మీద బాణంలాగా ‘రివ్వు’న ఎవరో కుర్రవాడు రన్నింగ్‌ రేస్‌ చేస్తున్నవాడిలా పేవ్‌మెంటు పరుగెత్తిపోతున్నాడు వేగంగా.రామచంద్రమూర్తి ఒక్క క్షణం ఆగి వెనుదిరిగి చూస్తూ నిలబడ్డాడు. అంతలోనే ఆ కుర్రవాడు కనుచూపు మేర దాటిపోయాడు.రామచంద్రమూర్తికి నవ్వు వచ్చింది.వేగంగా పరుగెత్తుతున్న వారెవరిని చూచినా అతడు అలాగే నిలబడి పోతాడు. బొమ్మలా చేష్టలు దక్కి నిలబడిపోయి తర్వాత నవ్వుకుంటాడు.అతడు మళ్లీ నడవడం ప్రారంభించాడు.రోడ్ల పక్కన పేవ్‌మెంట్‌ మీద స్తంభాలకు రకరకాల సినిమా పోస్టర్లు అతికించబడి వున్నాయి. అన్నీ అందమైన అమ్మాయిల బొమ్మలు, హీరో, హీరోయిన్ల గాఢంగా కౌగలించుకొని వున్న దృశ్యాలు. ఒకళ్ళ మీద ఒకరు పడి దొర్లుతున్న దృశ్యాలు.అతడు మరొక ఫర్లాంగు దూరం నడిస్తే కాని బస్సు స్టాపు చేరుకోలేడు. ఎంత పెందలాడి యింట్లో నుంచి బయలుదేరితే తప్ప బస్సు అంది ఆఫీసుకు చేరుకోవడం కష్టం... అప్పటికి సీతమ్మ ఎంతో పెందలకడనే. బాగా చీకటి ఉండగానే నిద్రలేచి పనులు ప్రారంభిస్తూంది. అవి సర్దుకొని యివి సర్దుకుని వంటకు ఉపక్రమించి ఎంత ఉరుకులు పరుగులు పెడుతూ చెమటలు కక్కుతూ పని చేసినా తొమ్మిది గంటల లోపున వంట తయారు కాదు. నాలుగు మెతుకులు నోట వేసుకుని తాను తయారయ్యే సరికి తొమ్మిదిన్నర అవుతుంది.

 ఎంత వేగంగా నడచినా బస్‌స్టాప్‌కు చేరుకునేసరికి మరొక పావుగంట. ఆ తర్వాత బస్సుకోసం పడిగాపులు పడి వుండాలి. ఎంతకూ తనెక్క వలసిన బస్సు రాదు. వచ్చిన బస్సులు ఆగకుండానే రివ్వున దూసుకుపోతుంటాయి. ఆ వేళప్పుడు అన్ని బస్సులూ నల్లుల్లాగా, బల్లుల్లాగా కిటకిటలాడుతున్న ప్రయాణికులతో కిక్కిరిసి వుంటాయి. పోనీ ఓపిక చేసుకుని నడిచిపోదామా అంటే ఆఫీసు దగ్గరా దాపూ కాదు. అయిదు కిలోమీటర్ల దూరంలో ఊరికి అవతలి వేపున ఉందది.‘పోనీ ఆఫీసుకు దగ్గర్లో ఏదైనా యిల్లు చూసుకోరాదూ?’ అన్నారు చాలామంది.కాని అక్కడ అద్దెలు తాను భరించలేడు. అక్కడ అద్దెలు చుక్కలంటుతూ వుంటాయి. తన కొచ్చే జీతంలో యిక్కడికే ఎటూచాలక బాధ పడుతున్నారు. ఆఫీసులో కొందరు జల్సారాయుళ్ళు ఉన్నారు. ఖరీదైన బట్టలు ధరించి, ఖరీదైన సిగరెట్లు కాలుస్తూ, అందాల రాముళ్ళలాగా ఘుమఘుమ లాడిపోతుంటారు. కొత్త కరెన్సీ నోటుల్లా పెళపెళ లాడుతుంటారు. కాని వారి దారి వేరు. సీట్లు అటువంటివి. కల్పవృక్షాలు-- కామధేనువులే.....తన సీటు అటువంటిది కాదు. చాకిరీకి మాత్రం ఏమీ తక్కువ ఉండదు. టన్నుల కొద్దీ పైళ్లు పేరుకుపోతుంటాయి. ఎంతచేసినా తరగని పని - ఫలితం మాత్రం నెల తిరిగేసరికి వచ్చే ఆ జీతపు రాళ్లే. అందులో బోలెడన్ని కట్లూ, కత్తిరింపులు. చేతిలో పడే మొత్తం ఆనందం కలిగించదు సరికదా ఆందోళన కలిగిస్తుంది.