షర్ట్‌ ఫుల్‌ స్లీవ్‌లో నుంచి కనబడుతున్నది చెయ్యి. ఒక చూపుడు వేలు గోకుతోంది కుడిచేతి వైపు వీపు మీద రెక్కని. దానికి బలం ఇవ్వడం కోసం మిగతా నాలుగు వేళ్ళు సగం ముడుచుకుని ఉన్నాయి. బూడిద రంగు మీద కొంచెం వెడల్పుగా ఉన్న నిలువు చారల షర్ట్‌. కాస్త ఖరీదైన బ్రాండెడ్‌ షర్ట్‌ లాగే ఉంది. షర్ట్‌ పాంటులోకి దోపాడు. నలుపు రంగు పాంట్‌. పాంట్‌కి నల్లరంగు రెక్జిన్‌తో చేసిన బెల్ట్‌. కాస్త పాలిష్‌ తగ్గిన హై హీల్‌ షూస్‌. ఇంకా ఆ ఎడం చెయ్యి వీపుని గోకుతూనే ఉంది. ముఖం కనపడటం లేదు. అటువైపు తిరిగి ఉంది. పక్కన నిలబడి మాట్లాడుతున్నవాడు మొహంతి. చేతిలో సాసర్‌. సాసర్‌లో చిన్న బౌల్‌. బహుశ అందులో టమోటా సూప్‌ ఉన్నట్టుంది. నా అడుగులు వాడివైపే పడ్డాయి. నవ్వుతూ పలకరించాడు.‘‘వీరిని కలిసావా?’’ అని వీపు గోక్కుంటున్న అతనివైపు చూస్తూ అన్నాడు. అతను నా వైపు తిరిగాడు. గుండ్రటి కళ్ళు. స్మోకింగ్‌ వల్ల నల్లబడ్డ పెదాలు చిరునవ్వుతో విడివడ్డాయి. కళ్ళలో స్నేహం ఛాయలు తొంగిచూసాయి.

 ఆ క్షణంలోనే స్నేహానికి నాంది పడింది. తల అడ్డంగా ఊపాను. ‘‘వీరి పేరు లంకేష్‌. బెంగుళూర్‌ నుండి వచ్చారు పోయినవారం’’ పరిచయం చేశాడు మొహంతి. గోక్కోవడం ఆపి, ముందుకు తెచ్చిన ఎడం చేతిలోకి తన కుడిచేతిలో ఉన్న కప్పుని మార్చుకుని, నవ్వుతూ చేతిని అందించాడు కరచాలనం కోసం. ‘‘వీరు కపూర్‌, అడ్మిన్‌ హెడ్‌’’ అంటూ నన్ను పరిచయం చేశాడు అతనికి. ‘‘ఏవిటీ అప్పుడే అయిపోయిందా సెషన్‌?’’ అంటూ మొహంతి వైపుకి తిరిగాను. నా మాటలు వినకుండా ‘‘లంకేష్‌ సీఆర్‌కి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చారు’’ అని మరికొంత సమాచారం అందించాడు. ‘‘ఓహ్‌ అలాగా, వెల్‌కం టు హెచ్‌.ఓ. నైస్‌ టు మీట్‌ యూ’’ అంటూ అతనికి స్వాగతం పలికాను. అమ్రిత చేసిచ్చిన రోటీలతో నా భోజనం నా డెస్క్‌ మీదే అయిపోయింది.