శీతాకాలపు వెన్నెల మంచుతో మసకగా వుంది. వంశధార నదిచుట్టూ పంటచేలు పచ్చగా మంచుతో మచ్చిక చేసుకుని వెన్నెలకు తళతళలాడుతూ తలలాడిస్తున్నాయి.నది వంతెనపై నడవసాగాను.వెనుక పేపర్‌ మిల్లులోని సైరన్‌ మ్రోగింది. చేతిగడియారం వంక చూసుకున్నాను. ఎనిమిది గంటలు రాత్రి. ప్రక్కనుండి నరసన్నపేట - శ్రీకాకుళం షటిల్‌ సర్వీసు సాగిపోతూ దూరమయ్యింది.నిశ్శబ్ధం... యేటి నీళ్ళు గలగలమంటూ ప్రవహిస్తున్న చపడు. నడుస్తూ తోడు కోసమో.... చలిలో వేడి కోసమో.. సిగరెట్టు వెలిగించాను.ఆర్నెళ్ళ క్రితం చేరోచేత్తో పొట్ట, ఇంజనీరింగు పట్టా పట్టుకొచ్చి పేపర్‌ మిల్లులో పెద్ద ఉద్యోగానికే చే రాను. హోదాపరమైన ఇబ్బంది వల్లనేమో...పల్లెలో ఎవరితోనూ నాకు దగ్గర పరిచయాలు ఏర్పడలేదు. మార్నింగ్‌ వాక్‌తో మొదలయ్యే నా దినచర్య పేపర్‌ మిల్లులో పని తరువాత ఈవినింగ్‌ వాక్‌తో ముగుస్తుంది. ఇక రాత్రంతా ఒంటరిగా పల్లెలోని అద్దె గదిలో ఆ నాలుగు గోడల మధ్య నాలో నేనే మాట్లాడుకుంటుంటాను. పల్లెలో కేబుల్‌ బూచి ప్రవేశించినా ఇంకా నాగదికి ఆహ్వనించలేదు. లేకుంటే కళ్ళు కాబూతల్లా కదిలే బొమ్మల కోసం అటువేపు లాగుండేవి. ఒంటరితనాన్ని దూరం చేసుకుందుకు ఈ మధ్యే వీకెండ్స్‌ విస్కీతో సెలబ్రేట్‌ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను.పల్లె దగ్గరయ్యింది. వంతెన దిగి పల్లెవైపు అడుగులేసాను. రోడ్డు ప్రక్కనంతా అరటి తోటలు దయ్యాల మూకలా నిల్చున్నాయి.

 గాలికి ఆకుల గలగలలు.. చెప్పొద్దూ... కొంచం దడుపు పుట్టిన మాట నిజం...పల్లెలోనికెళ్ళి నా గదివేపు అడుగులేసాను. గది అనటం కంటే దాన్ని ఇల్లు అనటమే బావుంటుంది. నా కంత అనవసరమే అయినా నాక్కావాల్సిన ఒక్క గది నగరాల్లోలా ఈ పల్లెలో దొరక్కపోవటంతో అద్దె తక్కువే అవ్వటం వల్ల మొత్తం ఇల్లు తీసుకున్నా నేను పూర్తిగా వాడుతుంది ముందు గది ఒక్కటే.నేనిచ్చే అద్దె ఆ ఇంటికి చాలా స్వల్పం అని నాకనిపిస్తున్నా కొన్నేళ్ళ క్రిందట ఈ పల్లెలో ఇల్లు అద్దెకిచ్చే మాటే లేదంటుంటాడు శిమ్మన్న. జిల్లాలో గ్రానేట్‌ రాళ్ళ బిజినెస్‌ చోటు చేసుకున్న తరువాత ఎక్కడెక్కడినుండో వచ్చి కొండల్ని తవ్వి బండల్ని తరలించే వాళ్ళెక్కువయ్యి అవ సరం ముందు నిత్యావసరాల విషయం పట్టక ధరలు పెంచి సామాన్యుడికి బతుకు బరువు చేసారని వాపోతుంటాడు... ఒకప్పటి పల్లెల్లోని మర్యాద మన్నన దానం ధర్మం నశించి వ్యాపార మర్మమేం పుట్టుకొచ్చిందంటాడు. నాకది నిజమే అనిపించినా నేనుంటున్న ఇంటి విష యానికొస్తే అది పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. పెద్ద బంగళా అంత ఇంట్లో కేవలం ఒక్క ముసలతను వుంటాడు. ముందు నా దగ్గర అద్దె తీసుకోటానికి అతడు ఒపకోలేదు. ఉత్త పుణ్యానికి వుండటం ఇష్టం లేక పెట్టేబేడా సర్దుకోబోతే చాలా కష్టంగా కిరాయి నిర్ణయించాడు.