ఇరవై ఏళ్ళ క్రితం... పెద్ద గాయమే తగిలింది. గాయం అనడం సరైనదేనా? తప్పేమో. గాయమైతే మందు రాస్తాం. మానిపోతుంది. మహా అయితే మచ్చ ఉంటుంది. అదైనా లోతుగా తగిలి రక్తం కారి... చిన్న ఆనవాలుగా... మచ్చ. ఈ గాయం అలాంటిది కాదు. జీవితమంతా నీడలా వెంట వచ్చే గాయం... మరచి పోదామన్నా మరవలేనిది. నిద్రలో ఉలికిపడి... భయం భయంగా గుర్తుకొచ్చే గాయం. దుఃఖాలు, దిగుళ్ళ మధ్య కూడా మేల్కొంటూ... విపరీతంగా భయపెడుతూ మానసిక వికారాన్ని కలిగించే గాయం పైకి కనిపించేది కాదు. గుచ్చి గుచ్చి చూసే చూపులో దాగి ఉంటుంది. చీత్కారాలు... అసహనాలు... తోటి మనిషి... కష్టాల్లో ఉన్నపుడు పొందే పైశాచికానందం. తల్లిదండ్రులు భయపడ్డారు. ఊరు విడిచారు. కొత్త చోటులో జీవిత గమనానికి కొత్త బాటలేసుకున్నారు.ఈ రోజెందుకో నిద్ర పట్టడం లేదు. ఏవేవో దృశ్యాలు... అంతా కలగాపులగంగా.

మళ్ళీ ఇదంతా ఎందుకు గుర్తుకొస్తోంది?అవును, నా పేరు సుశీల. పేరు వల్ల శీలానికి గౌరవం దక్కలేదు, ‘నిర్భయ’ లాగ.స్నేహితురాలు సుందరీ అంతే. మగభాషలో చెప్పాలంటే... ముఖం మీద జేబురుమాలు కప్పుకోవాలి. అంత అనాకారి. ఏ అంగమూ సరైన తీరులో ఉండదు. పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తుంది. సుందరేం చేస్తుంది? వాళ్ళ తల్లిదండ్రుల్ని అనాలి. పుట్టగానే సుందరి సౌందర్యం ఏపాటిదో తెలుసుకదా. మరెందుకా పేరు పెట్టారు? బిడ్డపట్ల కన్నవాళ్ళ మమకారం అలాంటిది. తను మాత్రం ఏం చేసింది? మసగ్గా కనిపించే జ్ఞాపకాల్ని మనసు పొరల్లో పాతరేసుకుంది. ఎలాగంటే... నొప్పి, బాధ లేని నిర్వికార క్షణాల్లోకి ఎవరూ అడుగు పెట్టలేని ఏకాంత శిబిరంలోకి నాదే అయిన స్వంత ప్రపంచంలోకి జారిపోవడం అలవాటు చేసుకున్నాను. ఏకాగ్రతంతా చదువు మీదే. చదువు తెచ్చే అందమైన జీవితం మీదే.ఉదయం ఏడింటి వరకూ మంచం దిగను. మొద్దు నిద్ర అంటుంది అమ్మ. పగలంతా ఉరుకులు, పరుగులు, ఒత్తిళ్ళు, టార్గెట్‌లు, తలనొప్పులు, ప్రాజెక్టులు, టైమ్‌ బౌండ్లు... ఏమరుపాటుగా ఉంటే చివాట్లు. సాఫ్ట్‌వేర్‌ అంతా చల్లదనాల పరిమళాల్లో దాగిన పచ్చనోట్ల కిలకిలలనుకుంటారు. ఒకవేళ అంతేనేమో. మెలకువ పిట్ట కువవకువలాడింది. మగ పట్టు వీడింది. సన్నగా వినపడుతున్న మాటలు... ఒక్కసారి దుప్పటి ముఖం మీంచి తొలగించి చూద్దును కదా...