చంద్రుడు విశ్రాంతి తీసుకోవడానికిసిద్ధపడుతున్న సమయం. సూర్యుడు రోజూ ఒకే పని పదే పదే చేస్తున్నా బోరు చెందకుండా తన విధి నిర్వర్తించడానికి సిద్ధంగా వున్నాడు.అదో చిన్న టౌను. ఆ వీధిలో పాలవాడు, ఇంటింటికి వార్తాపత్రిక వేసే అబ్బాయి తప్ప రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది. ఆ వీధిలో, ఆటో శబ్దం చేసుకుంటూ వచ్చి వెంకట్రామయ్య ఇంటి ముందు ఆగింది. ఆ ఆటో నుంచి ఒక యువతి దిగి లగేజీదింపుకుంది. ఆ తర్వాత డ్రైవర్‌కి ముందే కుదుర్చుకున్న బేరం ప్రకారం డబ్బు చెల్లించింది. ఆమె వట్టి మనిషి కూడాకాదు. ఆరునెలల గర్భవతి. అనూషఅనబడే ఆమె కొంచెం కష్టపడుతూ లగేజీ చేతపట్టుకొని వెళ్లి ఇంటి తలుపు తట్టింది. అరనిమిషం వరకు ఆ ఇంటి తలుపు తెరుచుకోలేదు. అనూష నిట్టూర్చి ఈసారి కొంచెం గట్టిగా తలుపు తట్టింది.మరో అరనిమిషం తర్వాత కావేరమ్మ ఆవలిస్తూ ఒక చేయి నోటికడ్డం పెట్టుకొని మరో చేత్తో తలుపు తీసింది. అనూషను చూసిన వెంటనే కావేరమ్మ కళ్లు పెద్దవయ్యాయి. గుండె వేగం పెరిగిపోయింది. ఆమె ఆవలించడం పూర్తి చేసినా నోటికడ్డం పెట్టుకున్న చేయి తీసివేయడం మరిచిపోయి అలా అనూషనే చూస్తూ ఉండిపోయింది.అనూష తటపటాయిస్తూ మెల్లగా ‘‘అమ్మా...’’అంది. కావేరమ్మ అనూషను, ఆమె కడుపును చూస్తూండిపోయింది.‘‘అమ్మా....’’కావేరమ్మ ముఖంలో సంతోషం, దుఃఖం, భయం లాంటి రకరకాల భావాలలో వెంటవెంటనే రంగులు మారుతున్నాయి.

దాదాపు ఎనిమిది నెలల తరువాత కూతురును చూస్తున్నందుకు సంతోషం! క్రితం ఎనిమిది నెలల్లో అనూషను, చూడనందుకు, చూసిన వెంటనే ఆమె చేసిన పని మళ్లీ గుర్తొచ్చినందుకు దుఃఖం!!అనూషను చూసి ఆమె భర్త, కొడుకూ, కోడళ్లు, చిన్న కూతురు ఏమంటారోనన్న భయం!! ఇన్ని భావాలతో ఆమె సతమతమైపోతోంది.అనూషనే మళ్లీ మాట్లాడింది. ‘‘అమ్మా.. ఇన్ని నెలల తరువాత ఇంటికొచ్చాను. కనీసం ఎలా వున్నావు? అనైనా అడిగావా?’’కావేరమ్మ అనూషతో ‘మాట్లాడాలా?వద్దా?’అన్న సందిగ్ధంలో పడింది. ఆమెకు మాట్లాడాలనే వుంది. కానీ మాట్లాడితే భర్త ఏమంటాడో అన్న అనుమానం మరో వైపు!! ఆమె అలానే దారికడ్డంగా నిలబడింది.అనూష లగేజీ మళ్లీ అందుకోవడంతో కావేరమ్మ పక్కకు జరిగి దారిచ్చింది. అంతలో వెంకట్రామయ్య గదిలో నుంచి కేకేసారు. ‘‘ఎవరే వచ్చింది? క్యాంపుకెళ్లిన పెద్దోడు వచ్చాడా?’’ఆయన కేక విని అనూష, కావేరమ్మ ఉలుకూ పలుకూ లేకుండా స్థంభాల్లా నిలుచుండిపోయారు. సమాధానం రాకపోయేసరికి ఓపిక పట్టలేక ఆయనే గది బయటకొచ్చి చూసారు. అనూషను చూసిన వెంకట్రామయ్య మొహం క్షణకాలం బిగుసుకుపోయి, ఆ వెంటనే కోపంతో ఎరుపెక్కిపోయింది. ఆయన ముక్కుపుటాలు అదరసాగాయి. రామయ్య చేతి కర్రను విసిరికొట్టి తడబడుతూ గదిలోకి వెళ్లిపోయి పెద్దపెద్దగా అరవడం మొదలుపెట్టారు.