శ్రీవాత్సవ సాదా గుమాస్తా గిరీలో ఉంటూ ఖరీదైన ఇంగ్లీషు చదువులంటూ వెంపర్లాడటం... పిల్లలమీద ఒకటే ఒత్తిడి తేవటం కైలాసమూర్తికి సుతరామూ ఇష్టం లేదు.‘‘ఎందుకురా! కూనలుగా పుట్టినప్పటినుండీ వెధవ చదువులు... రెన్నాళ్ళు ఆటపాటలతోతిరగనివ్వు. చదువు, చదువు అంటూతినేయకు. మేమంతా మాతృభాషలోచదువుకోలేదా? ఉద్యోగాలుచెయ్యలేదా?’’ అని ఆగ్రహించే వాడుకైలాసమూర్తి.‘‘అదికాదు నాన్నగారూ! ఈ తరంపిల్లల్లో పోటీ బాగా ఉంది. మీలాంటి,నాలాంటి చదువులు కావు, అంతాస్పీడు యుగం. చిన్నప్పుడే పునాదిఇవ్వాలి’’ అనేవాడు శ్రీవాత్సవ...తనమానాన తాను పబ్లిక్‌ స్కూల్లోజాయిన్‌చేసే ప్రయత్నాలను కొనసాగిస్తూ.శ్రీవాత్సవకు పెళ్ళయిన యేడాదికే మగ కవలలు. వాళ్ళు ఇలా పెరిగారో లేదో అలా చదువుల గోల మొదలైంది. భార్య అనన్య పిల్లలు శరణ్‌, చందన్‌లను ఖరీదైన స్కూళ్ళలో వేద్దామని పట్టుబట్టింది. కైలాసమూర్తి మాటను కొట్టిపారేసి మరీ చేర్చారు.తెల్లవారుఝామున లేచిపోయి పిల్లలకు భోజనాలు తయారుచేసి బాక్సులు కట్టిచ్చేది. బస్సుకి దిగబెట్టేది. సాయంత్రం చీకటిపడ్డాకే పిల్లల ఉనికి.మనవళ్ళు రాగానే ‘తాతయ్యా’ అంటూ కైలాసమూర్తిని అల్లుకు పోయే వారు. అప్పుడువారికి తన చిన్ననాటి కబుర్లు కథలు చెబుతూ ఉండే వాడు. 

కొంతకాలానికి అవీ కనుమరుగయ్యాయి.‘‘మామయ్యగారూ! వాళ్ళకి బోలెడు వర్కులున్నాయి. అవి చేయించే సరికి రెండు గంటలు పడుతుంది. తరువాత తిండి, నిద్ర, దయచేసి వాళ్ళని పాడుచేయొద్దు’’. కోడలి మాటలు శరాఘాతంలా తగిలేవి కైలాసమూర్తికి.అదే పరిస్థితి అయిదారుసార్లు ఎదురయింది. పిల్లలను దూరంగా చూడ్డమే మిగిలింది. దగ్గరగా తీసుకోవాలన్న కోరిక ఎండమావి అయింది. ఎప్పుడైనా కొడుకు, కోడలు బయటకు వెళ్ళినప్పుడు చాటుగా వారిని అక్కున చేర్చుకొని కన్నీరు విడిచేవాడు కైలాసమూర్తి.మధురమైన బాల్యం అనుభవించాల్సిన అపురూపమైన ఈ పసి వయసులో అరదండాలు బిగించినట్టుగా పిల్లల స్వేచ్ఛకు భంగపాటును కల్గిస్తున్నారు. చిట్టిచిట్టి చేతులు నొప్పి పుట్టేంత రాతపనికి బలైపోవటం చూసి భరించలేక పోయాడు కైలాసమూర్తి.ఒకసారి ఉండబట్టక ఆ మాటే అనేసాడు కైలాసమూర్తి. కొడుకు, కోడలు తాడెత్తున లేచారు.‘‘మీకు తెలీదు నాన్నగారు! ఇప్పటి తల్లిదండ్రులు వారిపిల్లలను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారో గమనించండి. డబ్బు, శ్రమ రెండు లెక్క చేయడం లేదు’’ చికాగ్గా అన్నాడు శ్రీవాత్సవ.