‘‘రోషన్‌..నీ అభిమాన హీరోయిన్‌ శ్రీలత మన వూర్లో షూటింగ్‌ కోసం వచ్చిందోయ్‌’’అభి ఫోన్లో ఉత్సాహంగా అరిచాడు.ఇరవై ఏళ్ల కిందట ఈ సమాచారం కానీ అందివుంటే... ఉన్నపాటున ఎగిరి గంతేసి పరిగెత్తేవాడ్ని, కానీ ఇప్పుడు అలా ఎగిరితే కింద పడతామేమో! కాళ్లు విరుగుతాయేమో! అని ఆలోచించే వయసుకు వచ్చాను. అయినా మనసు ఒక వింత అనుభూతికి లోనయ్యింది.‘‘చూద్దాం లేరా...ఆ రోజులు వేరే కదా...! నాకు కలవాలనిపిస్తే నీకు ఫోన్‌ చేస్తాలే’’ అని ఫోన్‌ పెట్టేసాను.శ్రీలత ఇరవై ఏళ్లకిందట నా ఆరాధ్య దైవం. నా కలలరాణి. డిగ్రీ చదువుతున్నపుడు స్నేహితులతో కలిసి సినిమాలు ఎక్కువగా చూసేవాడ్ని. క్రమంగా సినిమా చూడటం వ్యసనంగా మారింది. నాన్న పంపే డబ్బు సగానికి పైగా సినిమాలకే అయేది. అందరూ అభిమాన హీరోల్ని కీర్తిస్తుంటే నేను హీరోయిన్‌ శ్రీలతను మూగగా ఆరాధించేవాడ్ని. గదినిండా ఆమె ఫోటోలు పెట్టేవాడ్ని. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.‘‘ఎక్కడరా షూటింగ్‌?’’ ఉద్వేగం లేకపోయినా, కుతూహలం నన్ను వదలలేదు. మళ్లీ అభికి ఫోన్‌ చేసాను.‘‘మనూళ్లోనేలే, మా పిన్ని కొడుకు శ్రీకాంత్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తాడు, వాడే చెప్పాడు శ్రీలత చాలాకాలం తర్వాత మళ్లీ సినిమా చేస్తోందట. 

మన కాలేజి రోజుల్లో నీవు పడి చచ్చే వాడివి కదా! గుర్తొచ్చావు. కలవాలనుకుంటే చెప్పు మా కజిన్‌కు చెబుతాను... తీసికెళ్లి పరిచయం చేస్తాడు...’’‘‘చూడాలనిపిస్తే నీకు ఫోన్‌ చేస్తా... ఇప్పుడు బిజీగా వున్నా. ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి.’’వారం రోజులు గడిచాయి. కాలేజి నుండి ఇంటికి వస్తుంటే, పాత కలెక్టర్‌ బంగళా దగ్గర హడావుడి చూసి బైక్‌ ఆపి అడిగా. ‘‘షూటింగ్‌ జరుగుతోందట’’ అన్నారెవరో.ఒక్క నిమిషం మనసు పదిహేనేళ్ల కిందట శ్రీలతను చూడటం కోసం పడిన అవస్థలు గుర్తు చేసుకుంది. నాకు తెలియకుండానే నేను షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నా. అభికి ఫోన్‌ చేయబోయి విరమించుకున్నా. ఈలోగా ‘‘శ్రీకాంత్‌ సార్‌.. మిమ్మల్ని శ్రీలత మేడం పిలుస్తున్నారు..’’ అని ఓ కుర్రాడు గట్టిగా అరిచాడు.ఓహో ఇతనేనన్నమాట శ్రీకాంత్‌.. మాట్లాడిస్తేనో.. అభి స్నేహితుడ్నని చెప్పి చూద్దాం ఎలా స్పందిస్తాడో! పైగా శ్రీలత ఇతన్ని పిలుస్తున్నారన్నాడు క దా!నా విజిటింగ్‌ కార్డ్‌ వెనక ఫ్రెండ్‌ ఆఫ్‌ అభిరామ్‌ అని రాసిచ్చి శ్రీకాంత్‌కు ఇవ్వమని పంపించా, అక్కడున్న ఒకబ్బాయితో.మరు నిమిషంలోనే శ్రీకాంత్‌ నా దగ్గరికి వచ్చాడు.‘‘రండి సార్‌ షూటింగ్‌ అయిపోయింది. మళ్లీ గంట తర్వాత గాని మొదలవదు’’ అంటూ నన్ను షామియానా వేసి వున్నచోటికి తీసికెళ్లి కూర్చోబెట్టాడు.‘‘లేదు శ్రీకాంత్‌... షూటింగ్‌పై ఆసక్తి లేదు... శ్రీలత గారంటే చాలా ఇష్టం.. వీలయితే కలుద్దామని.. కానీ చాలామంది ఆమెను కలవాలని వస్తారేమో... ఇబ్బందిగా ఉంటుందేమో కదా!’’