కారు దూసుకుపోతోంది.వెనుకసీట్లో కూర్చున్నవిద్యాసాగర్‌కి చాలాఆనందంగా ఉంది. అతను ఎన్నో రోజులనుంచి ఎదురు చూస్తున్న రోజు. అతనుఅమెరికా నుంచీ వచ్చీ ఆర్నెల్లకి పైగా అయింది. ఈ ఆర్నెల్లలో రాఘవని కలవాలనీ ఎంతో ప్రయత్నించాడు. అతని కోసం వెతకని చోటు లేదు. చెయ్యని ప్రయత్నం లేదు. అటువంటిది ఈ రోజు అతని ఎడ్రస్‌దొరికింది. అతనుఆలోచిస్తున్నాడు.రాఘవ.. అవును; తన ప్రాణస్నేహితుడు, తన జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి. అతనే లేకపోతే తన జీవితంఏమైయుండేదో ఊహించడం కష్టం. అంతగా ప్రభావితంచేసినవ్యక్తి. అతనే చొరవతీసుకోకపోతే తను ప్రేమించిన వైదేహి తనకు కాకుండా పోయేది. అతను సహాయం చెయ్యడం వల్లే తాను ఈ రోజు యిన్ని పరిశ్రమలకధిపతి అయ్యేడు. అందుకే రాఘవని త్వరగా కలవాలనీ అతను ఆరాట పడుతున్నాడు.అతనికి గతం కళ్లముందుకదలాడింది.విద్యాసాగర్‌, రాఘవలది విజయనగరం దగ్గర ఒక పల్లె... చిన్నప్పట్నించి ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్లో కలిసే చదివారు. ఆ తరువాత ప్రక్క ఊళ్లో హైస్కూల్లో జాయిన్‌ అయ్యారు. రాఘవతండ్రి ఆ ఊర్లో మోతుబరి రైతు. రాఘవ ఒక్కడే కొడుకు. దీనికి భిన్నంగా విద్యాసాగర్‌ తండ్రి ఒక సన్నకారు రైతు. అందుకే పదవతరగతి పాసైన తరువాత విద్యాసాగర్‌ని కాలేజీలో చదివించలేనన్నాడు. అప్పుడు రాఘవ తన తండ్రితో చెప్పి కాలేజీలో జాయిన్‌ చేయించాడు. ఇద్దరూ ఇంటర్‌లో రూమ్‌ మేట్స్‌. ఆరూమ్‌ అద్దె దగ్గర్నుంచీ భోజనాల ఖర్చుదాకా అన్నీ రాఘవే భరించేవాడు.

 తన తండ్రికి తెలిసి కొంత, తెలియక కొంత రాఘవ్‌ విద్యాసాగర్‌కి సహాయం చేస్తుండేవాడు. ఇంటర్‌ తరువాత డిగ్రీలో కూడా అంతే.ప్రిన్సిపల్‌ని కలిసి సాగర్‌ పరిస్థితి వివరించి అతనికి స్కాలర్‌షిప్‌ వచ్చే ఏర్పాటు చేశాడు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా కాలేజీ ఎలక్షన్స్‌లో రెండు గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్‌ మీద అక్రమంగా కేసు బనాయించి అరెస్ట్‌ చేయించారు అవతలి వర్గం వారు. సాగర్‌ని సెల్‌లో కలిసాడు రాఘవ. రాఘవని చూసి సాగర్‌ ఒకటే ఏడుపు.‘‘రాఘవా! ఈ లాకప్‌లో ఒకరోజు దాటి ఉంటే ఇంక నా చదువు నాశనం అవుతుంది. నువ్వే ఈ గండం నుంచి కాపాడాలి’’ రోదిస్తూ అర్థించాడు సాగర్‌. రాఘవ మౌనంగా వచ్చేశాడు. అతను ఆస్టేషన్‌ ఎస్సైని కలిసి పరిస్థితిని వివరించాడు. వెంటనే పదివేల రూపాయలు కడితే జామీన్‌ మీద వదలిపెడతానన్నాడతను. వెంటనే పదివేల రూపాయలు కట్టాలంటే ఏం చెయ్యాలో రాఘవకి తోచలేదు. రూమ్‌కెళ్లి సైకిల్‌మీద ఇంటికెళ్లాడు. తండ్రికి తెలియకుండా తల్లితో ఈ విషయం చెప్పి ఆమె గొలుసు తెచ్చి తాకట్టుపెట్టి ఆ డబ్బుతో సాగర్‌ని విడిపించి అతని జీవితాన్నీ కాపాడాడు. తరువాత ఆ విషయం ఇంట్లో తండ్రికి తెలిసి అతని చేత ఎన్నో చీవాట్లు తిన్నాడు రాఘవ. అయినా సాగర్‌ని కాపాడానన్న తృప్తి మిగిలింది రాఘవకి.