‘‘మమ్మల్ని సంపుండ్రీ... కొయ్యుండ్రీ... సావడానికైనా తయారు గున్నం. గంతేగని గీ గూడెం ఇడ్సేదినేదు. అడ్విదాటి పొయ్యేది నేదు..’’ మూకుమ్మడిగా తమ నిర్ణయాన్ని నిర్భయంగా ప్రకటించారా చెంచులు.‘‘బాగా ఆలోచించండి. మీకు అడవిలో దొరకని వసతులన్నీ ప్రభు త్వం నగరాల్లో కల్పిస్తామంటోంది. వింటే మేలు జరుగుతుంది. లేదంటే నష్టపోయేదీ, నలిగిపోయేది.. మీరే!’’ చివరి అస్త్రంలా నచ్చ జెపుతూనే హెచ్చరిక జారీ చేశాడు సీతారామరాజు.చెంచులు మాత్రం... పట్టు విడవలేదు. చావో, రేవో తేల్చుకునే ప్రయత్నంలో... సీతారామరాజు మాటల్ని పెడచెవిన పెడుతూ, వచ్చిన ఆ పదిమంది చెంచులు ఉక్రోషంతో ఆఫీసు నుండి బయటికి నడి చారు.నాలుగు రోజులు పోయాక వాళ్లే తన దారికి వస్తారని... అప్పుడు వాళ్లని ఒప్పించవచ్చునని... నిశ్చ యించుకున్నాడు సీతారామరాజు.ఫఫఫఅది నల్లమల అరణ్యప్రాంతం...నల్లమల అడవుల్లో సుమారు 430 వరకు చెంచు గూడేలున్నాయి.కర్నూలు జిల్లా పెచ్చెరువుగూడెం వైపుకి ఒంట రిగా బయలు దేరాడు సీతారామరాజు. గూడేనికి దగ్గర్లో తన జీపుని ఆపాడు.జీపు దిగి అల్లంతదూరంలో వున్న గూడెం గుడి సెల వైపు నడవ సాగాడు. తొందర్లోనే చెంచుల గుడి సెల చేరువలోకి వచ్చాడు. చప్పున వంగి గుప్పెడు మట్టిని చేతుల్లోకి తీసుకున్నాడు.

అదే స్వచ్ఛమైన వాసన... అదే సహజమైన పరిమళం...ఓ అనిర్వచనీయమైన అనుభూతి... గుండె శిఖరాన కొలువవుతుంటే... ఆ మట్టిని అరచేత్తో నుది టిన సిందూరంగా అద్దుకున్నాడు.తాను నడిచిన నేలది. తనకి నడక నేర్పిన మట్టికణాలవి. ఉద్వేగంతో ఊగిపోయాడొక్క క్షణం.‘‘అప్రయత్నంగా అతడికాసమయాన అమ్మ గుర్తుకు వచ్చింది. తండ్రి మదిలో మెదిలాడు. బాల్యం కన్నీటి కెరటమై కదిలి గుండె తీరాన నిలిచింది.తల్లిదండ్రుల జ్ఞాపకాలు.. విషాదభరితమైన రెండు కన్నీటి బొట్లుగా... అతడి కనుకొనల నుండి జారి... ఆర్తిగా నేల వాలాయి.ఆ మట్టి కణాలు అతడి కన్నీటి స్పర్శతో ఓదార్పు పొందాయి.తక్షణ కర్తవ్యం ఎదలో మెదలటంతో కర్చీఫ్‌తో గబగబా తడి కళ్లను తుడుచుకున్నాడు.సీతారామరాజు ఎవరో కాదు.. ఫారెస్ట్‌ రేంజర్‌...!ఆదిమానవజాతి వారసత్వమైన చెంచు సమూహాన్ని.... మూలాలతో సహా అడవి నుండి కదిలించటానికి... ఎలాంటి వ్యూహం పన్నాలా... అని ఆలోచిస్తూ సాగిపోతున్నాడతను.