ఉరుకులు పరుగులు మీద ఇంట్లో కొచ్చిన సీను ఆందోళనగా ఇల్లంతా కలియ జూసి-‘‘ఆమె వచ్చేస్తావుంది అమ్మా!’’......!!! అన్నాడు కంగారుగా.కుట్లు వూడిన రవిక కుట్టుకుంటున్న ఆమె కూతురు కళ్యాణి, స్నానానికి తువాలుతో జాలాట్లోకి పోబోతున్న సుబ్బరాయుడు ఒక్కమారు తమ పనులు ఆపేసి-సీనుకేసి చూశారు ఆశ్చర్యంగా.‘‘ఎవర్రా, ఎవరు వచ్చేస్తున్నారు?’’ ఇంటి ఇల్లాలు రత్నమ్మ అడిగింది. వచ్చేదెవరో..రాబోతున్న ఆ ప్రమాద దేవత ఎవరో కొంచెం కొంచెం అర్థమవుతూ వున్నా అనుమానంగా అడిగింది.‘‘ఆమెనే..సుగాలి’’ అన్నాడు సీను మరింత ఆందోళనగా.‘‘సుగాలి సీతమ్మనా?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది.‘‘అవును ఆమెనే! మన ఇంటి దిక్కునే వస్తుంటే..వీధి కుళాయి దగ్గరే బిందె వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేశా’’ ప్రమాదాన్ని కొంతలో కొంతైనా నిలువరిస్తామని వచ్చాను అన్నట్లుగా వుంది ఆ పిల్లోని ధోరణి.‘‘అబ్బ ఈమె పీడ ఎపడు విరగడ అవుతుందో ఏమో’’కళ్యాణి మనసులోని బాధను కక్కేసి పని లేక పోయినా పొరుగు ఇంట్లోకి వెళ్ళిపోయింది మొహం చాటేస్తూ.‘‘ఎంత దూరంలో వుంది ఆమె’’ అడిగాడు సుబ్బరాయుడు గాబరగా.‘‘నేను చూసేటప్పటికి-మసీదు మలుపు దగ్గర వుంది నాయనా?’’ అన్నాడు.‘‘రత్నం ఒక నెల్లో ఆమె బాకీ ఎలాగోలా తీర్చేస్తామని సర్దిచెప. నేను ఆమె కళ్ళబడితే యింకా రెచ్చి పోతుందేమో. నేను బయటికి పోతుండా’’ స్నానం మానేసి దొడ్డిదారి లోంచి బయటికి వెళ్ళిపోయినాడు సుబ్బరాయుడు.‘‘పోపో ఈ ఇంట్లో ఈ ఆడదే అందరికీ అధవ చిక్కింది. 

ఆ పాడు సుగాలిదాన్ని ఎట్ల ఏగాలో ఏమో వీధిలో అందరి కళ్ళు మన ఇంటిపైనే. ఎవరు ఆమె ఎందుకొస్తుంది మీ ఇంటికి? సుగాలామెతో మీకేం పని? మీ ఆయనకు ఆమెకు ఏదో సంబంధం వుందంటనే నిజమేనా? ఇలా ఎన్ని ప్రశ్నల జవాబులు చెప్పలేక ఛస్తున్నా ఈ మహాతాటకి మళ్ళీ వూడి పడుతోంది. ఇలా లోలోపల కుమిలి పోతూ రాబోతున్న తుఫానును ఎలా ఎరుర్కో వాల్నో అన్న ఆలోచనలో పడింది రత్నమ్మ.ఆ ఆలోచనల్లో వుండగానే సుగాలి సీతమ్మ గుమ్మంలో నిండుగా ప్రత్యక్షమైంది.నుదుటి మీద పెద్ద రూపాయి బిళ్ళంత ఎర్రటి కుంకుమ బొట్టు. చెంపల మీద నాగుపాము పచ్చ పొడుపు. చిన్న చిన్ని అద్దాలు వేసి కుట్టిన రంగు రంగుల పావడ అలాటిదే పై రవిక. రవికపై చిన్న చిన్న గవ్వల కుట్టు. చేతుల్లో దంతాలతో చేసిన వెడల్పాటి గాజులు. చెవుల్లో వెండి జుముకాలు. తలపై నించి భుజాల దాక వున్న రంగు రంగుల ముసుగు.