నాగిరెడ్డిపల్లి దగ్గర ట్రేన్‌ ఆగింది. స్టేషన్‌ ఊరుకు దూరంగా వుండడంవల్లా చుట్టూరా చిన్నపాటి అడవిలాగ కనిపించింది. ఆ రైలులోనే వచ్చిన పిచ్చుక తన వెంట ఉన్న కాకితో ‘‘ఇక్కడ మనం దిగిపోవచ్చు’’ అంది.‘‘అడవికే పోదామంటావా?’’ అడిగింది కాకి.‘‘రెండవ ఆలోచన లేదు. దిగు రైలు కదులతది’’ అంది పిచ్చుక.‘‘అవును పల్లెలు కరువుతో పాడైతే పట్టణాలు కల్మషంతో పాడాయె. ఇక అడివే దిక్కు దిగు’’ అంది కాకి.రెండు పక్షులు రైలు డబ్బాలమీదనుండి ఎగిరి ఓ చెట్టుకొమ్మమీది వాలినయి. కాకి పిచ్చుక వైపు చూస్తు ‘‘ ఎక్కడన్న నీటమునుగుదాం నీవు నాలాగ కనిపిస్తున్నావు.’’ అంది నవ్వు ముఖంతో.‘‘డీజిల్‌ ఇంజన్‌ పొగేపొగ. వచ్చేది హైద్రాబాదునుండి కదా? అందుకె ఈ రంగు! మొన్న సికింద్రాబాదులో ఓ ఇంటిమీద వాలినపుడు ఆ ఇంటి ఇల్లాలు తన భర్తతో ‘‘ఏమండి ఇకనుండి మీరు రంగు బట్టలేసుకొనుక్కొండి. తెల్లవి ఓ బంగిన మురికిపోవటం లేదు. ఒక్కపూటకే మాస్తున్నయి’’ అని గుర్తుచేసింది.‘‘అదైతె నిజమే.’’ అంది కాకి.‘‘నిజమో అబద్దమో నీరంగుకు డోకాలేదు.’’ అంది పిచ్చుక.పక్కన్నె కొంత దూరంలో వున్న బోరు పంపు వైపు చూస్తు, అపడె ప్రయాణికులు నీళ్లు తాగి వెళ్లినట్టుంది. దాని పాదుగంటలోనీరు కనిపించగానె వెళ్లి, ఆ నీటిలో తన రెక్కలను టపటపలాడిస్తు కిచకిచమంది పిచ్చుక. ఆ శబ్దానికి మరికొన్ని పిచ్చుకలొచ్చి వాలినయి. కాకి బోరు హాండిల్‌మీద వాలి పంపు చివరన రాలుతున్న నీటి చుక్కలను తాగుతున్నది.

ఈ లోపు ఓ పిల్లవాడు నీళ్లకోసం రాగానె రెండు పక్షులు ఎగిరి వేములకొండ బాట పట్టినయి. అక్కడ ఉన్న కొండను చూస్తు దీన్ని ఎక్కడం దిగడం ఎంత కష్టం అనుకుంటు కాకి ‘‘ఇక్కడ భూపోరాటమపడు చీకటోళ్లు వుండేది.’’ అంది కాకి.‘‘ఇప్పటికీ ఇక్కడ అన్నలు తలదాచుకుంటరట. ఆమధ్య ఓ ఎన్‌కౌంటర్‌ కూడ అయిందట. రేడియో వార్తల్లో విన్న’’ అంది పిచ్చుక, ఏదో రహస్యం చెప్పినట్లు.‘‘అటు చూడు ఏదో తిర్నాలు. ఇక్కడ కూడ ఓ గుడి వుంది.’’ అంది పిచ్చుక మళ్లీతానె.‘‘మనుషులు సరదాగా కలుసుకునేది ఈలాంటి తిర్నాలలోనె మరి.’’ అంది కాకి.‘‘అంతెనంటావా?’’ అంది పిచ్చుక.‘‘అనేదేముంది చూడరాదు. కనిపిస్తలే ఆ గుసగుసలు, ఆ పగలబడినవ్వటాలు. ఆ కోనేరు వైపు చూడు. అందులో ఆడమగ అరమరికలు లేకుండా ఆనందంతో మునిగితేలుతున్నరు.’’ అంది పిచ్చుక నవ్వుముఖంతో చూస్తు.‘‘వీళ్లకు ఇళ్లు ఇరకటమై అడవిలో హాయిగ వుండెటట్టుంది.’’ అంది కాకి.‘‘ఈ మనుషులు మనల అంటరుగాని, చేసెవన్ని వాయివరుసలు లేని పనులే! మొన్న సిటిలో నీవు మాంసం కొట్టువైపు పోయినవు చూడు, అపడు నేనో ఇంటి కిటికిలో కూర్చున్న. ఆ ఇంట్లో భార్యభర్తలు పోట్లాడుకుంటున్నరు.’’ వీరు చూడడానికి రూపం మనిషిది గుణం మాత్రం జంతువుది. కాన్పుసమయంలో సహాయానికని అమ్మో ళ్ళు చెల్లెను పంపిస్తే దానిని గుంజితివి. అది చిచ్చరపిడుగు కనుక నీకు సరియైౖన బుద్ధి చెప్పింది కాబట్టి సరిపోయె, అదే అమాయకురాలు అయితే మోసపోయేదే కదా! మరదలు అంటె ఓ చెల్లెలు లాంటిది. అట్లాటి ఆలోచన ఎట్టా వస్తదో అర్థం కాకుండా వుంది.’’ అంటూ భర్తను చీదరించుకుంది.’’