‘కటిఘటిత మేఖలా ఖచిత మణి ఘంటికా పటల నినదేన విభ్రాజమానం...భావయామి గోపాల బాలం . . . ’’సుబ్బలక్ష్మి మధుర కంఠం బాల గోపాలుడి అల్లరి రూపాన్ని కళ్ళముందు బొమ్మ కట్టిస్తూ గాలిలో తేలివస్తోంటే, మనసుకి ఏదో అయిపోయినట్లైంది. అప్రయత్నంగా కంప్యూటర్‌లో చూస్తోన్న ఫైల్‌ని క్లోజ్‌ చేసి లేచి నిలబడ్డాను. ఎందుకో నాకే తెలీదు. ఏం చేయాలో తోచలేదు. మళ్ళీ కూర్చున్నాను.ఏదో ‘మిస్సింగ్‌’ జీవితంలో! సున్నితమైన పొర ఏదో రోజుకి కాస్త కరిగి పోతోంది. ఓజోన్‌ పొర కరిగి పోయినట్లు!‘‘గ్రీడ్‌’ హౌస్‌ ఎఫెక్ట్‌’’!‘గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌’ కన్నా ప్రమాదకరమైనది.ఈ-మెయిల్‌ తెరవగానే ఏవో పిచ్చి పిచ్చి మెయిల్స్‌... ఎలా కనిబెడతారో వీళ్ళు అడ్రసులు!‘ఒంటరిగా వున్నావా? కంపెనీ కావాలా?’‘నా కొల్తలు ఇవి. ఒంటరిని. జంట కావాలి. ఎనీ కెమిస్ర్టీ?’ఇలాంటివి ఓ రకం.‘నీకు ఫలానా లాటరీలో ఫలానా బహుమతి తగిలింది. కొన్ని లాంఛనాలు ఉన్నాయి. వాటికో ఇరవైవేలు పంపు. చెక్కు మీ గుమ్మంలో, పది మిలియన్‌ డాలర్లకి. త్వరపడు’ఇవి ఇంకో రకం.డబ్బు! మోసం! సెక్స్‌!వీటి మధ్య సురేఖ మెయిల్‌ కోసం ఆశగా చూస్తుంటాను.ఇండియా నించి వెనక్కి ఎప్పుడొస్తుందో! పెళ్ళికని వెళ్ళింది.సురేఖ!నాకు రెండేళ్ళు జూనియర్‌ తను. పదిహేనేళ్ళక్రితం!నేను మూడో సంవత్సరంలో వుండగా, తను కాలేజీలో చేరింది. అప్పటికి ఆడపిల్లలు ఇంజినీరింగ్‌ చదవడం మొదలై ఆట్టే రోజులు కాలేదు.సురేఖ ‘మెకానికల్‌’ తీసుకుంది.

జేబురుమాలు పట్టుకుంటేనే కంది పోతాయేమోనన్నట్లుండే ఆమె వేళ్ళు ‘పది పౌన్ల హ్యామర్‌’ మొయ్యాలి.‘బొమ్మ పెండ్లిండ్లకు పోనొల్లనను బాల, రణరంగమున కెట్లు రాగడంగె . . ’పోతనగారు! ఈ ఇండియా నన్ను వదలదు.రెండో సంవత్సరంలోకి అడుగుబెట్టాక నాకు బాగా దగ్గరైంది సురేఖ.‘‘నీ హ్యామర్‌ నేనెందుకు మొయ్యాలి? నువ్వే మోసుకో’’ అనే వాణ్ణి విసుగ్గా వున్నప్పుడు.‘‘ఎందుకా?! తరవాత లైఫ్‌ అంతా నీ ‘హ్యామర్‌’ నేను భరించొద్దూ! అందుకు’’ అనేది తను.సురేఖది పల్లెటూరు. ఓ వేసం కాలం శలవుల్లో వాళ్ళ ఊరికి రమ్మని ఆహ్వానించింది. వెళ్ళాను.సురేఖని గుర్తుపట్టలేకపోయాను.‘పట్టులంగా, ఓణీ! కళ్ళనిండా కాటుక! జడగంటలు! పూలజడ! కాళ్ళకి పట్టీలు!’ప్యాంటు కట్టుకుని పైన టాప్సు వేసుకుని తిరిగే సురేఖేనా ఈమె?!ఆ వూళ్ళో పది రోజులు వున్నాను. సురేఖ నాన్న మాటల్లో పెట్టి నా కులం, గోత్రం కనుక్కున్నాడు.కులం ఒకటే! ఓకే! గోత్రం ఒకటి కాదు! డబుల్‌ ఓకే!తరువాత రెండేళ్ళకి సురేఖ చదువు అయిపోయింది. ఆ ఎండాకాలమే మా పెళ్ళి అయిపోయింది.నేను పని చేసే చోటే సురేఖకీ ఉద్యోగం దొరికింది. ఓ అయిదారేళ్ళు హాయిగా వున్నాం.