బండెప్పకి నిద్రపట్టడం లేదు....మాటి మాటికి నులక మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు....కళ్ళు మూసుకుంటే చాలు... కళ్ళ ముందు రాముడు ముఖమే కనిపిస్తోంది.ప్రతి రోజు నిద్రలేవగానే అతను రాముడి ముఖం చూస్తాడు.రాముడ్ని చూడకుండా అతడికి పొద్దు పొడవదు.అయితే రేపటి నుంచి తనకా అదృష్టం లేదు. ఎందుకంటే రేపటి తరువాత రాముడు ఉండడు. అయితే రాముడ్ని చూడకుండా తను ఉండ గలడా? రాముడు లేకుండా తను బతకగలడా?అతను అంతగా ఆలోచిస్తున్న ఆ రాముడు మనిషి కాడు, అతని కొడుకూ కాడు, అది అతడి ఎద్దు పేరు.అయితే రాముడ్ని ఎద్దు అనటం అతడికి ఇష్టం లేదు. ఎవరైనా ఎద్దు అని అంటే వాళ్ళ మీదికి గయ్‌మని లేచేవాడు. ఎందుకంటే అత నెప్పుడూ రాముడ్ని ఓ జంతువులా చూడలేదు. తన కుటుంబంలో ఒక్కడిగా చూశాడు. తన పెద్ద కొడుకుగా భావించాడు. తన కుటుంబ బాధ్యతలు పంచుకుంటున్న కుటుంబ సభ్యుడిగా అనుకున్నాడు.రాముడికి నాగలి కట్టినా, బండి కట్టినా పని పూర్తయ్యేంతవరకు ఓ మనిషితో మాట్లాడుతున్నట్టు బండెప్ప దాంతో మాట్లాడేవాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పశువుల కొట్టంలోనూ దానితో కబుర్లు చెబుతూ గడిపేవాడు. 

ఇంట్లో జరిగిన సంబరాల్ని, సమస్యల్ని తన కష్టసుఖాల్ని రాముడితో పంచుకుంటూ తన గుండె భారం దించుకునేవాడు. యజమానిచెప్పే మాటలు ఆ మూగజీవికి అర్థం అయ్యేవో లేవో కానీ అది బుద్ధిగా తల ఊపుతూ అతని మాటల్ని వింటూ ఓదా ర్పుగా అతడి చేతులను, మూతిని నాకుతూ సాంత్వన కలిగించేది. బండెప్ప, రాముల అనుబంధం గురించి అతని ఇంట్లోనే కాదు, నాలుగు వందల గడపల ఆ చిన్న కుగ్రామంలోని జనాలందరికి తెలుసు.. వాళ్ళు ఈ వింత గురించి రోజుకు ఒక్కసారైనా మాట్లాడుకునేవారు.పులికొండ...సీమలోని ఓ కుగ్రామం. బండెప్పది అదే గ్రామం. అతను బోళా మనిషి. కుట్రలు, కుతం త్రాలు తెలియని మనిషి. పాలలాంటి స్వచ్ఛమైన మనస్సున్న మనిషి. పుట్టినప్పటి నుంచి తన ఊరే తనకు ప్రపంచం. చిన్నచిన్న పనులకు మాత్రం అదీ మరీ అత్యవసరమైతేనే దగ్గర్లోని ఆదోనికి వెళ్ళేవాడు. ఎప్పుడైనా తప్పనిసరైన పరిస్థితిలో పొద్దుగూకే వేళకంతా ఇల్లు చేరుకునేవాడు. ఒక వేళ బస్సు దొరకకపోయినా పట్నంలో ఉండకుండా నాలుగు మైళ్ళు నడిచి తన ఊరు చేరుకునేవాడు. తన ఊరంటే అతడికి అంత ప్రేమ.