‘‘కౌసల్యా సుప్రజారామా...’’ సుప్రభాతం వింటూనే విసుగ్గా లేచాడు నిరీక్షణ్‌. ‘‘అమ్మా! హాయిగా పడుకోనీకుండా పొద్దున్నే, రోజూ ఏమిటే ఈ గోల?’’ ‘‘ఆ... యమ్మెస్‌ సుబ్బలక్ష్మిగారి సుప్రభాతం నీకు గోలగా ఉందేమిట్రా? లెంపలేసుకో. కళ్ళుపోతాయి. అయినా ఏడైంది.. లే ఇంక’’ కసిరి పారేసింది తల్లి వసుంధర.విసుక్కుంటూ లేచినా గబగబ తయారై అర్జంటు పనున్నవాడిలా హడావిడిగా వెళ్ళిపోతున్న కొడుకుని చూస్తూ ‘‘వాడలా వెళ్తుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా చూస్తారేమిటండీ? ఎక్కడికో, ఎందుకో కనుక్కోరే?’’ అడిగింది భర్తని.‘‘తమ పుత్రులు సంఘసేవాతత్పరులు... మళ్ళీవారినేమైనా పల్లెత్తు మాటంటే, ఒక్కగానొక్క కొడుకు... ఎందుకండీ, అస్తమానం వాణ్ణలా తిడతారు?’’ అంటూ నువ్వే వెనకేసుకొస్తావ్‌. అన్నీ నీ మాటలే’’ అంటూ తనూ ఆఫీసుకెళ్ళిపోయాడు మూర్తి.అసలు నిరీక్షణ్‌ అంత హడావిడిగా బయల్దేర టానికి కారణం లేకపోలేదు. అంతకుముందు రోజు రాత్రి వాళ్ళ స్నేహితుడు రమేష్‌ బండిమీద వెళ్తుంటే, వెనుకనుంచి లారీ గుద్దటంతో, కాలు ఫ్రాక్చర్‌ అయి విజయ హాస్పిటల్‌లో ఉన్నాడు. రమేష్‌ ఐ.సి.యులో ఉండటంతో, కేవలం ఒక్కరిని మాత్రమే అటెండెంట్‌గా అనుమతించడంతో రాత్రి ఇంటికొచ్చి పడుకున్నాడు నిరీక్షణ్‌.పొద్దున్నే నిరీక్షణ్‌ హాస్పిటల్‌కి వెళ్ళేసరికి రమేష్‌ తల్లిదండ్రులు, నాయనమ్మ ఉన్నారక్కడ.

 ‘‘బాబూ... మీరు ఫ్రెండ్స్‌ అంతా దగ్గరుండి సమయానికి ఈ హాస్పిటల్‌లో చేర్చకపోయి ఉంటే మా బిడ్డ దక్కేవాడు కాదు. థాంక్యూ నిరీక్షణ్‌ అన్నాడు రమేష్‌ తండ్రి రాఘవ...’’ అదేంటంకుల్‌ అలా అంటారు? మాకు థాంక్స్‌ ఎందుకు?’’ మర్యాదగా అన్నాడు నిరీక్షణ్‌.‘‘ఏదిఏమైనా ఆ దేవుడు మనయందుండబట్టి అంత యాక్సిడెంటైనా ఓ చిన్న ఫ్రాక్చర్‌తో పోయింది. వాడు డిశ్చార్జ్‌ అయ్యాక ఆ తిరుపతి వెంకన్నకి గుండు ఇస్తాడని మొక్కుకున్నాన్రా రాఘవా’’ కొడుకుతో అంటోంది లక్ష్మీదేవమ్మ.దాంతో అప్పటిదాకా ఉన్న సహనమంతా ఎగిరిపోయింది నిరీక్షణ్‌కి. ‘‘ఊరుకోండి... శుభ్రంగా తిరుగుతూ, ఎప్పుడూ ఏదో ఒక మొక్కు ఉందంటూ నిరంతరం గుండుతో ఉండే మీ మనవడికి అసలు యాక్సిడెంట్‌ ఎందుకవ్వాలి చెప్పండి. నిత్యం పూజలూ, పునస్కారాలూ చేస్తాడాయే ఇంత చిన్న వయసులో కూడా!’’ అన్నాడు.