మనవరాలికి ఇవాళ మొదటిరాత్రిట! అందరు హడావిడిగా ఉన్నారు. కరుణ మాత్రం ఒంటరిగా సోఫాలో పడుకుని ఆలోచిస్తోంది. తన అవసరం ఎవరికీ లేదులే! అన్నట్టుగా. ఆ చేసేదేదో ఇంట్లోనే చేయొచ్చుకదా! ఊహు! చెయ్యరు. ఈ లంకంత కొంపలో వాళ్ళకి ప్రైవసీ ఉండదుట!అది కూడా, మనవరాలు పింకి సెలెక్ట్‌ చేసుకున్న, రిసార్ట్‌లోనే! ఇదేంటి? అంటే, ఇవన్నీ మీ రోజులు కావు! పిల్లేదో సరదా పడింది. అది కూడా అర్థం కాదు మీకు! అని అసహనంగా అంటున్న కోడలిని చూసి ఒళ్ళు మండింది.

ఇదేం సరదానే! దంపత తాంబూలాలు, ఆశీర్వచనాలు, అలంకరణలు, ఆడాళ్ళు లేకుండా ఎక్కడో కార్యం చేయడం? తర్వాత ఎలాగూ వాళ్ళి ద్దరే ఉంటారు. కానీ ఎవరయినా ఇలా చేస్తారా? అయినా నువ్వు మీ ఆయన చక్కగా ఇంట్లో, అందరు చెప్పినట్లు వినలేదూ! అని తను అనగానే ‘చాల్లెండి, మాదో కార్యం? వేసవి కాలం, కరెంటు లేని చీకటిగది, హరికేన్‌ లాంతరు, అగరొత్తుల పొగ చచ్చాం ఊపిరాడక! దానికితోడు, మేమేం మాట్లాడుకుంటామో! విందామని మా గది తలుపులదగ్గరే అమ్మలక్కలు, ఎప్పుడు తెల్లారుతుందా! అన్నట్లు మేము, ఏదో మొక్కుబడిలా అఘోరించింది. ఇలా మా కార్యం గురించి లేదా ఏదో ఒకటి చెబుతూ పిల్లల మూడాఫ్‌ చేయకండి. అసలే ప్రేమించుకున్న జంట. మీ మాటలకి చిన్నబుచ్చుకుంటే, అందరు మిమ్మల్నే అంటారు! అని వెళ్ళిపోయింది కోడలు శారద.తమ రోజుల్లో అదేంటోకూడా తెలీదు. ఏ అమ్మమ్మో పక్కకు తీసుకెళ్ళి, పడగ్గదిలో మొగుడున్నాడని, అతనికి కోపం రాకుండా మసలుకోవాలని గుసగుసగా చెప్తే, భయం, సిగ్గుతో తలవంచుకుని విని ఆచరించింది.

తనంత కాకపోయినా, అంతో ఇంతో తన కూతుళ్ళు కూడా పెద్దలమాట విన్నారు. మరి! ఈ తరం పిల్లలు అందరు, తన మనవరాలిలాగే, అన్నీ బాహాటంగా మాట్లాడేస్తుంటే, వింతగా ఉంది. తల్లిదండ్రులు కూడా అదేదో సాధారణం అన్నట్లు వింటున్నారు. తనకి ఆశ్చర్యంగా ఉంది. తానేమైనా అంటే, ఆ రోజులువేరు! ఈ రోజులు వేరులే! అంటారు. అసలు ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా, ఆకారాలు, అనుభవాలు ఒకటే కదా? తనువుకి పులకింతలు లేవా? పురుటినొప్పులు లేవా? ఆహార్యం మారుతోంది. వస్త్రధారణవల్ల అంతరంగాలు అనుబంధాలు అభిరుచులు మార్చు కుంటూ కాలం మారిపోయింది అంటారు.