ఆ ఇంటి ముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాల స్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల పాత బిల్డింగు. గుర్తులన్నీ సరిపోయాయి.అయినా లోపలికి వెళ్లాలంటే భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. గేటు ముందరేనిలబడి లోపలికి వెళ్లటమా, మానటమా అనే సందిగ్ధంలో పడింది.వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా?ముగ్గురు పిల్లలు, సంపాదనలేని తాగుబోతు మొగుడు, ముసలి అత్త, ఆవిడ రోగాలు, ఇంటిల్లిపాది ఖర్చులు, అప్పులు.. అన్నీ గుర్తొచ్చాయి.ఇంట్లో పరిస్థితులు గుర్తొచ్చే కొద్దీ ఆమె అక్కడ నిలబడలేకపోయింది. వెనక నుండి ఏదో శక్తి ముందుకుతోస్తున్నట్లుగా చప్పున కదిలి గేటు తెరచుకుని లోపలికి అడుగు పెట్టి కాలింగ్‌ బెల్‌ మోగించింది.అప్పటికే ఆమెకు మొహంనిండా చెమట్లు పట్టేశాయి.ముప్పై అయిదు దాటి వుంటుంది వయసు. సన్నగా పొడవుగా వుంది. ముదురు రంగు చీర, చామనఛాయ.తలుపు విసురుగా తెరచుకుంది.‘ఎవరూ..’‘నేనండీ.. కమల.. కమలమ్మ..’‘ఏం కావల్ల? ఎవరికోసం’‘నేను.. పని కోసమండి. మీ పక్కింట్లో పనిచేసే సుభద్రకి మనిషి కావల్లని చెప్పారంట కదా!’ గబగబా అనేసింది కమలమ్మ.నుదుటిపైన పట్టిన చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ పూర్తిగా తెరవబడని తలుపువైపే చూస్తూ నిలబడింది. 

కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు పూర్తిగా తెరచుకుంది. భారీ శరీరం ఒకటి సోఫాలో నింపాదిగా కూర్చుంది. టీపాయ్‌ మీద ఏవేవో తినుబండారాలు కనబడుతున్నాయి.టీవీలో ఏవేవో దృశ్యాలు కదిలిపోతున్నాయి.‘ఊ.. ఎక్కడుండేది నువ్వు. ఏయే పనులు చేస్తావ్‌? బాగా పని చేస్తావా? ఎంత కావల్ల నీకు నెలకు?’’టీవీ వైపే చూస్తూ అడిగింది ఆ ఇంటి యజమానురాలు జానకమ్మ.‘అన్ని పనులూ చేస్తానమ్మా.. మీ పక్కింట్లో పని చేసే సుభద్ర ఉండేది మా పక్క వీధిలోనే. మేం నాగలకుంటలో వుంటాం. జీతం మీ ఇష్టం అమ్మా..’మెడ వంచి చేతులు పిసుక్కుంటూ చెప్పింది కమలమ్మ.తలెత్తి ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూడాలనుకుంది. అది చాలా పెద్ద ఇల్లని తెలుస్తోంది. ఎంతుందో, ఎంత పనుంటుందో తెలుసుకుందామనుకుంది. ఇంట్లో ఎంతమంది వుంటారు? ఏయే పనులు చెయ్యాల్సి వుంటుందో అమెనే అడుగుదామనుకుంది. కానీ అడగాలనుకున్న మాటలన్నీ గొంతులోనే ఉండిపోయాయి. ఇంకేం అడుగుతుందో, ఏం జవాబులు చెప్పాలో అని మనసులోనే అనుకుంటుంటే కమలమ్మకు అప్పుడొచ్చిందొక అనుమానం.ఆ అనుమానం మనసులోకి రాగానే ఆమె మొహం కళ తప్పింది. అడుగుతుందా? ఈ కొత్త యజమానురాలు కూడా తనను ఇంట్లోంచి, పనిలోంచి వెళ్లిపొమ్మనటానికి తన వెనుకబాటు తనాన్నే ఆయుధంగా వాడుకుంటుందా?తల కొంచెం పైకెత్తి జానకమ్మ వైపు చూసింది. ఆమె మొహం టీవీకే అతుక్కు పోయివుంది. ఆ మొహంలో టీవీలోని పాత్రల హావభావాలు తాలూకు ప్రతిస్పందనలు స్పష్టంగా కనపడుతున్నాయి. తల తిప్పకుండానే టీవీలో ప్రకటనలు వస్తున్నప్పుడు ఉండుండి మాట్లాడుతోంది.