నిర్మల బాలికల పాఠశాల.పదమూడేళ్ల నా కూతురు అఖిలని తీసుకుని పాఠశాల ఆవరణలో అడుగు పెట్టేసరికి సాయంత్రం ఆరైందా సమయం. ఆ రోజక్కడ పాఠశాల దినోత్సవం. స్కూల్‌ డే. ఆ వేడుకకు సంబంధించిన సందడీ, సంతోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. బడి ముందున్న విశాలమైన మైదానంలో ఏర్పాటైన వేదిక ముందు ఆశీనులై ఉన్నారు. అక్కడ చదివే విద్యార్థినులూ, వారి తల్లితండ్రులూన్నూ. నా పతి దేవుడు ఆఫీసు పని మీద ఢిల్లీ వెళ్లడంతో నేనొక్కదాన్నే రాక తప్పలేదు. వేదిక మీద సభా కార్యక్రమం ప్రారంభమైంది. పాఠశాల యాజమాన్యం, ఆ నాటి కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరో తెలిసి చెప్పలేని ఆశ్చర్యం కలిగింది నాకు.

బళ్ళో ఆ ఉత్సవం ముగిసే సరికి రాత్రి పదైపోయింది. నా హోండా యాక్టివా అఖిలని వెనక కూర్చోబెట్టుకుని ఇంటికి తిరిగొస్తుంటే ఏదో అపరాధభావన నా గుండెల్ని మెలి తిప్పుతున్నట్లుగా అనిపించింది. స్కూల్‌ డే వేడుకకి ముఖ్యఅతిధిగా వచ్చింది పేరు ప్రఖ్యాతులున్న గొప్ప సెలబ్రిటీ కాదు; నటో నాయకురాలో కూడా కాదు. ఓ అతిసామాన్యమైన యాభై రెండేళ్ళ ఓ స్త్రీ. గృహ సముదాయాల్లో ఇళ్ళల్లోని చెత్తని సేకరించే కార్మికురాలు. ఓ ర్యాగ్‌ పికర్‌.

మర్నాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో, మా మావగారు ఎడమచేత్తో దేన్నో పట్టుకొచ్చి చెత్తబుట్టలో వేస్తుంటే ‘మావయ్యగారూ! అది అందులో వెయ్యొద్దు’ అన్నాను టక్కున. ఆయన ఆశ్చర్యంగా నన్ను చూసారు. అప్పుడు, వార్తాపత్రికల కాగితాలతో తయారుచేసిన ఒక సంచిని ఆయనకందించి, ‘‘ఇందులో వేయండి. ఇకనుండి ఎప్పుడూ ‘వాటి’ని ఈ సంచుల్లోనే విడిగా వేయండి మావయ్యా’’ అన్నాను. ఆ ‘అవి’ ఏవిటో నాకు తెలుసు.

అఖిల వాళ్ళ స్కూల్లో, రామలక్ష్మి అనే ఆ చెత్త సేకరణ కార్మికురాలి మాటలు నాకు పదే పదే గురొస్తున్నాయి. ‘‘... అందరికీ నమస్కారం. నా పేరు రామలక్ష్మి. నేను నా పదమూడో ఏట నుంచే ఈ పని చేస్తూ ఉన్నాను. రోజూ దాదాపు వంద ఇళ్ళల్లో చెత్తని నా చేతుల్తో ఎత్తివేయడం, దాన్ని వేరు చేయడం చేస్తున్నాను. ఈ పని చేస్తున్నప్పుడు చాలాసార్లు నా చేతుల్ని గాయపరుచుకున్నాను, ఆ చెత్తలో కలిసిపోయి ఉండే గుండు సూదులు, పగిలిన గాజు సీసాల వలన! చాలామంది మేకులూ, పగిలిన బల్బులూ, సీసాపెంకులు లాంటి పదునైన వాటిని కూడా ప్లాస్టిక్‌ సంచుల్లో వేసి బయట పారేస్తూ ఉంటారు. రోడ్ల మీద సంచరించే (స్ట్రే) గేదెలూ, ఆవులూ, వాటిని తిన్నప్పుడు, ఆ పదునైన వస్తువులు, వాటి కడుపు పొరల్ని చీల్చుకుని, గుండెల్లోకి దిగిపోతుంటాయి. పాపం ఆ మూగ జంతువులు ఆ గాయాలతో విలవిల్లాడుతూ చనిపోతాయి. నా చేతులకూ చాలాసార్లు లోతుగా గాయాలయ్యాయి. కానీ శరీరానికయ్యే గాయం కంటే దుర్భరమైన ‘గాయం’ ఏంటంటే.. శానిటరీ న్యాప్‌కిన్లూ, డైపర్లూనూ!! కుళ్ళిపోయి, తడితడిగా ఉన్న ఆ వ్యర్థాల్లోకి నా చేతివేళ్ళు మునిగి పోతుంటాయి. ‘ఎరుపు’ గానో, ‘గోధుమ రంగు’లోనో ఉండే ఆ వ్యర్థాల్ని చేతుల్తో తాకినప్పుడయ్యే గాయం ఇంకా పెద్దది.