‘‘సుమిత్రా!’’ హడావిడిగా పిలుస్తూ వచ్చాడు మధుసూదన రావు.‘‘ఏమైంది?’’ కంగారుగా అడిగింది.‘‘మా అన్నయ్య ఫోన్‌ చేశాడు. అర్జంటుగా రెండు లక్షలు అవసరమయ్యాయట. ఏదైనా కొంచెం సర్దమన్నాడు’’ మధుసూదనరావు హడావిడి పడిపోతున్నాడు.‘‘ఏమిటి?’’ అయోమయంగా అర్థం కానట్టు అడిగింది సుమిత్ర.‘‘ఈ మధ్య నువ్వు మరీ అయోమయమైపోతు న్నావు. ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదా?’’ విసుగ్గా అడిగాడు.మొగుడికేసి విచిత్రంగా చూస్తోంది సుమిత్ర.‘‘ఏమిటలా చూస్తావ్‌?’’ విసుగు ఎక్కువై నట్టుంది. మాటల్లో ధ్వనిస్తోంది.‘‘మీరేం చెప్పారో ఒక ముక్క అర్థమైతే ఒట్టు’’ అంది అంతే చిత్రంగా.‘‘మా అన్నయ్యకి అర్జంటుగా రెండు లక్షలు కావలసి వచ్చాయి. కొంచెం ఏమైనా సర్దగల నేమోనని ఫోన్‌ చేశాడు’’ తాపీగా చెప్పాడు మధు సూదనరావు.ఈసారి సుమిత్ర మెదడు మొద్దుబారి పోయింది. మధుసూదనరావుకి అన్నదమ్ములన్నా, అక్కచెల్లెళ్ళన్నా ఎంత ప్రేమో తెలుసు. వాళ్ళేదైనా నోరు తెరచి అడిగారో భార్య, పిల్లల సంగతి కూడా మరచిపోయి సర్దేస్తాడు. ఇచ్చిన సొమ్ముకు నోటూ ఉండదు, తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేదు. ఈయన అడగడు. ఇప్పటికే ఆఖరి చెల్లెలు పెళ్ళి బాధ్యత నెత్తిన వేసుకుని కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్మేసి దాంతో ఆ పెళ్ళి చేసేశాడు. తల్లిదండ్రు లను తృప్తిపరుస్తాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా రన్న ఆలోచనేలేదు. చదువుల గురించిగానీ, వారి భవిష్యత్తు గురించిగానీ ఈయనకి పట్టట్లేదని సుమిత్ర ఎన్నోసార్లు బాధపడింది.

ఆమె బాధ అతను అర్థం చేసుకోడు. తాను అను కున్నట్టే చేస్తాడు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళే. వాళ్ళు ఎదగాలి, పెద్దయ్యాక వాళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యాలి ఇవన్నీ ఎలా అనేదే సుమిత్ర దిగులు.నెమ్మదిగా నోరు పెగల్చుకుని ‘‘ఏమిటంత అవసరం?’’ అడిగింది. ‘‘ఓ నీకు చెప్పలేదుగా అసలు సంగతి! సుజాతకి పెళ్ళికుదిరింది. మంచి సంబంధం. పిల్లాడికి మంచి ఉద్యోగం’ సంతోషంగా చెప్తు న్నాడు.సుజాత అంటే మధుసూదనరావు రెండో అన్నయ్య కృష్ణారావు కూతురు. మరీ అందగత్తె కాకపోయినా బాగానే ఉంటుంది. మంచిపిల్ల. ఎన్నోసార్లు తనని హెచ్చరించింది బాబాయి దానాలు ఆపించమని. తోడికోడలు కుసుమ కూడా ఎన్నో సార్లు తనతో అంది. పిల్లలను చదివించి పెళ్ళిళ్ళు చెయ్యాలి మరిదిగారిని ఆ చేతిసాయాలు మానెయ్య మను అని. తను చెపితే వింటాడా? ఎవరికైనా మనం సహాయం చేస్తేనే తిరిగి మనకి సాయం చేస్తారు అంటాడు. పైపెచ్చు నేనేమైనా బయట వాళ్ళకి చేస్తున్నానా? మా వాళ్ళకే కదా చేస్తు న్నాను అంటాడు. ఇంకేం మాట్లాడుతుంది.