అది... పేరుకు పెద్ద ప్రాధాన్యం లేని ఒకానొక ఊరి రైల్వేస్టేషన్‌!నాకు నచ్చని పేరు పెట్టుకున్న ఒక రైలొచ్చి ప్లాట్‌ఫాం మీద ఆగింది.రైల్లో ఎంతమంది ఉన్నారో చూద్దామని ప్రయత్నిస్తే... లోపలికి చొరబడేంత జాగా తమకు లేదంటూ నా కనుచూపులు వెనక్కి వచ్చి, నా కంట్లోనే గుచ్చుకున్నాయి. మన దేశంలో రైలు అంటే పుష్పక విమానం! ఎంతమంది ఎక్కినా ఇంకొకడికి ఖాళీ ఉంటుంది నా చూపులు చెయ్యలేని పనిని నాతో పాటు ఆ స్టేషన్లో రైలు ఎక్కిన వారందరం దిగ్విజయంగా పూర్తి చేసాం.నేను ఎక్కగానే రైలు కదిలింది. కంపార్ట్‌మెంట్‌ ఎంట్రన్స్‌ దగ్గర నుండి నేను రిజర్వేషన్‌ చేయుంచుకున్న బెర్త్‌ వరకు వెళ్ళడానికి పావుగంట పట్టింది. చూసే కళ్ళుండాలే గాని ఆ పావుగంటలో మనకి భారతదేశం మొత్తం కనబడుతుంది. భారతీయులు ఎంత సోషలిస్టిక్‌గా ఉండగలరో చెప్పడానికి రైలు ప్రయాణాన్ని మించిన ఉదాహరణ ఇంకొకటి ఉంటుందా?నేను ఊహించినట్లే నా బెర్తులో ఎవరో నలుగురు కూర్చుని ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు చూడ్డానికి దిట్టంగా ఉన్నాడు. అది నా బెర్తు అని వాడితో చెప్పి పైకి లెమ్మన్నాను. వాడు నన్ను టికెట్‌ చూపించవలసిందిగా అడిగాడు. మిగతా ముగ్గురు మర్యాదగా లేచి వెళ్ళిపోయారు.ఎప్పుడో చదువుకుని వదిలేసిన లా చదువు నా లోని లాయర్‌ని నిద్ర లేపింది. ‘‘టికెట్‌ లేకుండా ప్రయాణం చేసే ప్రతి అడ్డమైన వాడికీ టికెట్‌ చూపించి రిజర్వేషన్‌ ఉందని నిరూపించుకునే ఖర్మ నాకు పట్టలేదు’’ అని కోపంతో ఊగిపోయాను. 

నా కోపానికి భయపడ్డట్టున్నాడు. లేచి సైడ్‌ బెర్త్‌లో ఉన్న ఇద్దరి పక్కన ఇరుక్కున్నాడు. నేను నా బెర్తులో కుదురుకున్నాను.‘‘మాస్టారూ మీ గ్రహస్థితి బాగున్నట్లుగా లేదు. మీ మానసిక అశాంతికి కారణం అదే అయ్యుంటుంది’’ అని అందుకున్నాడు నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి. చూడబోతే అతనికి కొంచెం జ్యోతిష్యం తెలిసినట్లుంది. నేను ఈ రైలు ఎక్కింది... కదులుతున్న రైలు నుండి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి అని గ్రహించగలిగేంత ప్రజ్ఞ ఇతడికి ఉండి ఉంటుందా?మళ్ళీ అతడే అందుకున్నాడు. ‘‘నాకు హస్త సాముద్రికంలో మంచి ప్రావీణ్యం ఉంది. మీ చెయ్యి ఇటు ఇవ్వండి. మీ అశాంతికి కారణం చెబుతాను’’ అని అంటూనే నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. నేను ఎక్కడ పుట్టిందీ, ఎలా పెరిగిందీ మొదలుకొని నా చదువు, ఉద్యోగం, భార్యాపిల్లలు ఒకటనేమిటి జరిగిన ప్రతి విషయం దండ గుచ్చినట్లు చెప్పాడు.‘‘గత ఐదు సంవత్సరాలుగా శని మిమ్మల్ని వెంటాడుతోంది. మీరు బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు. అవునా?’’ అని అడిగి, నేను మర్చిపోలేని నా అప్పుల్ని మళ్ళీ గుర్తు చేశాడు.