శివాలయం పక్కనే ఉండే ఇసికలో ఆడుకుంటాంటే అప్పుడే మా సావాసగాడు సోమయ్యగాడు వచ్చినాడు. వాడు నేను ఇసికలో కాసేపు కలబడితిమి. కాసేపు దొమ్మరగంతలు కొట్టి, ఇసికలో ఆడుకుంటాన్నె గొల్లీది పిల్లోల్లు కూరంగాడు, వాల్లన్న శింగరయ్య, ఇంగిద్దరు కుమ్మరోళ్ళ పిల్లోళ్ళు అందరం కలిసి కాసేపు కబడి ఆడ్తిమి. ఆటయిపోయినంక ఎవరిదావన వాళ్ళు పొయిరి. సోమయ్య గాడు గూడా ఎల్లబారినాడు. నేను ఒక్కన్నే ఇసికలో గూకోని అడుగునుండి ఇసిక తీచ్చి. ఆ ఇసిక ఒక్కరవ్వ తడిగా ఉంటది. కుడికాలు ముందుకు పెట్టి పాదం మీద ఆ ఇసికనుపోసి పిట్టగూడు కడ్తాంటి. కాలు మునిగేతట్టు ఇసికపోసి మెల్లగా దాన్ని రెండు శేతులతో తట్టి పాదం వాటంగా బయటకు లాగాల ఏ మాత్రం కదిలినా గూడా అది కూలిపోతది. సాలినంత ఇసికపోసి రెండు శేతులతో బాగా తట్టి కాలు మెల్లంగా బయటకు లాగుతుంటే... ఎనకనుండి ఎవరో వచ్చి ఈపులమీద గట్టిగా తగిలేసరికి కాలు కదిలి గూడు కూలి పోయింది.

 ఎవురబ్బా అట్ట తగిలిరి సోమయ్యగాడేమో అని ఎనిక్కితిరిగి సూచ్చి, నా ఎనక ఒకాయమ్మి కిందబడి లేచ్చావుంది. ఎవురీయమ్మి అని అనుకుంటాండగానే ఆయమ్మి నా తట్టుకూడా సూడకుండా... పక్కనే నిలబడు కోనున్నె ఇక పిల్లోన్ని ‘నిలబడు నా బట్ట నీ కథ చెప్త’ అని ఆ పిల్లోన్ని ఎంటపన్నేది. నాకు బో కోపమొచ్చింది. తిడదామంటే ఆయమ్మి ఏంటోల్లా యమ్మో తెలియదు. ఆడపిల్ల అందునా కాపోల్ల పిల్లయితే పెద్ద గలాటయితది. అయ్యగారి పిళ్లోల్లతో ఆడుకున్నా తిట్లే ఆడుకోకున్నా తిట్లే అన్నెట్టు... ఇట్లా అనుకుంటాంటేనే ఆయమ్మి ఆ పిల్లోన్ని ఎంటబడి పట్టుకోని ఒంగపెట్టి దబాదబా రెండు మూడు గుద్దులు గుద్దింది. వాడు పచ్చిగా తిడతా, అని ఏడుచ్చా శించుకోని ఉరికినాడు. ఆన్నెఉంటే ఇంగా కొడ్తదని.వాడట్ట పోతానే ఆయమ్మి నాతట్టు వచ్చింది. ఆయమ్మి కండ్లలో ఒక్కరవ్వ భయం కనపడతాంది.ఆయమ్మి భయం భయంగా ‘నేను నడుచ్చా ఉంటే ఆయబ్బీ నీ మీనికి తోసినాడు‘ అనింది. నేను ఆయమ్మి తిట్టే సూచ్చాండ ఇంతకు ఎవురీయమ్మి మనూర్లో ఎప్పుడూ సూళ్ళేదు. ఊర్లో ఉండే శానమంది ఆడపిళ్ళోల్లను అందరినీ గుర్తుపడతాను. శానామందిని వాళ్ళమ్మనాయనా మొక్కట్లు బట్టి కనుక్కోవచ్చు అని ఇట్ట ఆలోసిచ్చాండగానే ఆయమ్మి ఇసికలో గూకోని తడి ఇసిక తవ్వి గబగబా గూడు కట్టింది.‘నీ గూడు పడగట్టినందుకు నా గూడు తీసుకో’ అన్నెది. ‘ఏం పేరు’ అని అడిగినాను. ఆయమ్మి కండ్లలో భయం పొయినట్టుండాది. ‘సుబ్బలచ్చిమి’ అన్నెది ఒక్కరవ్వ నవ్వు మొకంపెట్టి.