మాయమ్మ మా నాయన్ని అది సెయ్యొద్దు, ఇది సెయ్యొద్దు అని పెమానం చెయ్యమనాలేగాని మా నాయన లెక్కా జమీ లేకుండా ఎన్ని పెమానాలైనా ఎవురిమీదైనా చేసేస్తుంటాడు. కాని ఏ పెమానాన్నీ నిల్బెట్టుకున్న దాఖలాల్లేవు. అందుకే మాయమ్మ కూడా తెలివిగా మాయమ్మ మీదో లేదంటే బిడ్డల్మీదో మా నాయన్చేత పెమానం చెయ్యనీదు. దేవుడి మీద మాత్తరమే పెమానం చెయ్యనిస్తాది. ఎందుకంటే మా నాయన, మా యమ్మ మీద పెమానం చేసి తప్పాడనుకోండి మాయమ్మ కేమన్నా అగుద్ది. దేవుడి మీద పెమానం చేసి తప్పాడనుకోండి, పోతే దేవుడు పోతాడు.అయితే మా నాయన లెక్క మా నాయనకుంది లెండి. అదేంటంటే ‘దేవడు ఆ మాత్తం అరదం జేస్కోలేడా’ అంటూ ఒట్టుదీసి గట్టున బెట్టేస్తాడు.ఈ మద్దెన నాయన సిగరెట్లు ఎక్కువగా కాలుస్తున్నాడని, ఇహ నుంచి సిగరెట్లు కాల్చనని, మా నాయన్ని దేవుడి మీద ఒట్టేసి పెమానం సెయ్యమనింది మా యమ్మ. ఇంకేముందీ మా నాయన సిగరెట్లు కాల్చకపోతే నా బతుకు బజార్న బడ్డట్టే. ఒక్క సారిగా నా బతుకులో దరిద్దరం దాపురించినట్టే. ఎట్టాగంటే. పెతిరోజూ ఉదయం పూట బళ్లో ఒంటేలు గంట అవుతానే నేను, మమ్మూ సాయిబు అంగటికెళ్లి మా నాయన్కి అర పాకెట్టు సీజర్‌ సిగరెట్లు తీస్కోని నేను రెండు కమ్మరకట్లు కొనుక్కొని మా నాయన్కి ఆ సిగరెట్లు ఇచ్చి నేను కమ్మరకట్లు నముల్తూ దర్జాగా బళ్లో కెళ్లేవాడిని. మళ్లీ మద్దినేల మూడున్నర్కి ఒంటేలు గంట అయినపడు మళ్లీ ఇదే ఇదంగా మా నాయన్కి సిగరెట్లిచ్చి నేను ఏదో ఒకటి కొనుక్కొనే వాడిని. 

మమ్మూ సాయిబు మా నాయన సిగరెట్ల లెక్క ఓ పద్దుగా నా చిరుతిండి లెక్క ఇంకో పద్దుగా రాస్కునేవాడు. ఈ విధంగా నా యాపారం పదిసిగరెట్లు నాలుగు కమ్మరకట్లుగా సాగుతండేది. (కమ్మరకట్టంటే బెల్లం పాకంతో చేసి తగరంలో చుట్టి అమ్ముతుంటారు)మాయమ్మ ఎపడు మమ్మూసాయిబు అంగట్లో ఈ పద్దుల్ని చూసిందో ఏమోగాని ఒక్కసారిగా మా నాయన ఆరోగ్గెం మీద మా యమ్మకి ఎక్కడలేని గెవనం వచ్చేసింది. ఇంకంతే మా నాయన్ని బట్కొని ‘‘నువిట్టా జిగరెట్లు గాల్చి నీ ఒళ్లు గుల్ల జేస్కుంటే, రేపు నీకేవన్నా అయితే నేనేం గావాల? మన బిడ్ల గతేం అవుతుంది? నువ్వెపుడైనా ఆలోచించినావా? నువ్వెట్టి బరిస్థితు ల్లోనూ జిగరెట్లు మానేయ్యాల్సిందే’’ అంటూ రాద్ధాంతం మొదలెట్టింది. కాని అస్సల్సంగతి అది కాదని నాకు తెలుసు. అంగట్లో మాయమ్మ మా పద్దుల్ని చూసి కళ్లు తిరిగి ఈ వేషాలేస్తుందని నాకు బాగా తెలుసు. మా నాయన సిగరెట్లు మానేస్తే నేనెంత మాత్తరం మా యమ్మని చెమించలేను. ఎందుకంటే మా యమ్మ నా కడుప్మీద కొట్టినట్టే కదా.