వానలో తడిసిన యాపచెట్టు కొమ్మల్ని ఇదిలించింది. పలపలా చినుకులు రాలినాయి.రాశింటి దీపం తలాడిస్తా కత చెప్పడం మొదలెట్టింది.ఆపొద్దు మాపటేల వానపడింది. నాలుగు చినుకులకే ఊరంతా మట్టివాసనతో పలవరిస్తా వుండాది.పీలేరు తల్లి లోగొంతుతో గలగలా పాటనందుకునింది.కొండలూ, చెట్లూ బిత్తలతో స్నానమాడినాయి. నేలతోపాటూ మనసూ తడిసిపొయింది.వాలిపొయిన బీరతీగను పందిలికి అల్లిస్తా వుండాడు పీరుబాబు.‘‘బాబూ... నీతో పనుండాది ప్యాంటూ, చొక్కాయి ఏసుకో. ఎండి సామాను అంగిడికి పొయిరావల్ల’’ అంటా ఉరుములా వచ్చింది చిన్నత్త.చిన్నత్త కళ్లల్లో కడిగిన ముత్తెంలాంటి ఆకాశం తొంగిచూస్తా వుండాది.కరువుపెట్టింది. సేద్దిం పనులేమి లేకపోవడంతో చిన్నత్త కూడా పీలేరుకు వచ్చేసింది. గర్నమెంటు హాస్టల్లో పిలకాయలకి వంట చేస్తింది. నెలకి ఏడునూర్లు జీతం.ఇద్దరం ఇంట్లోకి వస్తిమి. కల్లేణమ్మ కాఫీ పెట్టి ఇచ్చింది. చిన్నత్త గలాసు తిప్పి తిప్పీ వూపుకుంటా తాగతా వుండాది.‘‘ఎండి సామాను అంగిడికి ఎందుకత్తా? నీ అల్లుడ్ని నేను వుండానుగదా! ఏం కావాలో చెప? కాళ్ళకు గజ్జెలా? ముక్కుకి ముక్కరా? నడుముకు వడ్డాణమా? ఏం కావాలో చెప?’’ అని యగతాళి చేసినాడు.

‘‘ముసిలిదాన్ని నాకెందుకుగాని, అవన్నీ నీ పెండ్లానికి కొనియ్యి. నాకు మనవరాలు పుట్టింది. గవర్నమెంటు ఆసుపత్రిలో నా కోడలు తీర్తమాడిందంట. నీ బామ్మర్ది కూతురు పుట్టిందని తెలిసి ఆ పక్కకు రాలేదంట. కొడుకు పుట్టుంటే ఏడు గుర్రాల మింద సవారి తీస్తా వచ్చుండు!’’ అని కొడుకుని తిట్టుకుంటా కాఫీ తాగి గలాసు కిందపెట్టింది.‘‘అయ్యో ఆడబిడ్డా! ఆడబిడ్డగా పుట్టేకంటే అడవిలో మానై పుడితే బాగుండు’’ అని నిట్టూర్చింది కల్లేణమ్మ.‘‘ఏంది కల్లేణా అట్టంటావు. ఆడదానిగా పుడితేనేమి. మగాడిగా పుడితేనేమి. ఒగరిమింద ఆధారపడకుండా మన కాళ్లకింద మనం మొగలాయిలా బతకల్ల. కొడుకైతే కుచ్చుల కుల్లాయి పెడతాడా? నాకూ వుండాడు కొడుకు ఏం చెయ్యను? సస్తే కొరివి పెట్టి ఆస్తి తన్నకపొయ్యేదానికి గుంతకాడ నక్కలా కాసుకోని వుంటాడు తప్పనిచ్చి ఎందుకూ పనికిరాడు’’ అనింది చిన్నత్త.‘‘మొగలాయి లాంటి మాట చెప్పినావు అత్తా!’’ అన్నేడు పీరుబాబు.‘‘నువ్వు లెయ్యి పీరుబాబు. నా మనవరాలికి కాళ్ళకు గజ్జెలు కొనల్ల. అంతేకాదు, నా మనవరాలి పేరుమింద పాసుబుక్కు తీసియ్యి. జీతం దుడ్డు బేంకిలో వేస్తాను’’ అని తొందరపెట్టింది.