పెళ్ళి పూర్తయి అప్పగింతలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆడపిల్ల తాలూకు వారంతా కన్నీళ్ళు పెట్టుకోవడం ఆనవాయితీ. అందుకు భిన్నంగా వరుడితల్లి జయలక్ష్మి కన్నీళ్ళ పర్యంతంగా ఉంది. పైకి ఏడిస్తే ఈ పెళ్ళి ఈమెకు ఇష్టం లేదని ఆడపెళ్ళి వారనుకుంటారేమోనని ఆమెకు భయం. కన్నీళ్ళను కళ్ళలోనే నిలుపుకున్న ఆమెకు పెళ్ళికి దారితీసిన సంఘటనలు గుర్తొచ్చాయి.జయలక్ష్మికి మొదటిసారి కొడుకు సుమన్‌ పుట్టగానే ఆమె ఆరోగ్యరీత్యా ఇంకొక గర్భం దాల్చకూడదని డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసేశారు. దాంతో ఆమెకు సుమనే ప్రపంచమైంది. ‘‘ఎంతసేపూ కొడుకేనా? ఆ కొడుకుని నీకిచ్చిన మొగుడనేవాడు ఒకడున్నాడని గుర్తుందా’’ అని ఆమె భర్త జగన్నాఽథ్‌ మేలమాడేవాడు. జయలక్ష్మి పట్టించుకునేది కాదు.సుమన్‌ పెరిగి పెద్దవాడయ్యాడు. బాగా చదువుకుని ఉన్న ఊళ్ళోనే మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అందరి పిల్లలూ అమెరికా ఎగిరి వెళ్ళిపోయే రోజుల్లో కొడుకు స్వదేశంలో అందునా సొంత ఊళ్ళో ఉద్యోగం తెచ్చుకోవడం జయలక్ష్మికి మహదానందమైంది.‘‘ఇంక వీడికి పెళ్ళి చెయ్యాలి’’ అంది జయలక్ష్మి‘‘కొడుకుని ఇంత గాఢంగా ప్రేమిస్తున్న దానివి నువ్వు వాడిని కోడలితో కాపురం చెయ్యనిస్తావా? నీ కొంగే పట్టుకు తిరగమంటావా’’ అన్నాడు జగన్నాథ్‌ హాస్యంగా.‘‘అలా ఏం చెయ్యను. నాకెలాగూ కూతుళ్ళు లేరు. కోడలినే కూతురుగా చూసుకుంటాను. 

ఇద్దరూ ఆనందంగా ఉంటే చూసి సంతోషిస్తాను. ధనమక్కరలేదు, అమ్మాయికి గుణముంటే చాలు’’ అంది జయలక్ష్మి.‘‘అయితే ప్రయత్నాలు మొదలెడదాం’’వాళ్ళు ప్రయత్నాలు మొదలెట్టకుండానే సుమన్‌ ఒకమ్మాయిని తీసుకొచ్చి ‘‘ఈమె సౌమ్య. నా కొలీగ్‌’’ అని పరిచయం చేశాడు. జయలక్ష్మి కూచోపెట్టి, అతిథి మర్యాదలు చేసి, మాట్లాడింది. సౌమ్య ప్రతిదానికీ ఆఁ అనో ‘ఊ’ అనో అంది తప్ప మాట్లాడలేదు. కొంతసేపు బెరుకేమో అనుకుంది కానీ జయలక్ష్మికెందుకో ఆమెకు తనతో మాట్లాడ్డం ఇష్టం లేదా అని అనుమానమొచ్చింది.సౌమ్య వెళ్ళాక సుమన్‌ అసలు విషయం బయట పెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానన్నాడు. జయలక్ష్మి నిర్ఘాంత పోయింది. తేరుకున్న జగన్నాథ్‌ ‘‘పిల్ల కుటుంబమూ, సంప్రదాయమూ చూడాలి కదా’’ అన్నాడు.‘‘ఈ రోజుల్లో కూడా కులమూ, గోత్రమూ, మతమూ చూస్తారా?’’ అన్నాడు సుమన్‌.‘‘కుల గోత్రాలు కాదు వాళ్ళ కుటుంబ వివరాలు..’’‘‘మనకన్నా కూడా వాళ్ళు డబ్బున్న వాళ్ళు. వాళ్ళ నాన్నకి బిజినెస్‌ ఉంది. ఇద్దరే అమ్మాయిలు’’‘‘వియ్యానికైనా కయ్యానికైనా సమాన ఫాయా అన్నారు. మన మధ్య తరగతి ఇంట్లో ఆ అమ్మాయి ఇమడగలదా ?’’‘‘నాకింత జీతం వస్తున్నాక మనం మధ్యతరగతేమిటి? ఎక్కువ తక్కువలు మన మనస్సులో ఉంటాయి. ఆ అమ్మాయి నా కన్నా నెల రోజులు పెద్దది. అయితే మాత్రం...’’