వివాహమనే తుఫానులో చిక్కుకుని, భార్యనే భల్లూకానికి బలైపోతున్న - ప్రతి భర్తకి ‘పరమ ఓరిమి చక్ర’ అవార్డులు ప్రభుత్వం ఎందుకు ప్రకటించదో వెంగళరావుకు అర్థం కాదు! శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తక్కిన అన్ని విషయాలలోనూ తెలివిగా ప్రవర్తించే మగాడు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి బొక్క బోర్లాపడతాడు. కాబట్టి వెంగళరావు విషయంలో కూడా ఎటువంటి మినహాయింపు లేదు.పెళ్లి రోజంటే అందరూ వున్నారు కాబట్టి, ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని, చేతులు వణుకుతున్నా వెంగళరావు తాళి కట్టేసాడు. ఆ తర్వాతి కార్యక్రమాన్ని తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఈ శోభనాన్ని ఎవరు కనిపెట్టేడురా దేవుడా! పులినీ, మేకను ఒకే బోనులోకి నెట్టినట్టు భార్యభర్తలిద్దరినీ ఒంటరిగా ఒకే గదిలో బంధించడమేమిటి? ఈ దురాచారాన్ని అరికట్టడానికి ఏ సంఘ సంస్కర్తన్నా నడుం బిగించవచ్చు కదా!!ఇంతలో మిత్రులంతా వచ్చి ముహూర్తం దగ్గర పడుతోందని చెప్పి, వెంగళరావును శోభనపు గదిలోకి లాక్కెళ్లారు.

అమ్మవారికి బలి ఇవ్వడానికి సిద్ధం చేసిన గొర్రెపిల్లలా బేలగా చూసేడు. ‘అందుకే మగాడికి మగాడే శత్రువు అన్నారు’ అని మనసులోనే అనుకున్నాడు. స్నేహితులు అతన్ని గదిలోకి నెట్టేసి, బయట తలుపుకు గొళ్లెం పెట్టేసారు.కొంతలో కొంత నయం. పెళ్లి కూతురింకా గదిలోకి అడుగు పెట్టలేదు. ఈలోగా మానసికంగా సిద్ధమవడానికి అతనికి కాస్త సమయం చిక్కింది.గత కొద్ది రోజులుగా జరిగిన సంఘటనలు రింగులు రింగులుగాఅతని కళ్లముందు గింగరాలు కొడుతున్నాయి. పెళ్లిరోజు దగ్గర పడడంతో వెంగళరావు మొహంలో ప్రేతకళ రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ప్రాణస్నేహితుని సలహాపై అతను ఓ ప్రముఖ హిప్నటిస్టును సంప్రదించేడు. అతను వెంగళరావు ముందు కొన్ని విచిత్ర విన్యాసాలు చేసి ‘‘నువ్వు మగాడివి. నువ్వు గండర గండడువి. ఎంతటి మొండి పెళ్లాం వచ్చినా, నువ్వామెను దండించి లొంగదీసుకుంటావు. తొక్కలో పెళ్లాం.... ఓ లెక్కా...’’ అని సజెషన్సు ఇస్తూ వున్నాడు. ఇంతలో లోపలి గదిలోంచి అతని భార్య పచ్చడి బండను చేతిలో పట్టుకొని హటాత్తుగా అక్కడ ప్రత్యక్షమైంది.