెళకువ వచ్చింది. గదంతా నీలపు కాంతిలో వెచ్చగా పలచగా పట్టుకుంటే చిరిగిపోయేట్టుంది. లేచి కూచుని తలుపువేపు చూశాను. అలాగే చూస్తూండి పోయాను. పొడవాటి తలుపుల కింద నుంచి సముద్రపు అల ఏదో లోపలికి వచ్చే ప్రయత్నంలో వుంది. పక్కకి చూస్తే మా ఆవిడ తెల్లటి దుప్పటికి పూచిన చామన చాయ నిద్రలా వుంది. తలుపు కింద అలాగే తెల్లటి నురుగు. నిశ్శబ్దంగా లేచి జాగ్రత్తగా తలుపు తీసి బయటికి అడుగుపెట్టి వెనకాల తలుపు వేశాను. నా గుండె ఆగి కొట్టుకుంది. నా రక్తమాంసాల్నీ, చర్మాన్నీ చీల్చు కుంటూ టపటప కొట్టుకుంటూ పెద్ద తెల్లటి పిట్ట కొండల వేపు ఎగిరిపోయిందనుకుంటాను. నా శరీరం తేలికపడి ఈలోకపు ఆవరణం దాటి వెళ్లిపోయింది. ఎదురుగా పొడవాటి కారిడార్‌ నిండా మెత్తగా లుంగలు చుట్టుకుంటూ నా తలపును తాకుతున్న మబ్బుల గుంపులు. ఏదో సముద్రం పొంగి కొన్ని అలలు మిగిలిపోయినట్టు న్నాయి. 

ఆ చివర్నించి ఈ చివరి దాకా నడిచి ఒచ్చేను. నా కాళ్ల చుట్టూ పల్చగా చల్లటి రెక్కలు తొడుగున్నాయి. కారిడార్‌ ఆకాశ సముద్రంలా వుంది. భుజం మీద సున్నితంగా వాలిన పెద్ద మబ్బు ముక్కని రహస్యంగా అడిగేను.‘‘మీరు అనంతరం జిల్లా వెళ్లేరా?’’ మా ఆవిడ నన్ను అపడపడు ఫూలంటుంది. తరచుగా పిశాచాణ్నంటుంది.ఒల్లు చల్లగా అనిపించింది. బద్ధకంగా కుడికన్ను తెరిచాను. మామూలే. ఎండిపోయిన బూడిద రంగులో నెర్రెలు తీసిన అనంతపురం జిల్లాని నిలువునా చీలుస్తూ ఎర్రటి పెద్ద ఆరుద్ర పురుగులా బస్సు నడుస్తూనే వుంది. ఎండ. బయట పొలాలు చూస్తుంటే పసిపిల్లలు దహనం అయినట్టున్నాయి. కుడి రెప్ప దానికదే మూసుకు పోయింది. నా పక్క రైతు తలపాగా దిండుతో నిద్రలో వున్నాడు. ఒళ్లు చల్లగా వుంది. కళ్లు మళ్లీ వాటంతట అవే తెరుచుకున్నాయి. బస్సులో అరడజను మంది వుంటారు. కండక్టరు బయటికి చూస్తున్నాడు. ఎదుటి సీటు వేపు అపడు చూశాను. బద్ధకం ఎగిరిపోయి గుండె జల్లుమంది. ఆమె బయటికి చూస్తోంది. నేనామెని చూస్తున్నా నని ఆమె స్త్రీ చర్మానికి తెలిసి మెల్లిగా తల తిప్పి నా వేపు చూసింది. నా గుండె దడదడలాడింది. బహుశా ఆమెకి ముప్ఫై అయిదేళ్లుంటాయేమో. పసుపు పచ్చటి చేనేత చీరలో, పల్చటి చామన చాయ శరీరంతో నిజానికామె వయసు చెప్పడం కష్టం. జిల్లా మొత్తం పరుచుకోగల నల్లటి పెద్ద కళ్ళు కాటుక వల్ల వెలిగిపోతున్నాయి. మళ్లీ బయటికి చూస్తోందామె. నూనె పెట్టిన నల్లటి జుట్టు మెడమీద శిగచుట్టింది. ఆమె మొత్తానికి మూడు వందల సంవత్సరాలు జీవించి మళ్లీ ఈలోకపు కాలమాన ప్రకారం ముప్ఫై అయిదేళ్లకి సరిపడి నట్టుంది. అంత వేడిలో ఆమె నుదురు నిర్మలంగా వుంది. రెండు చేతులకీ నీలం, ఎరుపు రంగుల కొత్తగాజులు మెరిసిపోతున్నాయి. ఒళ్లో నిశ్చలంగా వున్న ఆమె చేతులు చూశాను. పొడవాటి వేళ్లు. సరిగా కూచుని కళ్లు మూసుకు తెరిచి మళ్లీ ఆమెవేపు చూశాను. వెలుగు వస్తూండగానే ఉదయిస్తోన్న సూర్యుణ్ని తెంపి నుదుట అద్దుకుం దనుకుంటాను. కుంకుమ బొట్టు ఆమె శరీరంలోని విద్యుత్తుతో ఇంకా వెలిగిపోతోంది.