‘‘ఏమే, రాదా? ఏం జేస్తన్నవే’’ అంటూ, ఇంట్లోకి వచ్చింది పక్కింటి యాదమ్మ.‘‘ఇప్పుడే అన్నం పడేసినా, అక్కా’’ అంది రాధ, వెనక్కి తిరుగుతూ. ఆమె అసలు పేరు రాజమ్మ. వెంకటేశం దగ్గరికొచ్చాక ఆమె తన పేరు రాధగా మార్చుకుంది.‘‘నీ మిండ మొగుడు ఊళ్ళో లేడా ఏంది?’’‘‘లేడు, ఊళ్ళ పైకెళ్ళిండు. అయినా గట్ల మాట్లాడతవేందక్కా! మొగడు అనరాదొ! మిండమొగడేంది?‘‘నీ అసలు మొగుడు బతికేఉన్నడు, గందే? మరి ఈడు మిండడు గాక మొగడెట్లయితడు?’’‘‘అదేంటక్కా! మగాడు ఎంతమందితో ఉన్నా, ఆడికంతా పెళ్ళాలే. పెద్ద పెళ్ళాం, చిన్నపెళ్ళాం అంటారనుకో. మరి ఆడదాయి కొచ్చేసరికి ఇంత అన్యాల మెందుకు?’’‘‘మొదట్ది పెళ్ళాం, రెండోది ఉంచుకున్నది అని కూడా అంటరు...’’‘‘నేనీడికి పెళ్ళాన్నే. ఈడికి పెళ్ళికాలేదు’’‘‘అంత బరవాసా ఏందే? ఆడు చెప్పిన మాటేగందా?’’‘‘నేనంత తెలివితక్కువదాన్ని కాదక్కా! ఈడిని నమ్ముకుని వచ్చేసేంత పసిదాన్ని కాదు. అర్సుకున్నా, అప్పుడు కానీ ఈడితో రాలేదు. అయినా గోవిందును మర్చిపోలేకుంటినక్కా!’’ గోవిందు ఆమె మొదటి మొగుడు.‘‘ఆడ్ని కూడా తెచ్చిపెట్టుకో. కత మంచి రక్తి కడతది’’.‘‘తప్పేంది?’’‘‘తప్పున్నర! పాపం పున్నెం సంగతొదిలెయ్‌. 

ఎర్రిమొకమా! పిల్లల్ని కనేది ఎవరే? ఆడదేనా? నలుగురు నడిచే తోవన మొక్కలు మొలవవంటరు. అట్టాంటి ఆడదానికి పిల్లలు పుట్టరు. ఒకేళ పుట్టినా, ఆళ్ళు పెద్దమొగడి పిల్లలా, చిన్నమొగడి పిల్లలా ఎవరు తేలుస్తరు. అందుకనే ఈ కట్టడి చేసిన్రని మా ఇంటోడు చెప్పిండు. మొగోడు ఎంత మందినయినా కట్టుకోవచ్చునంట, ఆడది మాత్రం ఒక్క మొగాడితోనే ఉండాలంట!’’యాదమ్మ విషయాన్ని విడమర్చి చెప్పినా, రాధకు సమర్థింపు కలుగలేదు.‘‘నీకు సమఝకాలే. అసలు సంగతి చెప్తనినుకో. ఆడదాన్నికున్న ఓర్పు మగోడికుండదు. మగడు ఇంకోదాని దగ్గర పడుకోనొచ్చినా ఆడది ఓర్చుకుంటాది. మొగోడు ఓర్వలేడు. ఆడది ఆడి సొంతం. పరాయోడ్ని కన్నెత్తి చూసినా సయించుకోలేడు. నీ మిండడి తాన గోవిందు ఊసెత్తు. ఆడు నీ బొక్కలిరగ్గొట్టక పోతే నా పేరు యాదమ్మ కాదు. ఇనకుంటివా, రక్తపాతం అయిపోతాది’’.రాధ సమస్య అదే. ఆమెకు తన మొగుడు గోవిందు మీద ప్రేమ చావలేదు. అతడి దగ్గరి బతుకులో సుఖం లేదు. అందుకే ఆమె వెంకటేశం గాలం వెయ్యగానే తగులుకుంది. రాధ ఆలోచనల్లోకి జారుకోవటంతో, యాదమ్మ, ‘‘సర్లే, నీ మనసీడున్నట్లు లేదు. మళ్ళస్త’’ అని తన ఇంటికి పోయింది.‘తమది మహబూబ్‌నగర్‌ జిల్లా, బిజినేపల్లి. తనకు చిన్నతనానే మనువయినాది. గోవిందుదీ, తనదీ ఒకటే ఊరు. అప్పటికి తన మామ కొద్దిపాటి రైతే. నాలుగు ఎకరాల భూమి ఉండేదంట. వానల్లేక, పంటలు పండకా, పెద్ద కుటుంబమయ్యీ, ఒకొక్క ఎకరమూ అమ్మటం మొదలెట్లినాడు మామ. తన పెళ్ళయ్యే నాటికి ఒక ఎకరం మాత్ర ముండె. తనమొగుడి కంటే పెద్దోళ్ళు ఇద్దరి ఆడబిడ్డల పెండ్లిండ్లూ అయినప్పటికే ఇంట్లో పెద్దమ్మ వచ్చికూర్చున్నాది. కొడుక్కి పెళ్ళిచేస్తే ఏదో లప్పమొచ్చి ఇంట్లో పడుతుందను కున్నాడు మామ. తన తండ్రికి పైసలొదిలుండె గానీ, ఈయ్నకు మిగిలిందేమీ లేకుండె...’