‘శత్రుసంహారానికి నేను ఉపయోగించే ఆయుధం-స్నేహ హస్తం’-లింకన్ BOY KILLS WOMAN TO BUY PLAY STATION  హిందూ,జూన్‌ 13,2012,చెన్నై సంచిక హైదరాబాద్‌ కుకట్‌పల్లిలోని సంగీత్‌ నగర్‌ వైపు నా కారు దూసుకుపోతోంది. నేనే స్వయంగా నడుపుతున్నాను వాహనాన్ని. నా పక్కన నా భార్య స్వప్న ఉంది. ముందరున్న ఆవరణలో రకరకాల పూలమొక్కలతో పచ్చగా, కుటీరంలా కనిపిస్తున్న ఓ ఇంటి ముందు కారు ఆపాను. అది ఇల్లు కాదు; ఓ అనాధాశ్రమం!అక్కడకు మేం వచ్చింది, అక్కడి పసిపిల్లలతో కొద్ది సమయం గడపాలనో, ఆ పూట వాళ్ళ భోజనాల ఖర్చు భరించాలనో, లేక కొంత డబ్బు ఆ ఆశ్రమానికి విరాళంగా ఇవ్వాలనో కాదు! ఓ అనాధ బాలుడిని దత్తత తీసుకోవాలని వచ్చాం. మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు తేల్చి చెప్పేసేయడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ దత్తతకు సిద్ధపడలేదు. నా భార్య స్వప్నకూ, నాకూ బయోలాజికల్‌గా పిల్లలు పుట్టే అకాశం ఉంది. అయినా మా ఈ నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది; మా గుండెల్ని మెలితిప్పుతున్నా ఒక అపరాధ భావన ఉంది. సరిదిద్దుకోని ఒ తప్పుకీ, ఓ పాపానికీ, ఓ నేరానికీ...ప్రాయశ్చిత్తం ఇది!!

నా పేరు ప్రతీక్‌ వర్మ. తెలుగు చలన చిత్ర సీమ అగ్రదర్శకుల్లో నేనూ ఒకడిని. ఇప్పటి వరకూ నేను దర్శకత్వం వహించినవి ఏడుసినిమాలే ఐనా, అన్నీ సంచలన విజయాల్ని నమోదు చేసుకున్నాయి. నా చిత్రాలన్నిటిలోనూ యాక్షన్‌ దృశ్యాలకు పెద్దపీట వేసాను. యువతనీ, మాస్‌నీ ఆకర్షించేందుకు భారీ పోరాట దృశ్యాల్ని చొప్పిస్తూ ఉంటాను. ఈ క్రమంలో హింసాత్మక సన్నివేశాలు తప్పనిసరిగా ఉండేవి. నాలో ఓ బలమైన నమ్మకం - ‘హింస’ అన్నది అన్నిటికంటే పెద్ద ‘వినోదం’ అని!!

హింసని తెరమీద చూడ్డంలో ప్రతి ప్రేక్షకుడూ లోలోన ఎక్కడో ఒక చిన్ని థ్రిల్‌ అనుభవిస్తాడనీ! మనిషిమనసు పొరలలోని రహస్యపు అరలలో దాగి ఉండే అలాంటి ఒక ‘వికృతానందాన్ని’ ప్రేరేపించేలా రక్తపాతాన్నీ, కూృరత్వాన్నీ సన్నివేశాల్లో చూపిస్తూఉంటాను. సినిమాల్లో హింసని ‘కళాత్మకంగా’ చూపించే నా ‘వ్యూహం’ చాలా సార్లు సత్ఫలితాలనే ఇచ్చింది; వసూళ్ళపరంగా. ఎందుకంటే, ఈ రక్తపాతం, కూృరత్వం, హింస, అనే వ్యతిరేక భావోద్వేగాలన్నీ ‘వీరోచితం’గా ‘కేమోఫ్లేజ్‌’ ఐపోతుంటాయి!! ఇవన్నీ కథానాయకుడి లోని ‘హీరోయిజాన్ని’ శిఖరస్థాయికి చేర్చడం గా తర్జుమా ఐపోతున్నాయి.